Friday, 28 January 2022

స్కూళ్ల మ్యాపింగ్‌తో మెరుగైన విద్యా బోధన

 స్కూళ్ల మ్యాపింగ్‌తో మెరుగైన విద్యా బోధన 



విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి : మంత్రి సురేష్‌ 

ఏపీ విద్యా విధానాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు 

మనబడి నాడు – నేడు తరహాలో తెలంగాణలో మన ఊరు – మన బడి 

జాతీయ విద్యావిధానంలో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌తో అనర్థాలు జరుగుతాయన్నది అపోహ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైనా ఉందన్నారు. మ్యాపింగ్‌ విధానంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సచివాలయంలోని 5వ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రారంభమైన తొలిరోజు సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 

ఏ ఒక్క స్కూలూ మూతపడదు :

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని మంత్రి సురేష్‌ తెలిపారు.  నాడు – నేడు తరహాలో తెలంగాణలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్కూళ్ల మ్యాపింగ్‌తో విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ఈ విషయాన్ని స్పష్టం చేశారని, ఏ ఒక్క పాఠశాల మూత పడదని, ఉపాధ్యాయ పోస్టులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యా బోధన విద్యార్థులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా ప్రతినిధుల సూచన మేరకు జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు మంత్రి సురేష్‌ సుముఖత వ్యక్తం చేశారు.  

ప్రజల్లోకి తీసుకెళ్లాలి...

విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. నూతన విద్యా విధానం, పాఠశాలల మ్యాపింగ్‌ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్, కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్వైజర్‌ మురళి, అడిషనల్‌ డైరెక్టర్లు పార్వతి, సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జేడీ రామలింగం, మున్సిపల్‌ కమిషనర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, ఆర్జేడీలు, డీఈవోలు పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top