Thursday 16 December 2021

ఉద్యమానికి విరామం - బుగ్గనతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల ప్రకటన

ఉద్యమానికి విరామం - బుగ్గనతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల ప్రకటన



దశలవారీగా సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

ప్రభుత్వమనే కుటుంబంలో ఉద్యోగులు ఒక భాగం

కొవిడ్‌, ఇతర కారణాలతోనే జాప్యం: బుగ్గన

సమస్యల పరిష్కారానికి లిఖిత హామీ ఇస్తామన్నారు

అందుకే... తాత్కాలికంగా విరమణ: బండి, బొప్పరాజు

పీఆర్సీపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు

14.29ు ఫిట్‌మెంట్‌ అమలుచేస్తాం.. నష్టం జరగనివ్వం

ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి

సీఎంతో నేడు లేదా సోమవారం సమావేశం: సజ్జల

వరుసగా మూడో రోజూ వీడని పీటముడి

చర్చల సారాంశం సీఎంకు వివరించిన సజ్జల, బుగ్గన

 ‘పీఆర్సీపై భారీ అంచనాలు పెట్టుకోవద్దు’... అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సూచించారు. ఆ తర్వాత... ‘ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ దశలవారీగా, త్వరగా పరిష్కరిస్తాం’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పడంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. పీఆర్సీతోపాటు ఇతర అంశాలపై నెలకొన్న పీటముడి గురువారం కూడా కొనసాగింది. అటు సజ్జల, ఇటు బుగ్గన, అధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చల మీద చర్చలు జరిపారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రితో సజ్జల, బుగ్గన భేటీ అయ్యారు. పీఆర్సీపై మంగళ, బుధవారాల్లో జరిపిన చర్చల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘బుధవారం నిర్వహించిన చర్చల సారాంశాన్నీ, ఉద్యోగుల డిమాండ్లనూ ముఖ్యమంత్రికి వివరించాం. ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర విషయాలపైనా చర్చించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది. గతంతోనూ.. ఇతర రాష్ట్రాలతోనూ పోల్చుకునే పరిస్థితి లేదు. సీఎస్‌ కమిటీ సిఫారసు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తూ ఐఆర్‌కు రక్షణ ఉండేలా చూస్తాం. వేతన సవరణపై భారీ అంచనాలకు తావు లేదు.

ఉద్యోగులకు మాత్రం నష్టం లేకుండా చూస్తాం. ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నాం. పీఆర్సీ తర్వాత వారి గ్రాస్‌ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటాం. 27 శాతం ఐఆర్‌ కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పీఆర్సీ ప్రక్రియ శుక్రవారానికి పూర్తి కావొచ్చు’’ అని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. కరోనా పరిస్థితుల కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సజ్జల తెలిపారు. అదే సమయంలో... ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌ను కలిసిన తర్వాతే పీఆర్సీపై తుది ప్రకటన ఉంటుందని చెప్పారు. శుక్రవారం లేక సోమవారం ఈ భేటీ జరిగే అవకాశం ఉందన్నారు.

దశలవారీగా సమస్యల పరిష్కారం :

గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ సమీర్‌ సమీర్‌శర్మ తదితరులు సచివాలయంలో ఉద్యోగుల జేఏసీలు, ఉద్యోగుల సంఘాల నేతలతో భేటీ అయ్యారు. సుమారు 6 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు, జేఏసీల నేతలతో మంత్రి, సీఎస్‌ విడివిడిగా సమావేశయ్యారు. ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని, ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులను బుగ్గన, సీఎస్‌ కోరారు. తాము ఇచ్చిన 71 అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే  ఉద్యమాన్ని వాయిదా వేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం మంత్రి బుగ్గన, ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు.

ఇదీ మా హామీ : బుగ్గన

‘‘పెండింగులో ఉన్న అంశాలపై ఇరు జేఏసీలతో చర్చించాం. చాలా రోజులుగా వారి విజ్ఞప్తులను తీసుకుంటున్నాం. కొవిడ్‌తోపాటు వివిధ కారణాలవల్ల పరిష్కారంలో ఆలస్యమైంది.  ప్రభుత్వం ఒక కుటుంబం. అందులో... ఉద్యోగులూ భాగం. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయి. దశల వారీగా డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని బుగ్గన తెలిపారు. సీఎ్‌సతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని... తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఉద్యమ కార్యాచరణను విరమించాలని జేఏసీల నేతలను కోరుతున్నామన్నారు. వారిచ్చిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. 

లిఖితపూర్వక హామీ ఇస్తామన్నారు :

ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడంతోపాటు... దీనిపై రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినందునే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని బొప్పరాజు చెప్పారు. డిసెంబరు 7వ తేదీ నుంచి ఉద్యోగులంతా ఆందోళనలో ఉన్నారన్నారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సోమవారానికి సీఎం ప్రకటన చేయాలని కోరామన్నారు.

అదనపు పోస్టులను భర్తీ చేయాలి...

అమరావతి సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సచివాలయంలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పామన్నారు.  ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 85 అంశాలు నివేదించామన్నారు.  అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదే విధంగా జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరామన్నారు.  పీఆర్సీ నివేదిక ఇవ్వాలని తాము మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండా పీఆర్సీ అమలు సాధ్యంకాదని... కచ్చితంగా నివేదికను బయటపెట్టాల్సిందేనని తాము మొదటి నుంచీ కోరుతున్నామని తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top