Thursday 9 December 2021

ఇంటర్వ్యూలు కట్‌. మెరిట్‌కే మార్కులు.

 ఇంటర్వ్యూలు కట్‌. మెరిట్‌కే మార్కులు.



కేజీబీవీ టీచర్ల నియామకాల్లో పూర్తి పారదర్శకత.

అర్హతలు, అనుభవం ఆధారంగా అర్హుల ఎంపిక.

నేడు ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల.


కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్‌ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావిచ్చే ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అభ్యర్థుల అర్హతలు, అనుభవం ప్రాతిపదికగా మెరిట్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సమగ్ర శిక్ష అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

అభ్యంతరాలకు 4 రోజుల పాటు అవకాశం...

కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియగా గురువారం పరిశీలన నిర్వహించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితాను శుక్రవారం ఆయా జిల్లాల్లో ప్రకటించనున్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను అందులో పొందుపర్చనున్నారు. వీటిపై ఎవరికైనా సందేహాలున్నా, అభ్యంతరాలున్నా అప్పీళ్లకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. 11వ తేదీ నుంచి 14వ తేదీవరకు నాలుగు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు.

మొత్తం 100 మార్కులు...

అర్హతలు, అనుభవం తదితర అంశాలకు 100 మార్కులను కేటాయించారు. అభ్యర్థులకు వచ్చే గరిష్ట మార్కులను బట్టి మెరిట్‌ను నిర్ణయించనున్నారు. గరిష్ట మార్కులు సాధించిన వారు అగ్రభాగాన నిలువనున్నారు. కేజీబీవీల్లో రెండేళ్లు ఆపై పనిచేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటించినా వారికి మార్కులు కేటాయించలేదు. అర్హతలు, అనుభవం తదితర అంశాల్లో ఇతర అభ్యర్థులతో సమాన స్థాయిలో నిలిచిన వారికి కేజీబీవీల్లో పనిచేసిన అనుభవం ఉంటే మెరిట్‌ లిస్టులో ప్రాధాన్యం ఇస్తారు.

సమాన మార్కులు వస్తే...?

అర్హతలు, అనుభవం అంశాలలో సమానంగా ఉన్న వారి విషయంలో ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యమిస్తారు. అందులోనూ సమానంగా ఉంటే వరుస క్రమంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, తదుపరి ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతల పరంగా వరుసగా పీజీ, గ్రాడ్యుయేషన్, ఇంటర్, టెన్త్‌ మార్కులను అనుసరించి మెరిట్‌ నిర్ణయిస్తారు. విద్యార్హతల్లో సమానంగా ఉంటే ప్రొఫెషనల్‌ అర్హతల్లో మెరిట్‌ను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు.

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు...

గత సర్కారు కేజీబీవీల్లో ఎంపిక ప్రక్రియను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించడంతో దరఖాస్తులు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితాను జిల్లా అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాయి. ఈ వ్యవహారంలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడ్డాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాయి. ఒక్కో పోస్టును రూ.లక్షల్లో విక్రయించాయి. డబ్బులిచ్చిన వారికి ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు కేటాయించి మెరిట్‌ జాబితాలో చోటు కల్పించారు. ఈ అక్రమాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీల విధానాన్ని రద్దు చేశారు. అవుట్‌సోర్సింగ్‌ నియామకాలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా కేజీబీవీల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్ల నియామకాలు పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టీచర్ల నియామకాలను చేపట్టినట్లు కేజీబీవీ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top