Friday 17 December 2021

హక్కులు హరిస్తే ఊరుకోం - 55 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించండి : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు

 హక్కులు హరిస్తే ఊరుకోం - 55 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించండి : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు



రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 55 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని ఎపి జెఎసి, జెఎసి అమరావతి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపారు. పెండింగ్‌ డిఎలు ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సిగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని నినదించారు. 70 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను హరిస్తే ఊరుకొనేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

     విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం విరమించే ప్రసక్తేలేదని, సిఎంతో భేటీ సందర్భంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటామని ఎపి జెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి జెఎసి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా సమగ్రమైన అభివృద్ధి లేదన్నారు. పట్ణణ పౌర సమాఖ్య కన్వీనరు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. కలెక్టరేట్‌ గేట్లను మూసివేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా దాదాపుగా మూడు గంటలపాటు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరులో తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పాల్గొని మద్దతు తెలిపారు. గుంటూరు తాలుకా సెంటర్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఒక పూట సెలవు పెట్టి మరీ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని మద్దతు పలికారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు, నాలుగు నెలలుగా ఉద్యోగుల సమస్యలపై నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని, ఇది సరైన విధానం కాదని తెలిపారు. విజయనగరంలోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద వందలాది మంది ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల పోరాటానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సబ్బరావమ్మ మద్దతు తెలిపారు. విశాఖపట్నం కలెక్టర్‌లోని ఎన్‌జిఒ హోం వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇరిగేషన్‌ ఎస్‌ఇ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించారు. మండపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలోని చెక్‌పోస్ట్‌ సెంటర్‌లో దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి మండలాల యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌, పిఆర్‌టియు నాయకులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని తాలూకా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు పాల్గొని మద్దతు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్‌జిఒ హోం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ, విశ్రాంత, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు చేపట్టారు. ప్రకాశం, కడప జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top