పది పరీక్షలపై రేపు కీలక ప్రకటన
♦ కరోనా తీవ్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి
రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ, పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో వాటి కొనసాగింపుపైనా చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు, బోధనా సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. అలాగే నిత్యం కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది లాక్ డౌన్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అందువల్ల పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది ఆలస్యంగా జూన్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డా. సురేష్ గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలా లేక పొరుగు రాష్ట్రాల్లోలా రద్దు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.
0 Post a Comment:
Post a Comment