Wednesday 21 April 2021

‘టీకాతోనే 100% రక్షణ’ - డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

 ‘టీకాతోనే 100% రక్షణ’ - డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

 


🔅అర్హులైన వారందరికీ టీకాలిస్తే మూడోదశ ఉండదు.

🔅ఏ టీకా అందుబాటులో ఉంటే అది తీసుకోండి.

🔅అందరూ మాస్కులు ధరిస్తే లాక్‌డౌన్‌తో సమానమే.

🔅రెండోదశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్‌.

🔅30-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30 శాతం మందిలో తీవ్ర అస్వస్థత.

🔅‘ఈనాడు’ ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి


కొవిడ్‌ మహమ్మారి నుంచి 100 శాతం రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందజేస్తే.. మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి ఉండదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ కూడా సమర్థమైనవేననీ, ఏ టీకా తీసుకున్నా పనితీరులో లోపం ఉండదన్నారు. ప్రజల్లో టీకాలపై అపోహలు తొలగించడానికి వివిధ రంగాల ప్రముఖులతో అవగాహన కల్గించాలని, సాధ్యమైనంత వేగంగా అత్యధికులకు టీకాలను అందించాలని సూచించారు. లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అందరూ మాస్కులు ధరిస్తే అది లాక్‌డౌన్‌తో సమానమనీ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలోనూ ఇదే వెల్లడైందని తెలిపారు. కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి, టీకాల పంపిణీలో అపోహలు తదితర అంశాలపై డాక్టర్‌ నాగేశ్వరరెడ్డితో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. ముఖ్యాంశాలు...

1) తగ్గిపోయిందనుకున్న కొవిడ్‌ ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. మీ పరిశీలన...?

ముఖ్యంగా మూడు కారణాల వల్ల వైరస్‌ తిరిగి విరుచుకుపడుతోంది.

     1. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడం...అంటే మాస్కులు ధరించకపోవడం, గుంపులు, గుంపులుగా చేరిపోవడం, చేతులు శుభ్రపర్చుకోకపోవడం వంటివాటిని వదిలేయడం.

      2. శుభకార్యాలు, పండుగల పేరిట ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఎన్నికలు  కూడా ప్రజలు ఒకచోటుకు పెద్దసంఖ్యలో చేరడానికి కారణమైంది.

      3. వైరస్‌ జన్యుపరంగా పరిణామం చెందడం. ముఖ్యంగా బ్రిటన్‌ రకం వైరస్‌ మన దగ్గర తీవ్ర ప్రభావాన్నే చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. దీని వల్ల అధిక మరణాలు లేవు గానీ ఎక్కువమందికి ఇది వ్యాప్తి చెందుతోంది. ఇవి కాకుండా మన దేశంలోనే మార్పు చెందిన వైరస్‌ కూడా ప్రభావం చూపుతోంది. దీన్ని ‘డబుల్‌ మ్యూటెంట్‌’గా గుర్తించారు.


2) కొవిడ్‌ తొలిదశకు, రెండోదశకు మధ్య ఉద్ధృతిలో ఏమైనా తేడాలున్నాయా?

మొదటి దశ నెమ్మదిగా మొదలైంది. ఏప్రిల్‌, మేలో ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరుకు తారాస్థాయికి చేరుకుంది. అదే రెండోదశ మార్చిలో ప్రారంభమై ఏప్రిల్‌ రాకముందే ఉద్ధృతి పెరిగింది.  1918లో స్పానిష్‌ ఫ్లూలోనూ రెండోదశ, మూడోదశల్లో ఉన్నట్టుండి తీవ్రత పెరిగింది. అంతే వేగంగా ఆ తీవ్రత తగ్గిపోతుంది. ప్రస్తుతం మన దగ్గర కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి మే నెలాఖరు వరకూ ఇలాగే కొనసాగుతుందని అంచనా. ఈలోగా మనం ఎంత వేగంగా ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగామనేది ముఖ్యం. అలాగే అందరం కూడా కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామా? లేదా? అనేది అతి ముఖ్యం. ఈ రెండూ గనుక ఆచరిస్తే మే నెలాఖరుకు కొవిడ్‌ను అదుపులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం రోజుకు సగటున 15-20 లక్షల వరకూ టీకాలు ఇస్తున్నారు. ఈ సంఖ్యను 50 లక్షలకు పెంచాలి. 45 ఏళ్ల పైబడినవారికే ఇవ్వాలనే నిబంధన కూడా సరికాదు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలి.


3) ఇప్పటికీ టీకాలు తీసుకోవడంపై అపోహలున్నాయి?

దీనిపై మేం అధ్యయనం చేశాం. ఇప్పటికీ 30-40 శాతం మంది టీకాలను పొందడానికి ముందుకు రావడం లేదు. టీకాలపై అపోహలను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం పలువురు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను రంగంలోకి దింపింది. ఈ ప్రక్రియ సానుకూల ఫలితాలనిచ్చింది. మన దగ్గర కూడా రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, గాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా వేర్వేరు రంగాలకు ప్రముఖులను కూడా ప్రచారంలోకి  తీసుకురావాలి. కొవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత రక్తనాళాల్లో గడ్డకట్టే ప్రమాదముందని కొంత ప్రచారం జరిగింది. యూరప్‌ దేశాల్లో చాలా తక్కువమందిపై చేసిన ఒక అధ్యయనంలో ఈ తరహాలో జరిగినట్లు వెల్లడించారు. కానీ మన దేశంలో ఒక్క కేసు కూడా ఇటువంటిది నమోదు కాలేదు. అందువల్ల మనం భయపడాల్సిన పనిలేదు. ఏ టీకా తీసుకోవాలని కూడా చాలా మంది అడుగుతుంటారు. అన్ని టీకాలు సమర్థమైనవే. ఏ టీకా అందుబాటులో ఉంటే అది తీసుకోండి.

4) టీకా వల్ల కొవిడ్‌ ఉద్ధృతి తగ్గినట్లుగా దాఖలాలున్నాయా?

కచ్చితంగా ఉన్నాయి. మన కంటే మూణ్నాలుగు నెలలు ముందుగా టీకా ప్రక్రియ ప్రారంభించిన దేశాల్లో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి.  భారత్‌లో ఇప్పటికీ 5.2 శాతం మంది మాత్రమే టీకాలు పొందారు. గరిష్ఠంగా ఇజ్రాయిల్‌లో 100 శాతం టీకాల పంపిణీ పూర్తయింది. అక్కడ దాదాపుగా సున్నా కేసులకొచ్చాయి. కాబట్టి టీకాలు పొందడానికి, కేసుల నమోదుకు మధ్య చాలా స్పష్టమైన సంబంధమున్నట్లుగా తెలుస్తోంది. మన దేశంలో టీకా మినహా మరో దారి లేదు. తొలిడోసు తీసుకున్న 4 వారాల తర్వాత 50 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి. రెండోడోసు పూర్తయిన 15 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో యాంటీబాడీలు వృద్ధిచెందుతున్నాయి. తొలిదశలో మా ఆసుపత్రిలో 4500 మంది ఉద్యోగులుంటే.. వారిలో 50 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారు. ఈసారి అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల 7 శాతం మంది మాత్రమే ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.


5)  అధునాతన చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయా?

చికిత్సలోనూ మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌ అనేవి వచ్చేశాయి. అంటే మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను తీసుకొని.. వెలుపల ప్రయోగశాలలో కొన్ని వేల సంఖ్యలో అదే తరహాలో యాంటీబాడీలు ఉత్పత్తి చేయడమన్నమాట. అమెరికా వంటి దేశాల్లో ఇది చేస్తున్నారు. మన దగ్గర ఇంకా రాలేదు. దాన్ని కొంచెం మార్చి, పొలిక్లోనాల్‌ యాంటీబాడీస్‌ వృద్ధిచేస్తున్నాం. అంటే కొవిడ్‌ సోకి తగ్గిన వేర్వేరు వ్యక్తుల నుంచి యాంటీబాడీలు స్వీకరించి, వాటిని ఒక్క దగ్గరికి చేర్చి, ఇంజక్షన్‌ రూపంలో ఇస్తున్నాం. దీనివల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు. ఇది మన దగ్గర అందుబాటులోకి వచ్చింది. ప్లాస్మాథెరపీ కంటే ఇది మేలు. ప్లాస్మాలో ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటాం. పాలిక్లోనల్‌లో ఎక్కువమంది నుంచి తీసుకొని ఇస్తున్నాం.


6) తొలిదశకు, రెండోదశకూ లక్షణాల్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా?

తొలిదశలో ఎక్కువగా గొంతునొప్పి, దగ్గు, జ్వరం వచ్చేవి. అంటే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ మాదిరిగా వచ్చేది. ఇప్పుడు రెండోదశలో ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం, కీళ్లనొప్పులు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అంటే వైరస్‌ నేరుగా రక్తంలో చేరిపోతోంది. శ్వాసకోశ సమస్యలు తక్కువగా వస్తున్నాయి. దీనివల్ల వైరస్‌ తెలియకుండానే ఎక్కువ మందికి వ్యాప్తి చెందే ప్రమాదముంటుంది. పిల్లల్లో గతంలో ఎక్కువ కేసులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు 10 ఏళ్లలోపు పిల్లల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అదృష్టవశాత్తు వీరిలో ప్రమాదకరంగా మారడంలేదు. ఇంతకుముందు వృద్ధుల్లో, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు 30-40 ఏళ్ల మధ్యవయస్కులు ఉన్నట్టుండి ప్రాణాపాయ స్థితిలోకి చేరిపోతున్నారు. వీరిలో తలనొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరమొచ్చి కొద్దిరోజుల్లోనే ఊపిరితిత్తుల వైఫల్యానికి దారితీస్తోంది. ఇలా సుమారు 30 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులకు వస్తున్నారు.


7) టీకా రెండుడోసులు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ వస్తోంది కదా?

టీకాతోనే 100% రక్షణ ఇది నిజమే. రెండుడోసులు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ సోకే అవకాశాలుంటాయి. టీకా వల్ల 70-80 శాతం రక్షణ లభించి, 20-30 శాతం లభించకపోయినా.. టీకాలు పొందినవారిలో ఎవరూ కూడా తీవ్రమైన అనారోగ్యం బారినపడిన దాఖలాల్లేవు. టీకాలపై ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో అధ్యయనాలు చేశారు. ఇంతవరకూ ఏ అధ్యయనంలోనూ రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌తో మృతిచెందినట్లుగా లేదు. ఇన్‌ఫెక్షన్‌ వేరు, వ్యాధి వేరు. టీకా తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కానీ వ్యాధి రాదు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కూడా చాలా స్వల్పం. కాబట్టి వ్యాక్సిన్‌ కొవిడ్‌ రాకుండా అడ్డుకోవడమే కాదు.. వైరస్‌ తీవ్రంగా విరుచుకుపడకుండా కూడా అడ్డుకుంటుంది. ఏ రకంగా చూసినా టీకా వంద శాతం రక్షణనిచ్చేదే. యాంటీబాడీలు వృద్ధి కాకపోయినా.. 80 శాతం టీ కణాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారందరిలోనూ టీ కణాలు ప్రేరేపితమవుతుండటాన్ని మేం గుర్తించాం.

న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top