వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కేంద్రం అడుగులు- ఉమ్మడి ఓటర్ల జాబితాపై పీఎంవో చర్చలు...
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో ఉన్న సమస్యలను అధిగమించడంతో పాటు దేశంలో అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా అధికారులు, ఇతర ముఖ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. అదే జరిగితే ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న తాజాగా ఎన్నికైన ప్రభుత్వాల భవితవ్యం కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.
ఒకే దేశం- ఒకే ఎన్నికలు...
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా వనరుల ఆదాకు కేంద్రం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించింది. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది. అయితే రాజకీయంగా చేయాల్సిన కసరత్తు కొంత మేర పూర్తయినప్పటికీ సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించడం ఇప్పుడు తలకు మించిన భారమవుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సి రావడం కేంద్రానికి ఇబ్బందికరంగా మారింది. దీనిపై చర్చించేందుకు తాజాగా ప్రధాని కార్యాలయం ఓ అత్యున్నత స్ధాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రక్రియ తెరవెనుక చురుగ్గానే సాగుతున్నట్లు సమాచారం
ఒకే ఓటర్ల జాబితా...
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే ఓటర్ల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పుడు కేంద్రం ఒకే ఓటర్ల జాబితా తయారీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అంటే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్ధానిక సంస్ధలకు కలిపే ఒకేసారి ప్రజాతీర్పు కోరుతున్నప్పుడు వాటన్నింటికీ కలిపి ఒకే జాబితా సిద్దం చేయాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం దీనిపై భారీ కసరత్తే చేయాల్సిన పరిస్ధితి. ఇందులో రెండు అంశాలు కీలకంగా మారాయి. ఒకటి రాష్ట్రాలన్నీ ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అలాగే ఈ జాబితాను అన్ని రాష్ట్రాలు స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ వినియోగించుకోవడం.
రాజ్యాంగ సవరణ తప్పదా ?
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ఓటర్ల జాబితాలను సవరించి ఒకే జాబితాగా మార్చడం. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే, 243 జెడ్‌ఏ ను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ప్రస్తుతం న్యాయ పరమైన అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి ఎప్పటికల్లా పూర్తవుతాయో తెలియకపోయినా సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి రాజ్యాంగ సవరణ జరిగిపోతే ఏకైక ఎన్నికల జాబితా సిద్దం చేసేందుకు ఆదేశాలు వెళతాయి. ఆ తర్వాత జాబితాల సవరణ ప్రక్రియకు కూడా మరింత సమయం పట్టవచ్చు.
0 Post a Comment:
Post a Comment