ఆన్‌లైన్ క్లాసులు... ఎన్ని కష్టాలో...
"పాఠశాలలు ప్రారంభమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది సంతోషకరమైన విషయమైనప్పటికీ వాటి నిర్వహణలోనే తల్లిదండ్రులు గందరగోళపడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసుల శిక్షణ ఒక పట్టాన అంతుపట్టకుండా ఉంది. అందునా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, నిరుపేద కుటుంబాలకు ఆన్‌లైన్ క్లాసుల బోధనా పద్ధతి అందని ద్రాక్షేనని ఎన్నో ఉదాహరణలు చెబుతున్నాయి".
ఈ ఏడాది సెప్టెంబరు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచే పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలుపెట్టాలని ఉత్తర్వులిచ్చింది. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలు కూడా పాఠశాలలను ప్రారంభించాయి. మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనదేశంలో మారుమూల ప్రాంతాల్లోని బడి ఈడు పిల్లలు పాఠశాల విద్య పూర్తిచేయడం ఎంతో సాహసంతో కూడుకున్నది. వారు పాఠశాల చేరేందుకు రహదారి సౌకర్యం కూడా ఉండదు. వాగులు, వంకలు, కొండగుట్టలు దాటి, బడికి పోయే పిల్లలెందరో ఉన్నారు మనదేశంలో. అటువంటి వారికి నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని మనం ఊహించగలమా? అలా బడుల్లేక, ఇంటికే పరిమితమైన పిల్లలు ఎందరో ఉన్నారు.
డిజిటల్ గుహ
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని మనలోదై గ్రామం, పచమలై కొండిపాంతంలో ఉంది. అక్కడ చదువుకునే విద్యార్థులు ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తోంది. అక్కడ ఒక గుహ లాంటి ప్రదేశానికి వారంతా చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ మాత్రమే నెట్ సౌకర్యం అందుతోందట. 'ఆగష్టు మొదటి వారంలో మా టీచర్లు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. పాఠాలకు సంబంధించిన కొన్ని రికార్డు వీడియోలను వాట్సాప్‌గ్రూపుల్లోని విద్యార్థులకు పంపించేవారు. వాటిని మేము డౌన్‌లోడ్ చేసుకుని క్లాసులు వినాలి. అయితే మేము ఉంటున్న చోట నెట్ సౌకర్యం లేదు. దీంతో కష్టమైనా ఇక్కడకు చేరుకుంటున్నాం. ఈ గుహను 'డిజిటల్ గుహ' అని కూడా పిలుచుకుంటు న్నాం' అని 12వ తరగతి విద్యనభ్యసిస్తున్న దీపిక అంటోంది. ఇంకా అక్కడికి కేవలం ఆ గ్రామ విద్యార్థులే కాక, థోనూర్, చిన్నిల్లుపూర్, థాలూర్, మేలూర్ గ్రామ విద్యార్థులు కూడా ట్రెక్కింగ్ చేసి వస్తున్నారని ఆమె తెలిపింది. మొబైల్ టవర్లకు ఎదురుగా ఉన్న ఏకైక చదును ప్రదేశం అది. అందుకే ఈ ప్రాంతంలో సిగల్స్ వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. అయితే అక్కడ కూడా సిగల్స్ చాలా నెమ్మదిగా ఉంటాయని, నెట్ స్పీడ్ వేగంగా రావాలంటే గంటల తరబడి ఎదురుచూడాలని దీపిక చెబుతోంది.
పరిస్థితి అధ్వాన్నంగా మారింది
కోవిడ్-19 కాలంలో ఆన్‌లైన్ క్లాసుల శిక్షణపై మధురై ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి సుందర్(20) ఏమంటున్నాడంటే 'మా తరగతిలో 38 మంది విద్యార్థులం ఉన్నాం. వారిలో పది మందికి స్మార్ట్ ఫోనులు లేవు. నా సంగతే చూసుకుంటే లాక్‌డౌన్ వల్ల నేను చేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగం పోయింది. మా తల్లిదండ్రుల పరిస్థితీ అదే. ఈ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. ఇటువంటి సందర్భంలో మొబైల్ రీచార్జ్‌కే రూ.500 ఖర్చు చేయాలంటే చాలా కష్టం'. ఆన్‌లైన్ క్లాసుల శిక్షణ కోసం స్మార్ట్‌ఫోనులు, లాప్‌టాప్‌లు కొనుక్కొనే స్థోమత లేక ఈ రాష్ట్రంలోని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు మీడియా కథనాలు కూడా ఇటీవల వచ్చాయి.
ఈ పరిస్థితి ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితమైనది కాదు. యావత్ దేశమంతా కరోనా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతోంది. తినడానికి తిండిలేదు. చేసేందుకు పనిలేదు. ఈ సందర్భంలో వారిని ఆదుకునే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలే వ్యాపార మార్గాలకు రాచబాట వేస్తున్నాయి. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించని ప్రభుత్వాలు ఖర్చుతో కూడుకున్న ఆన్‌లైన్ శిక్షణను ప్రోత్సహించడం లాభార్జన తప్ప మరొకటి కాదు. పేదవారి రక్తం పిండుతున్న రోజులు మారాలి.
చదువు ఎంత దూరమో!
ప్రస్తుతం ఆన్‌లైన్ సౌకర్యం అందక ఎందరో ఆదివాసీ, గిరిజన తెగలకు చెందిన పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతితో పాటు నిసర్గ తుపాను ధాటికి ఆ రాష్ట్ర మారుమూల ప్రాంత పేద పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల శిక్షణ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. రత్నగిరి తీర ప్రాంతం వెంబడి ఉన్న గ్రామాల్లో జూన్ నుంచి ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల రోజులైనా పరిస్థితిలో మార్పులేదు. దీంతో సహాయం కోసం 'అత్యున్నత పిల్లల హక్కు సంఘం (ఎన్‌సిపిసిఆర్)'ను ఒక విద్యార్థి ఆశ్రయించాడు. పరిస్థితి తీవ్రతను వివరించాడు. దీంతో ఆ సంఘం వారు అధికారులపై ఒత్తిడి తెచ్చి మొదటగా ఆ ప్రాంతంలో నెలకొన్న ఇంటర్‌నెట్ అసౌకర్యంపై విచారణ చేశారు. సుమారు 200 మంది విద్యార్థులు నెట్ సౌకర్యం లేక ప్రతిరోజూ ఆ ప్రాంతం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నట్లు ఆ విచారణలో తేలింది. దేశంలో ఉన్న అనేక మారుమూల ప్రాంతాల విద్యార్థుల పరిస్థితి ఇదే. చదువు ఎంత దూరమైందో ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.
0 Post a Comment:
Post a Comment