Friday 28 August 2020

నేడు తెలుగు భాషా దినోత్సవం - వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి.

నేడు తెలుగు భాషా దినోత్సవం - వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. తెలుగుభాష తీయదనం. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతోంది. నేడు వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి. 

తెలుగులో ప్రాచీన కాలంలోనేగాక, ఆధునిక కాలంలో కూడా గొప్ప సాహిత్యం వస్తోంది. పల్లె పదం నుంచి జానపదుల సంస్కృతి సంప్రదాయాలు అలరారుతోంది.
 ▪ నా భాష - అమర భాష - కమనీయమైన , రమనీయమైన భాష - నా తెలుగు భాష 

▪ వెన్నెలంత వెలుగునిచ్చు భాష  - నా తెలుగు భాష 

▪ అన్ని భాషలను తనలో నింపుకోగల సహృదయ భాష - నా తెలుగు భాష 

▪ విందైన పదాలతో పసందైన హొయలు చిందించే భాష - నా తెలుగు భాష

▪ అమ్మ కడుపులోంచి ఎన్నో రక్తకణాలను ఎదుర్కొని బయటపడ్డ బిడ్డ నోటి నుండి మొదట జారువాడే కమ్మనైన తేనెలొలుకు భాష - నా తెలుగు భాష 

▪ నవ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసిన అమ్మానాన్నల నుంచి మనకు లభించిన ఎనలేని కలిమి - నా తెలుగు భాష 

▪ ప్రజ్ఞావంతుల నుంచి అజ్ఞానవంతుల నాలుకలపై అలవోకగా నాట్యం చేయగల సమున్నత భాష - నా తెలుగు భాష 

▪ ఎంత తాగినా , చెరుకురసంలోని తీయ్యని తీపిరుచి తరగదు...

▪ ఎంత నేర్చినా , మధురమైన మాధుర్యమైన తెలుగుభాషలోని కమ్మదనం  చెరగదు....

▪ ఆదికవి "నన్నయ్య" అవతరించిన , కవి సార్వభౌములు "శ్రీనాథుడు" జన్మించిన , వేదాలను వల్లించిన , తెలుగు జాతి మనది.

▪ తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా  విస్తరింపచేయాల్సిన బాధ్యత మనది.

▪ మన పలుకులలో పరాయి పలుకులు ఎక్కువయ్యాయి. తొలిపలుకు అయిన తేనెలొలుకు తెలుగుకు రాను రాను

▪ వెలుగు లేకుండా  పోతోంది. చక్కనైన ,చిక్కనైన,అమృతభాష అయిన తెలుగుపై అభిమానం ఎల్లవేళలా ఉంటే లేదు ముప్పు.

▪ పలచబడితే మాత్రం పొంచి ఉన్న ముప్పును ఏ భరత మాత ముద్దు బిడ్డా కప్పిపెట్టలేడు.

▪ ఏది ఏమైనా, తెలుగు భాషను పునీతం చేసి భాషామతల్లి రుణం తీర్చుకోవాల్సిన భాధ్యత ప్రతి "తెలుగు తేజా"నికి ఉంది.

▪ అందమైన అలంకారాలు సింగారించుకున్న, నా "మాతృభాష - మృతభాష" కాకుండా , కరాళ పోకడలెన్ని వచ్చినా ,

▪ నవ్యమై కలకాలం విరజిల్లే ,మరాళవాహన నిండైన రూపంగా వెలగాలి. అందాలు చిందించే  "అమరభాష" కావాలి.

తెలుగు భాష రక్షణ ఇలా...

1. ప్రపంచంలో 6,600 భాషలు ఉంటే.. అందులో తెలుగు ఒకటి.

2. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించి నాలుగేళ్లయింది.

3. కుటుంబం నుంచే తెలుగు భాష అమలు కావాలి.

4. తెలుగు రచయితలను ప్రోత్సహించాలి. వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అందించాలి.

5. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనలు రావాలి.

6.తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్యగ్రంఽథాల్లో ప్రవేశపట్టాలి.

7. విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచాలి.

8.తెలుగు కావ్యాలలోని సామాజిక గతాన్ని సమాజానికి చాటి చెప్పాలి.

9.పరభాషను గౌరవించు.. మాతృభాషను ప్రపంచానికే చాటిచెప్పు అన్న నినాదాన్ని ఇంటింటికి చేర్చాలి.

10.జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, ప్రతి పల్లెల్లోనూ తెలుగు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయాలి.

11.జానపదాలు, జానపద కళాకారులపై విస్తృత ప్రచారం చేయాలి.

12. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలి.

తెలుగుభాష పరిరక్షణకు కృషి చేయాలి :

తెలుగు భాష గొప్పతనం ఈనాటిది కాదు. ప్రపంచ దేశాలలో తెలుగు గొప్పతనం ఆనాడే చాటి చెప్పారు. యునెస్కో అంచనా ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని తెలుగును బతికించే విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి.

తెలుగు సాహిత్యాన్ని సమాజానికి అందించాలి :

తెలుగు భాష దినదినాభివృద్ధి చెందా లంటే సాహిత్యం అత్యుత్తమ స్థాయిలో రాణించాలి. ప్రపంచ భాషలన్నింటిలో తెలుగు భాషకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు కవులను ప్రోత్సహించి, వారు రచించిన పుస్తకాలను ప్రభుత్వమే అచ్చు వేయించాలి.

ప్రైవేటు పాఠశాలల విధానం మారాలి :

ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే నేరమన్నట్లు శిక్ష విధిస్తున్నారు. ఇది మారాలి. ప్రైవేటు పాఠశాలల్లో సైతం 6వ తరగతి వరకు తెలుగు ఖచ్చితం చేయాలి. పరభాష వ్యామోహంలో నేడు తెలుగును ప్రజలకు దూరం చేస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు నడుంబిగించాలి.

ప్రాచీన సాహిత్యం విశిష్టత ప్రచారం చేయాలి :

తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణించడం అక్షరాలకు అందనిది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు ఎంతో విశిష్టత ఉంది. . అలాంటి తెలుగు ఆంగ్ల భాష మమకారంతో గతి తప్పుతోంది. ఈ భాషను పరిరక్షించుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.</

శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యా కమీషనర్ గారి అనుభవం... మాటలలో....

శ్రీముఖలింగం దేవాలయ సందర్శనం పూర్తయ్యాక మిత్రులు నన్ను గుడి వెనగ్గా ప్రవహిస్తున్న వంశధార ఒడ్డుకి తీసుకువెళ్ళి ఆ నదికి ఆవలి ఒడ్డున దూరంగా కనిపిస్తున్న ఒక పల్లెని చూపిస్తూ 'అదే పర్వతాల పేట ' అన్నారు.

నేనిప్పటిదాకా మా అమ్మ పుట్టిన ఊరు చూడలేదు. మా అమ్మని కన్న తల్లిదండ్రుల పుట్టిన ఊళ్ళు కూడా చూడలేదు. కాని పర్వతాలపేట చూడాలన్న కోరిక మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నది. ఎందుకంటే అది గిడుగు రామ్మూర్తి పుట్టిన ఊరు కాబట్టి. మా అమ్మ తరువాత నాకు అమ్మ వంటిది తెలుగు భాషనే కాబట్టి, ఈనాడు నేను మాటాడుతున్న, రాస్తున్న, చదువుతున్న భాషా స్వరూపం ఇట్లా ఉండటానికి రామ్మూర్తిగారు కారకుడు కాబట్టి   ఆయన పుట్టిన ఊరు చూడటం నాకు నా తల్లి పుట్టిన ఊరుని, నా మాతామహులు పుట్టిన ఊళ్ళని సందర్శించడంతో సమానమే అనిపించింది

ఆ నది ఒడ్డు మీంచి ఆ ఊరుని పోల్చుకోడానికి ప్రయత్నించాను. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఆ పల్లెలోని ఇళ్ళకప్పుల తళతళలు తప్ప మరేమీ కనిపించట్లేదు. 

'ఆ ఊరికి పోవాలని ఉంది' అన్నాను...

'చూడటానికి ఈ పక్కనే అన్నట్టు కనిపిస్తోందిగాని, అక్కడికి పోవడానికి నది మీద వంతెన లేదు. మనం చుట్టు తిరిగి హీరమండలం, సరుబుజ్జిలి మీంచి వెళ్ళవలసి ఉంటుంది. కనీసం ఇరవై ముప్పై కిలోమీటర్లు అదనంగా ప్రయాణించవలసి ఉంటుంది' అన్నారు మిత్రులు.

''అలాగే వెళ్దాం' అన్నాను...

తీరా బండి ఎక్కబోయే సమయానికి, ఒక మిత్రుడు, 'ఇప్పుడక్కడ ఏమీ లేదు. గిడుగు రామ్మూర్తిగారి స్మారక చిహ్నాలు కూడా ఏమీ లేవు. ఊరు కూడా అంతా కలిసి ఒక చిన్న పల్లె. చూడటానికి ఏమీ ఉండదు ' అన్నాడు. నేను ఎలాగైనా పర్వతాల పేట వెళ్ళి తీరవలసినదేనన్న సంకల్పంతో ఉన్నవాణ్ణి, ఆ మాటలు వింటూ కూడా బండిలో కూచుంటూ 'ఎవరెస్టు పర్వతం మీద  ఏముంటుంది? ఎందుకని అంత ప్రయాస పడి అన్ని వేల అడుగుల ఆ కొండలెక్కుతారు పర్వతారోహకులు?' అనడిగాను. 'ప్రాణాలకు తెగించి, ప్రాణవాయువు అందనంత ఎత్తుకి ఒక్కొక్క అడుగే వేసుకొంటో, అంత పైకి ఎక్కిన తరువాత, ఆ శిఖరం మీద నిల్చున్నాక, వాళ్ళేమి చూస్తారు? ఎవరెస్టు శిఖరం ఎక్కామని చెప్పుకుంటారు. అంతేకదా. ఇది కూడా అంతే. పర్వతాల పేట వెళ్ళి, అక్కడ అడుగుపెట్టి, ఇదిగో, తెలుగువాడినైపుట్టినందుకు, నా యాభై ఎనిమిదవ ఏట, పర్వతాల పేటలో అడుగుపెట్టాను అని నాకు నేను చెప్పుకుంటాను. ఆ అవకాశాన్ని నాకివ్వండి' అన్నాను.

కార్లు కదిలాయి. ఆ వానాకాలపు ఎండలో పొలాల్లో ఊడ్పులు సాగుతున్నాయి. ఆకుపచ్చ పులుముకున్న ఆ నేలమీద గిడుగులు పెట్టుకుని రంగురంగుల దుస్తుల్లో స్త్రీపురుషులు వరినాట్లు చేస్తూ ఉండిన దృశ్యం నా కళ్ళల్లో తేనె పోస్తూ ఉంది. ఒకప్పుడు జపనీయ హైకూ కవీంద్రుడు బషో, ఉత్తర జపాన్ లో పర్యటిస్తూ, పొలాల్లో వరినాట్లు వేస్తున్న దృశ్యం చూసి 'సంస్కృతి ప్రభవిస్తున్న దృశ్యం' అని అభివర్ణించింది గుర్తొచ్చింది. గొట్టాబారేజి దగ్గర వంశధార నిండుగా ప్రవహిస్తోంది. ఆ ఆనకట్ట దాటి హీరమండలం మీదుగా సరుబుజ్జిలి జంక్షన్నుంచి పక్కకు తిరిగి దాదాపు మట్టిబాటలాంటి రోడ్డుపట్టుకుని పర్వతాల పేట చేరుకున్నాం. 

రోడ్డుకి ఒక పక్కగా ఊరు. ఊరంతా కలిసి ఒక వీథి మాత్రమే. గ్రామం కూడా కాదు, కుగ్రామం అనాలి. ఊరు మొదట్లో రోడ్డుపక్కన పెద్ద మర్రి చెట్టు. రోడ్డుకి అవతలవేపు బస్సులు నిలిచే చోట ఒక చిన్న రేకుల  షెడ్డు. ఒకప్పుడు గిడుగుసీతాపతిగారు తన తండ్రి తనని మొదటిసారిగా పర్వతాల పేట తీసుకువెళ్ళినప్పటి సంగతి గురించి రాసింది గుర్తొచ్చింది. ఆయనిలా రాసాడు:

'..మా తాతగారు గిడుగు వీరరాజు గారు విశాఖపట్టణం జిల్లాకు వచ్చి విజయనగరం జిల్లాలో సముద్దారుగా పని చేసినారు. ముఖలింగమునకు నైఋతి దిక్కున సుమారు రెండు మైళ్ళ దూరమందుగల పర్వతాల పేట అనే గ్రామం విజయనగరం మండలపు ఉత్తర సముద్దారులుండవలసిన ఠాణా కనుక, ఆ గ్రామమందు మా తాతగారు పండ్రెండు సంవత్సరములుండిరి. ఆ కాలంలో 1863 వ సంవత్సరంలో మా తండ్రిగారు ఆ గ్రామమందు జన్మించినారు. 1906 లో నేను బి.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడనై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన కొద్ది కాలంలోనే వీరు నన్ను ముఖలింగమునకు తీసుకొనిపోయి అక్కడ దేవాలయమందలి చిత్రములు, శాసనములు చూపించి, పిమ్మట పర్వతాల పేటకు తీసికొనిపోయి, తమ తండ్రి గారుండిన గృహమున్నూ, తాను పుట్టిన గదిన్నీ చూపించి, తాము పుట్టిన స్థలమునకు సాష్టాంగ నమస్కారము చేసినారు.' ఆ స్థలమేదో చూపించేవాళ్ళుంటే నేను కూడా అక్కడ సాష్టాంగ నమస్కారం చెయ్యాలని అనుకున్నాను గాని, యావదాంధ్రదేశమే గిడుగురామ్మూర్తిని మర్చిపోయిన కాలంలో, ఆ కుగ్రామంలో ఆయన ఎవరికి గుర్తుంటాడు కనుక అనుకున్నాను. అయినా నా ప్రయత్నం నేను చెయ్యవలసిందే అనుకుని, ఆ ఊరిలో అడుగుపెట్టి, మొదటి ఇంటిదగ్గరే ఆగి, అక్కడెవరేనా పెద్దవాళ్ళు కనిపిస్తారేమో అని చూస్తూన్నాను. ఇంతలో నూనూగుమీసాల పిల్లవాడొకడు అక్కడికొచ్చాడు. 'ఇక్కడ గిడుగురామ్మూర్తిగారి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసునా నీకు?' అని అడిగి, ఇంతలోనే నాలిక్కరుచుకుని, 'గిడుగు రామ్మూర్తి తెలుసా నీకు?' అనడిగాను. 'తెలుసు సార్, తెలుగు భాషకి..' అని ఆ పిల్లవాడు జవాబిస్తోండగా, ఆ వాక్యం అతడు పూర్తి చేయకుండానే, నేను ఆనందంతో తబ్బిబ్బయిపోయాను. గిడుగు రామ్మూర్తిగారు నిజంగా ధన్యుడు. ఆయనెవరో, ఆయన జీవితకాలం పాటు ఏమి చేసాడో ఆయన పుట్టిన వూళ్ళో పిల్లలకి కూడా తెలుసు నేడు.

నెమ్మదిగాఊళ్ళో వాళ్ళు చాలామందే నా చుట్టూ గుమికూడటం మొదలుపెట్టారు. ఊరి మొదట్లోనే పాడుపడి కూలిపోయిన ఒక ఇటుక గోడ చూపించి, అదే రామ్మూర్తిగారి మాతామహుల ఇల్లని చెప్పారు. ఒకప్పుడు దక్షిణభారతదేశంలో ప్రసిద్ధ రేవుపట్టణంగా విలసిల్లి, 'పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ' లో కూడా ప్రస్తావించబడ్డ ఆరికమేడు వెళ్ళినప్పుడు కూడా నాకిట్లానే ఒక ఇటుక గోడ చూపించి 'ఇదే ఆరిక మేడు' అన్నారు అక్కడి వాళ్ళు. 

గిడుగు రామ్మూర్తిగారి పేరు తలుచుకోగానే ఆయన సాగించిన వ్యావహారిక భాషా ఉద్యమం గుర్తుకు రావడం సహజమే కాని, ఆయన కేవలం వాడుకభాషా యోధుడు మాత్రమే కాడని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన రచయిత, విమర్శకుడు, పండితుడు, చరిత్రకారుడు, శాసనపరిశోధకుడు, సాహిత్యవేత్త. అంతేనా? 

ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భాషావేత్త. స్టాన్లీ సొరాష్ట అనే ఒక ఇటీవలి భాషావేత్త ఆయన సవర భాష మాన్యువల్ గురించి రాస్తూ, 'రామ్మూర్తి గొప్ప ముండారీ భాషావేత్త అనుకున్నాను మొదట్లో. కాని ఇప్పుడు నా అభిప్రాయాన్ని సవరించుకుంటున్నాను, ఆయన అసామాన్యుడైన భాషావేత్త, కాలం కన్నా ముందున్న భాషా వేత్త' అని ప్రస్తుతించాడు.

కొన్నేళ్ళ కిందట, గిరిజన సంక్షేమ శాఖ తరపున గిడుగు రామ్మూర్తిగారి మీద ఒక సెమినార్ నిర్వహించినప్పుడు ఆ సభలో ప్రసంగించిన యాంత్రొపాలజిస్టులు ఆయన్ని భారతదేశంలో మొదటి యాంత్రపాలజిస్టుగా ప్రస్తుతించారు. అంతేనా? కాదు, ఇప్పుడు నేనాయన్ని ఆధునిక భారతదేశపు మహనీయులైన తొలివిద్యావేత్తల్లో ఒకరని చెప్పడానికి గర్విస్తున్నాను. రామ్మూర్తిగారూ,  స్వామి వివేకానందులు, ఇద్దరూ కూడా 1863 లో పుట్టినవాళ్ళే. కాని వివేకానందులు 'మాస్ ఎడ్యుకేషన్ 'వరకు మాత్రమే వచ్చి ఆగిపోగా (అప్పటికి ఆ మాట మాట్లాడినవాళ్ళు కూడా లేరు) గిడుగు మరొక నూరు యోజనాలు ముందుకు నడిచి ఆదివాసీల విద్య గురించి మాట్లాడేడు. 

ఆయన గిరిజనుల కోసం ఏమి చేసాడో గిరిజన సంక్షేమ శాఖకే తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీనియర్ బ్యురోక్రేట్లకి, పత్రికాసంపాదకులకి, గిరిజనులకోసం పనిచేసినవారెవరంటే హైమండార్ఫు ఒక్కడే గుర్తొస్తాడు. కాని, గిడుగురామ్మూర్తి గంజాం మన్యంలో సవరబాలబాలికలకోసం 1892 లో మొదటి పాఠశాల తెరిచినప్పటికి ఇంకా హైమండార్ఫు (1909-1995) పుట్టి ఉండలేదని వాళ్ళకి తెలియదు. అసలు సవర బాలికల కోసం పాఠశాల తెరవడం కాదు, ఆ తెరిచిన పాఠశాల కూడా సవరమాధ్యమంలోనే తెరిచాడనికూడా  చాలమందికి తెలియదు. సరిగ్గా అప్పటికి పదేళ్ళ కిందట (1882) బ్రిటిష్ ఇండియాలో విద్యావ్యవస్థ తీరుతెన్నుల మీద అధ్యయనం చేసిన హంటర్ కమిషన్ ఆదివాసులకి వారి మాతృభాషలో విద్యాబోధన చెయ్యడం అనే ఆలోచననే ఎంతో విప్లవాత్మకంగా భావించిందని మనం గుర్తు తెచ్చుకుంటే, రామ్మూర్తి గారు భారతీయ విద్యావ్యవస్థలో ఎంత విప్లవశీల శక్తినో బోధపడుతుంది.

నిజానికి రామ్మూర్తిగారు చేసిన కృషిని  అధ్యయనం చెయ్యడం, మూల్యాంకనం అటుంచి అసలు ఆయన రచనలే మనమింకా పూర్తిగా చదవనేలేదు. 1894 లోనే ఆయన మద్రాసు గవర్నరుకి సవరవిద్య గురించి సమర్పించిన మెమొరాండం మనలో ఎంతమందిమి చదివాం? 1912 లో ఆయన మద్రాసు గవర్నరుకి సమర్పించిన A Memorandum of Modern Telugu వేదగిరి రాంబాబు పుణ్యమా అని ఇన్నాళ్ళకు (2012) అంటే, సరిగ్గా వందేళ్ళకు, మళ్ళీ వెలుగు చూసింది. పుణ్యాత్ముడు రాంబాబుగారు ఎంతో ప్రేమతో నాకా పుస్తకం పంపించాడు. ఆ పుస్తకం చదివితే, అది వందేళ్ళ కిందటి రచన అనిపించదు. అందులో ఆయన తెలుగు భాష సమస్యని 'సామాజిక సమస్య' గా పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ మెమొరాండం ని మరింత శ్రద్ధగా చదువుతుంటే ఆ రచన ఎంతో సమకాలికంగానూ, మరెంతో path breaking గానూ కనిపిస్తున్నది.

ఆ మెమొరాండం మొదలుపెడుతూ ఆయన తన గురించి ఇలా పరిచయం చేసుకున్నారు:

'నేను భారతీయ విద్యాక్షేత్రంలో వినయశీలినైన ఒక కార్యకర్తగా గత ముప్పై ఏళ్ళకు పైగా పనిచేస్తున్నాను, ప్రాథమిక స్థాయినుంచి కళాశాల స్థాయిదాకా ఎందరో విద్యార్థులకు పాఠాలు చెప్పాను. ఈ ప్రాంతంలో నిర్వహించిన అన్ని విద్యాసదస్సుల్లోనూ ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నాను. ఇంగ్లాండు, ఫ్రాన్సు తదితర నాగరిక దేశాలన్నిటిలోనూ విద్యాభివృద్ధి ఎలా జరుగుతున్నదో తెలిపే గ్రంథాలెన్నిటినో అధ్యయనం చేసాను. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిలు సభ్యుడిగానూ, మునిసిపల్ పాఠశాల సూపరింటెండెంటుగానూ గ్రామీణ పాఠశాలల మానేజరుగానూ, బాలికల పాఠశాల నిర్వహణకమిటీ సభ్యుడిగానూ, పర్లాకిమిడి కళాశాల మండలిలో పరీక్షకుడిగానూ విద్యకి సంబంధించిన సమస్యలనెన్నింటినో అధ్యనం చేయడానికి నాకు అపారమైన అవకాశాలు లభించాయి.' గిడుగుని ఈనాడు అన్నిటికన్నా ముందు ఒక నవీనవిద్యావేత్తగా discover చేయవలసి ఉంది. 1854 లో Wood's Dispatch తో బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మొదలయిందని మనకు తెలుసు. పేరుకి ఆ ఆదేశాలు సర్ ఛార్లెస్ వుడ్ పేరుమీద ప్రసిద్ధి చెందినప్పటికీ దాన్ని రాసినవాడు జాన్ స్టువర్ట్ మిల్. ఆయనప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసులో పనిచేస్తుండేవాడు. మెకాలే మినిట్ (1835) లోనూ, వుడ్స్ ఆదేశాల్లోనూ ముఖ్యమైన లక్ష్యమేమిటంటే, భారతీయులకి ఇంగ్లీషు విద్యనేర్పడం ద్వారా వారికి ఆధునిక విద్యని పరిచయం చెయ్యాలి, ఆ క్రమంలో విద్యావంతులైన ఒక కొత్త వర్గాన్ని తయారు చేసిన తర్వాత, ఆ విద్యావంతులు తమ దేశభాషల్లో ఆధునిక విద్యను తమ దేశీయులకి అందచేస్తారన్నది. కానీ, 1854 నుంచి ఇప్పటిదాకా కూడా ఆధునిక విద్య పొందిన భారతీయులు తిరిగి తమ దేశభాషల్లో తమ ప్రజల్ని విద్యావంతుల్ని చేయడానికి ప్రయత్నించకపోగా, ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూండటం మనం గమనించవచ్చు. అదేమంటే వారు ఒకవైపు ఆధునికవిద్యా ఫలితాల్ని తాము అనుభవిస్తూ, తమ సంతతికి అనుభవింపచేస్తూ, ప్రజల విషయానికి వచ్చినప్పుడు మాత్రం మరింత కరడుగట్టిన సనాతనులుగా ప్రవర్తిస్తూండటం. గిడుగు కాలం నాటికి వారు గ్రాంథికభాషావాదుల రూపంలో ఉండేవారు. అలాగని వారు పూర్వకాలపు పండితులు కారు. వారంతా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆధునిక విద్యని అందిపుచ్చుకుని, బ్రిటిష్ వారు స్థాపించిన కళాశాలల్లో పనిచేస్తూ, పాఠ్యపుస్తకాలూ, పరీక్షలూ నిర్వహిస్తూ, కాని, ఆ పుస్తకాలూ, ఆ పరీక్షలూ మాత్రం ప్రజల భాషలో ఉండటానికి వీల్లేదని పట్టుబట్టేవాళ్ళు. గిడుగు చేసిన పోరాటమంతా వాళ్ళతోనూ, వారి ద్వంద్వ వైఖరితోనూ. 

అటువంటి గిడుగు వెంకట రామూర్తిని తెలుగు జాతి ఏ విధంగా స్మరిస్తున్నది? తెలుగు విశ్వవిద్యాలయంతో సహా ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా ఆయన పేరు పెట్టుకోవాలని తోచలేదు. కనీసం పర్వతాలపేటలోనైనా ఒక చిన్న విగ్రహమేనా ఆయన గుర్తుగా నిలబెట్టకూడదా? గౌరవనీయులైన స్పీకర్ గారు ఆ ప్రాంతానికి శాసనసభ్యులని తెలిసాక ఆయనకి ఫోన్ చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆయన చాలా సంతోషంగా వెంటనే తహశీల్దారుకి ఆదేశాలిచ్చారు. ఆ ఊళ్ళో గిడుగురామ్మూర్తిగారి విగ్రహం, స్మారకమందిరం నెలకొల్పడానికి స్థలం కేటాయించమని చెప్పారు. ఆ విగ్రహం తానే నెలకొల్పుతానన్నారు. అది మొదటి అడుగు. అక్కడొక గ్రంథాలయం నెలకొల్పాలని కూడా అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యం తెలుగువాళ్ళు తమ తీర్థయాత్రా స్థలాల్లో ఆ ఊరు కూడా చేర్చుకోవాలి. తెలుగువాడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఒక్కసారేనా అక్కడ అడుగుమోపి రావాలని తమకి తాము చెప్పుకోవాలి.


జై తెలుగు తల్లి..

జై జై తెలుగు తల్లి...

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top