Monday 17 August 2020

అంతుచిక్కని కరోనా - దేశంలోకి వైరస్‌ ప్రవేశించి నేటితో 200 రోజులు


అంతుచిక్కని కరోనా - దేశంలోకి వైరస్‌ ప్రవేశించి నేటితో 200 రోజులు


దినదినం వైరస్‌ రూపాంతరం

మహమ్మారి లక్షణాల్లో మార్పులు

ఇంకెలా మారుతుందో తెలియని స్థితి


భారత్‌ : ◾ తొలికేసు నమోదు : జనవరి 30, 2020  ◾ మొత్తం కేసులు : 25,89,682  ◾ మరణాలు : 49,980  ◾ కోలుకున్నవారు : 18,62,258

    కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి సోమవారానికి సరిగ్గా రెండు వందల రోజులు! 2020 జనవరి 30న కేరళలో తొలికేసు వెలుగుచూసిన తర్వాత భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్‌ మన దేశంలో సుమారు 50వేల మందిని బలిగొన్నది. మొత్తం కేసులు పాతికలక్షలను దాటేశాయి. రికవరీ రేటు 72 శాతంగా ఉన్నా, సుదీర్ఘకాలం గడిచినప్పటికీ కరోనా పరిస్థితులు అంతుచిక్కడం లేదు. వైరస్‌ రూపాంతరం, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానం, ఔషధాలు, వ్యాక్సిన్‌.. వంటి విషయాలు సైతం అర్థం చేసుకోలేక ప్రపంచ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.

   మొదట్లో చైనాకు పరిమితం అనుకున్నారు. తదుపరి స్పెయిన్‌, ఇటలీ తదితర దేశాల్లో మరణమృదంగం మోగించినప్పుడు కంగారు పడ్డారు. దేశంలో ప్రవేశించినప్పుడు భయపడ్డారు. ఇప్పుడు మన ఊరికి, మన గల్లీకి, మన పొరుగిండ్లలోకి.. ఆఖరుకు మన ఇంటిలోకి వైరస్‌ చొరబడుతున్నది! లాక్‌డౌన్లు పనిచేయలేదు. ఆరడుగుల భౌతికదూరం పాటించడమే మార్గం అనుకున్నా.. పదహారు అడుగుల వరకూ గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇదొక్కటేకాదు.. కరోనా ఆనుపానులు మహా శాస్త్రవేత్తలకే అంతుచిక్కడం లేదు. ఏది అనుకున్నా.. జరుగుతున్నది మాత్రం ఇంకొకటి. ఇన్ని నెలల్లో ఎంతో తెలిసినా.. నిజానికి తెలిసిందే గోరంతే! ఈ రెండువందల రోజుల్లో వైర స్‌ విషయంలో అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కో దేశంలో ఒక్కోలా వైరస్‌ ప్రభావం ఉండటం, మరణాల రేటు, వైరస్‌ వ్యాప్తిలో తేడాలు ఉండటం సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వైరస్‌ పరిస్థితులపై ఒకప్పుడు అనుకున్న ఆలోచనలు ఇప్పుడు లేవు.. ఇప్పుడు వేసుకుంటున్న అంచనాలు భవిష్యత్‌లో ఉంటాయని చెప్పలేమని వైద్యనిపుణులు చెప్తున్నారు. అయితే.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అయినా వైరస్‌ సోకినట్టయితే పరిస్థితి తీవ్రతను గమనించి వెంటనే వైద్యసలహా పొందటం, అవసరమైతే దవాఖానలో చేరడమే ఇప్పటికి ఉన్న ప్రత్యామ్నాయాలని యావత్‌ వైద్యలోకం ఘోషిస్తున్నది.

బహురూపుల కరోనా...


    కొవిడ్‌-19 వెలుగుచూసినప్పుడు దాని నిర్మాణం ఇతర కరోనా జాతి వైరస్‌ల మాదిరిగానే ఉన్నదని పరిశోధకులు భావించారు. దాని బాహ్యత్వచాన్ని చేధించేందుకు ప్రయోగాలు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఈ వైరస్‌ రూపాంతరం చెందడం మొదలైంది. దాని కొమ్ములు, బాహ్యత్వం, అంతర్నిర్మాణంలో మార్పులు మొదలయ్యాయి. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఏ2ఏ, ఏ3ఐ ఇలా సుమారు 2,500 రకాల ఉత్పరివర్తనాలను గుర్తించారు. వైరస్‌ వేగంగా మార్పులు చెందుతూ శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతున్నది. టీకా తయారైనా.. అన్ని రకాల ఉత్పరివర్తనాలకు కలిపి పనిచేస్తుందా? లేదా? అనే ప్రశ్నలు లేవనెత్తింది.


తొలిగిన అపోహలు...


    చైనాలో మొదటిసారి వైరస్‌ బయటపడిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అపోహలు. అవాస్తవాలు ప్రచారమయ్యాయి. దీంతో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. గాలి, నీరు, ఆహారం.. ఇలా అన్ని రకాలుగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని నమ్మారు. వివిధ దేశాల్లో రోడ్లపై పడి ఉన్న శవాలను చూసి కరోనా ప్రపంచాన్ని అంతంచేసేందుకు వచ్చిందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ బారిన పడకతప్పదని ఆందోళన చెందారు. గడిచిన కొద్ది నెలల నుంచి వైరస్‌ పట్ల ఉన్న అపోహలు తొలిగిపోయాయి. కరోనా తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని, శానిటైజేషన్‌, మాస్కులు, భౌతికదూరం పాటించడం ద్వారా పూర్తిస్థాయిలో అడ్డుకోవడం సాధ్యమవుతుందని గుర్తించారు. ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సైతం విస్తృతంగా ప్రచారంచేశాయి. దీంతో వైరస్‌పై మన దేశంలో కొంతవరకు పట్టు బిగించడం సాధ్యమైంది.


ఔషధాల్లో మార్పులెన్నో...


    వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి మందులు వాడాలి అనే దానిపై తొలిరోజుల్లో స్పష్టతలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసుకొని కొన్ని మందులు వినియోగంలోకి రాగా, ఇప్పటివరకు కరోనాను వంద శాతం ఎదుర్కొనే మందు కనుగొనలేకపోయారు. చికిత్స విధానంలో ప్రభావంతంగా వినియోగించే మందులు రోజురోజుకు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎమ్మార్‌ సైతం సరికొత్త మార్గదర్శకాలను జారీచేస్తున్నాయి. పలుమార్లు మందుల వినియోగంపై పూర్తి భిన్న స్వరాలను ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. తొలుత పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ప్రభావవంతంగా పనిచేస్తాయని ప్రపంచ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఫావిఫిరావిర్‌, రెమ్డిస్‌విర్‌ వంటి మందులు ప్రాణాలను కాపాడుతున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం బాధితులను వెంటిలేటర్‌ మీదకు వెళ్లకుండా ఉండేందుకు డెక్సామెథాసోన్‌ పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది.

వ్యాధి లక్షణాల్లో మార్పులు


    కరోనా లక్షణాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. తొలిరోజుల్లో ఆగకుండా దగ్గు రావటం, జ్వరం విపరీతంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలుగా చెప్పుకున్నాం. వైరస్‌ జన్యువుల్లో మార్పులు రావటం వల్ల కొత్త లక్షణాలు వచ్చిచేరాయి. వైరస్‌ 6 రకాలుగా ఉంటుందని అధ్యయనంలో తేలడంతో లక్షణాల్లో మార్పులు గమనించారు శాస్త్రవేత్తలు. వాసన, రుచి లేకపోవడం, గొంతులో మంట, ఛాతినొప్పి, కండరాల నొప్పి, ఫ్లూ లక్షణాలు, తలనొప్పి, గొంతు బొంగురు పోవడం, డైజెస్టివ్‌ సమస్యలు, ఆకలి లేకపోవడం, డయేరియా రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, అలసట, వాంతులు, వికారం, పొత్తి కడుపులో నొప్పి వంటి తాజా లక్షణాలు బయటపడ్డాయి. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, వివిధ వర్సిటీల అధ్యయనంలో.. నోటిలో దద్దుర్లు రావడం, చెవిపోటు, వినికిడి లోపం, కండ్లు ఎర్రబడటం వంటివీ కరోనా లక్షణాలేనని తేలింది.


శరీరంపై వైరస్‌ ప్రభావం


    కరోనా అనగానే ఊపిరితిత్తులపై దాడిచేస్తుందని ముందుగా నిర్ధారించారు. కానీ వైరస్‌ దాడిచేసే పరిధి అంతకు మించి అని తర్వాత రోజుల్లో స్పష్టమైంది. ఊపిరితిత్తులతోపాటు గుండె, మూత్రపిండాలు, కాలేయం, కండ్లు, జీర్ణ వ్యవస్థపైనా పెద్ద ప్రభావమే చూపుతుందని తేల్చారు. చాలామంది బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిన సమస్యలను వైద్యులు గుర్తించారు. ఇలాంటి వారి రక్తం శాంపిల్‌ను సేకరించిన కొద్ది క్షణాల్లోనే గడ్డ కడుతున్నదని వైద్యులు చెప్తున్నారు. రక్తనాళాలు పగిలిపోయి ఆ గడ్డలు ఊపిరితిత్తుల వరకు చేరడం వల్లే కొందరు చనిపోయారని చైనాలోని వైద్యులు వివరించారు. అందుకే రక్తం గడ్డకుండా ఉండే మందును ప్రస్తుతం కరోనా చికిత్సలో వినియోగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక గుండెకు కావాల్సినంత ఆక్సిజన్‌ సరఫరా కాకపోవడం వల్ల కరోనా సోకినవారిలో గుండె సమస్యలతో 30 నుంచి 60 శాతం మంది చనిపోతున్నట్టు పలు అధ్యాయనాలు స్పష్టంచేస్తున్నాయి.

కరోనా లక్షణాలు :  ◾ జ్వరం  ◾ వణుకు ◾ దగ్గు ◾ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ◾ అలసట ◾ ఒళ్లు నొప్పులు ◾ తలనొప్పి ◾ రుచి, ◾ వాసన లేకపోవటం ◾ గొంతు నొప్పి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top