Sunday 5 July 2020

ఆన్‌లైన్‌ బోధనతో అనర్థాలే ఎక్కువ - ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ఆన్‌లైన్‌ బోధనతో అనర్థాలే  ఎక్కువ       ఆంధ్రజ్యోతి : ఎడిటోరియల్
       Jul 5 2020 @ 00:22 AM

సంపాదక శీర్షిక వ్యాసం:

 ▪      సజీవమైన తరగతి గదికి, సజీవమైన ఉపాధ్యాయుని బోధనకు ఆన్‌లైన్ తరగతులు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావు. అధ్యాపకుని అడిగి ఏదైనా తెలుసుకునే అవకాశం విద్యార్థికి ఉండనే ఉండదు.

 ▪      పాఠశాల వాతావరణంలో సహజంగా ఉండే సంతులనజీవితం, మానసిక ఉల్లాసం పూర్తిగా పోతాయి. ఈ ఆన్‌లైన్‌ చదువుల వల్ల బోధనతో కలిగే సత్ఫలితాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాఠశాల విద్యను ఈ కొవిడ్ కాలంలో  తప్పనిసరిగా నియంత్రించాలి.

 ▪      కొవిడ్-19 మానవాళి జీవనంపైన వేసిన విభిన్న ప్రభావాలలో విద్యారంగం కూడా బాగా నష్టపోయిన వాటిలో ఒకటి. విద్యా సంవత్సరం బాగా చికాకు పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది.

▪       విద్యారంగంలో ఎక్కువగా నష్టపోయేది పాఠశాల విద్యే. పాఠశాల విద్యలో అంతర్జాల తరగతులు నిర్వహించి విద్యాబోధన చేయడంలో ఉండే సౌకర్యాలు ఏమిటి..? నష్టాలు ఏమిటి..? అని ఆలోచించి వివేచించడానికి ఉద్దేశించింది ఈ వ్యాసం.

  ▪     UNESCO, UNICEF వంటి అంతర్జాతీయ సంస్థలు పాఠశాల విద్యలో ఆన్‌లైన్ బోధన వల్ల వచ్చే సాధకబాధకాలను అధ్యయనం చేసి దీనితో వచ్చే నష్టాల పట్ల తీవ్రంగా హెచ్చరికలు చేసాయి.

 ▪      ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో ఆన్‌లైన్ తరగతుల హడావిడి మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మెయిల్ సందేశాలు పంపడం పదివేలు కట్టి పాస్ వర్డ్‌ తీసుకోండి అని చెప్పడం చేస్తున్నారని వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.

▪       కార్పొరేటు విద్యారంగానికి, ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యానికి విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతున్నారనే ఆలోచనకన్నా తమ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడింది అనే బాధే ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

 ▪      కరోనా కారణంగా మూతబడిన కాలానికి ప్రభుత్వాలు ఏమి నిర్దేశించినా రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేయడం వారు ఆపలేదు. ప్రైవేటు స్కూళ్ళ ఆగడాలు ఇప్పుడు కొత్త కాదు. కానీ కరోనా అడ్డుపడుతున్నా సంపాదించే దృష్ట్యా చిన్న పిల్లల జీవితాలతో ప్రయోగాలు చేసే ఈ ధోరణిని ప్రభుత్వాలు తప్పనిసరిగా అడ్డుకొని ఆపవలసి ఉంది.

 ▪      ప్రైవేటు యాజమాన్యం ఒక పాఠశాల విద్యార్థులకు కాని వారికి ఉన్న అన్ని స్కూళ్ళలోను విద్యార్థులకు కాని ఒకే చోటునుండి పాఠాలు ఆన్‌లైన్‌లో అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పాఠాలను ఏ సమయంలో ఉండేది ఇంటికి మెయిల్ కాని మెసేజ్ లు కాని పంపిస్తారు. ఆ సమయానికి విద్యార్థి తన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్, ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్ లలో దేనినైనా దగ్గర పెట్టుకొని ఇంటర్‌నెట్‌కి కనెక్టు కావాలి.

  ▪     యూట్యూబ్‌లో కాని లేదా పాఠశాల వారు అందించిన యాప్‌ ద్వారా కాని పాఠాలు చూడాలి వినాలి. ఇక్కడ విద్యార్థి దృష్టి కేవలం తన ముందున్న చిన్న తెరపైనే ఉంటుంది. ల్యాప్‌ టాప్ తెరే చాలా చిన్నది అని అనుకుంటే ఇక ట్యాబ్‌లలో కాని లేదా స్మార్ట్‌ఫోన్లలో కాని పాఠాలు చూడడం పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మెదడుపైన చాలా ఒత్తిడి పడుతుంది, కంటి పైన చాలా శ్రమ పడుతుంది.

 ▪      ఇది ఒక రకంగా ఆరోగ్యసమస్యకు దారి తీస్తుంది. అంతే కాదు విద్యార్థికి కొన్ని గంటల పాటు ఆ చిన్న తెర ఎదురుగా ఉండి పాఠాలు వినడం అంటే పెద్ద శిక్షే అవుతుంది.

 ▪      సజీవమైన తరగతి గదికి, సజీవమైన ఉపాధ్యాయుని బోధనకు ఆన్‌లైన్ తరగతులు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావు.

▪       అధ్యాపకుని అడిగి ఏదైనా తెలుసుకునే అవకాశం విద్యార్థికి ఉండనే ఉండదు. విద్యార్థికి ఉండే సామాజిక జీవితం, దైనందిన జీవన క్రమం (social life and process) కోల్పోతాడు. ఈ స్థితి తప్పనిసరిగా కొవిడ్ వల్ల ఏర్పడినప్పుడు కోల్పోయిన సామాజిక జీవితానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి.  కాని ఆన్‌లైన్ విద్య విద్యార్థిని మరింత ఒంటరిని (isolate) చేస్తుంది. ఇది మరింత నష్టం అని యునెస్కో హెచ్చరించింది.

 ▪      మన తెలుగు రాష్ట్రాలలో మరొక పెద్ద సమస్య దీని వల్ల ఉత్పన్నమవుతుంది. ఈ ఆన్‌లైన్‌ విద్య పేదలకు ధనిక వర్గానికి మధ్యన ఉన్న గండిని మరింత పెంచే, విభజించేలా చేస్తుంది.  గ్రామీణ విద్యకు పట్టణ విద్యకు మధ్యన చాలా పెద్ద అంతరాన్ని ఇది తీసుకువచ్చే అవకాశం ఉంది.

▪       మన ప్రైవేటు విద్యాసంస్థలు వారి వ్యాపార సామ్రాజ్యాన్ని మండల స్థాయి వరకు ఇంకా పెద్ద గ్రామాల స్థాయి వరకు పెంచాయి. అంతే కాదు ఒక పట్టణంలో వారి పాఠశాల బ్రాంచి ఉంటే దానికి చుట్టుపక్కల పది గ్రామాలనుండి తమ బస్సులలోనే విద్యార్థులను తెచ్చుకొని తిరిగి వారి ఊర్లకు పంపిస్తూ (ఈ బస్సులది కూడా పెద్ద వ్యాపారమే) తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పల్లెలలోనికి కూడా తీసుకుపోయారు.

▪       ఇంగ్లీషు మీడియం చదువు ఉంటేనే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, వారికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పే వీరి వ్యాపార స్లోగన్ బాగా పనిచేసింది. దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కింది తరగతి పేదలు కూడా చాలామంది వారి పిల్లలను కార్పొరేటు పాఠశాలలో చేర్పించారు.

▪       ఒక కార్పొరేటు పాఠశాలలో విద్యార్థిని చేర్పించడానికి ఒక ఆటో కార్మికుడు సంవత్సరం అంతా సంపాదించిన డబ్బును మూట కట్టుకొని వచ్చి ఇస్తున్న దృశ్యాన్ని కొంత కాలం క్రితం ఈ వ్యాసకర్త చూశాడు. పది రూపాయలు ఐదు రూపాయల నోట్లు అత్యధికంగా అందులో ఉండడం గమనించాడు.

 ▪      ఇలా పేదల మనస్సులలో పెంచి పోషించిన ధోరణి వల్ల పేదలకు వచ్చే ఎక్కువ ఆదాయం పిల్లల చదువులకే కేటాయించవలసిన పరిస్థితి నేడు ఉంది. ఈ స్థితిలో ప్రైవేటు పాఠశాలలో ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశ పెడితే పేదలు వారి పిల్లలకు ఒక కంప్యూటర్ కొనాలంటే 30 వేలకు పైగానే పెట్టవలసి వస్తుంది.

▪       రాజీపడి ట్యాబ్ కొనాలన్నా, పది అంగుళాల ట్యాబ్ మంచిది కొనాలన్నా కనీసం 20 వేలనుండి పైగానే పెట్టాలి. ఐప్యాడ్‌ 60 వేల రూపాయల నుండి మొదలు అవుతుంది. తక్కువ ధరలో ఉండే స్మార్ట్‌ ఫోన్ కూడా కనీసం ఇరవై వేలు పెట్టాలి. మంచి స్పీడు బాగా చూడగలిగే తెర ఉండే ఫోన్ కొనాలంటే 40 వేల దాకా పెట్టవలసి ఉంటుంది.

▪       పేదలు వీటిని కొనడం అదీ గ్రామీణ పేదలకు మరింత కష్టం. టెక్నాలజీతో తక్కువ పరిచయం ఉండే గ్రామీణ వాతావరణంలో ఇది మరోరకమైన కష్టం.

▪       పట్టణాలలో ఫైబర్‌ నెట్‌వర్క్ లైన్లు ఉంటాయి. వేగవంతమైన ఇంటర్‌నెట్ లభిస్తుంది. దీని కనెక్షన్ తీసుకోవాలంటే నెలకు కనీసం 800 వందలనుండి వెయ్యి రూపాయిలు పెట్టవలసి ఉంటుంది. ఈ భారాన్ని పేద విద్యార్థులు తట్టుకోలేరు.

 ▪      ఇక నెట్ కనెక్షన్ కోసం మొబైల్‌ ఫోన్‌ పైన ఆధారపడడం కూడా మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. మండల ప్రాంతాలలో సిగ్నల్‌ సమస్యలు ఉంటాయి. పాఠాలను ఓపెన్‌ చేయడం ప్రసారం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీడియో ఫైళ్లను తెరచి చూపించడానికి గట్టి సిగ్నళ్ళు అవసరం.

▪       ఇక్కడ చెప్పిన కారణాలు, సమస్యలు అన్నీ కూడా ధనిక వర్గానికి సమస్యలుగా కనిపించకపోవచ్చు. వారు తమ పిల్లలకు ఈ సౌకర్యాలను అందజేయగలుగుతారు. కాని అటు గ్రామీణ పేదలు కాని ఇటు పట్టణాలలో ఉండే పేదలు కాని ఈ సౌకర్యాలను వారి పిల్లలకు అందించలేరు.

▪       ఈ కారణంగా ఈ ఆన్‌లైన్‌ విద్య పేదవారికి విద్యను మరింత దూరం చేస్తుంది. పేద ధనిక వర్గాల మధ్య గండిని మరింత పెంచుతుంది. అంతే కాదు పట్టణ విద్య గ్రామీణ విద్య మధ్య కూడా అంతరాన్ని బాగా పెద్దది చేస్తుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ విద్య అందుబాటులోనికి రాక వారికి అన్యాయం జరుగుతుంది.

▪       వీటన్నింటికి మించి పసివయస్సులోని పిల్లలు అంతర్జాలానికి పూర్తిగా అంటుకు పోయి దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం, చూడకూడని సైట్లు చూసే పరిస్థితి రావడం, గేములకు అలవాటు పడడం వీటి ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

▪       పాఠశాల వాతావరణంలో సహజంగా ఉండే సంతులనజీవితం, మానసిక ఉల్లాసం మిత్రులతోను అధ్యాపకులతోను గడిపే ఆ వాతావరణం పూర్తిగా పోతాయి. సామూహిక సామాజిక జీవితం వీలుపడని వర్తమాన స్థితిలో, ప్రత్యామ్నాయంగానే ఈ పద్ధతి ఉంటుంది అని ప్రైవేటు యాజమాన్యాలు సమర్థించుకో జూచినా ఈ ఆన్‌లైన్‌ చదువుల వల్ల బోధనతో కలిగే సత్ఫలితాల కన్నా పైన చెప్పిన నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

▪       కాబట్టి పాఠశాల విద్యను ఈ కొవిడ్ కాలంలో తప్పనిసరిగా నియంత్రించవలసి ఉంది. బడులు ఎప్పుడు తెరవాలి..? తెరచినా ఏ ఆరోగ్యసూత్రాలను అమలు చేయాలి..? అనే నిబంధనలు విధించాలి. పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. ప్రైవేటు పాఠశాలల  దూకుడును అదుపులో పెట్టవలసిన అవసరం ఉంది.

▪       ప్రభుత్వాల అనుమతితో పని లేకుండానే ఈ యాజమాన్యాలు అనుసరిస్తున్న పద్ధతులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ పాఠాలు ఉన్నా కూడా యూనిఫామ్‌లు కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం వంటి చర్యలను చూస్తే ఈ వ్యాపారధోరణి ఎన్ని వెర్రితలలు వేస్తూ ఉందో గమనించవచ్చు.

▪       కొన్ని సందర్భాలలో ఇలాంటి వింత నిర్ణయాలు వినే వారికి నవ్వు తెప్పిస్తాయి. కాని ఆ నవ్వు ఒక భయంకరమైన విషాదానికి పై పూత వంటిది అ నిగమనించాలి.      ౼ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top