Thursday 23 July 2020

కరోనా గురించి కొన్ని సందేహాలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జారీ చేసిన సూచనలు



కరోనా గురించి కొన్ని సందేహాలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జారీ చేసిన సూచనలు










1. దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నవారు ఎవరికి తెలియజేయాలి?

జ. మీరు నివసించు ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలకు లేదా వార్డు/గ్రామ వాలంటీర్లకు తెలియజేయాలి. వారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి మీకు కోవిడ్ పరీక్ష చేయుటకు ఏర్పాటు చేస్తారు.

2. కోవిడ్ పరీక్ష లో పాజిటివ్ గా నిర్ధారించిన ఎడల ఏమి చేయాలి ?

జ. ముందుగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండవలెను. కుటుంబ సభ్యులతో గాని ఇతరులతో కానీ కలవకుండా దూరాన్ని పాటించాలి. మాస్కు ధరించాలి. ఇంట్లో సామానులు ఏమి తాకరాదు. ఇంటిలో 60 సంవత్సరాలు పైబడినవారు, పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారికి దూరముగా ఉండవలెను. వారికి కూడా పరీక్షలు నిర్వహించే వరకు విడిగా ఉండవలెను.

3. వ్యాధి నిర్ధారణ తర్వాత ఏం చేస్తారు ?

జ. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రి వద్ద ఆరోగ్య కార్యకర్తలు లేదా మండల /మున్సిపాలిటీ అధికారులు పరీక్షలు నిర్వహించెదరు.

4. ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు ?

జ. ప్రతి కరోనా సోకిన వ్యక్తికి రక్త పరీక్షలు, ఎక్స్ రే, శ్వాస పరీక్షలు మొదలగునవి చేసి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

5. పరీక్షల అనంతరం ఏం చేస్తారు ?

జ. వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో సుమారు 75 మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. అలాంటి వారు ఇంటి వద్దనే పదిరోజులు ఆరోగ్య కార్యకర్తల సలహాలు పాటించాలి. మిగతా 25 మందిని వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్ కేర్ సెంటర్స్ కు మరియు ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది.

6. హోమ్ ఐసోలేషన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు ఎలా నివృత్తి చేస్తారు ?

జ. ముందుగా ప్రజలు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధి ఇప్పటికిప్పుడే అంతరించి పోదు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికి హాస్పటల్లో చికిత్స అవసరం లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. భవిష్సత్ లో చాలా ఎక్కువ మంది వ్యాధికి గురికావచ్చు. అందరూ హాస్పటల్లో చేరాలని కోరుకోవటం సహజమే కానీ సాధ్యపడదు. అందువలన వ్యాధి లక్షణాలు లేనివారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందాలి.

7. వ్యాది సొకిన వ్యక్తి పట్ల ఇరుగు పొరుగు వారి భయాలు ఎలా ఉంటాయి ?

జ. కరోనా వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఇరుగు పొరుగు వారు భయపడడం సహజమే. కానీ ఇంటిలోని వారు ఇరుగు పొరుగు వారు మానసికంగా సిద్ధపడాలి. రేపు మీకు కూడా రావచ్చు. అలా అని ప్రతి ఒక్కరిని వెలివేయడం సమంజసం కాదు. ఇది ఒక తరహా ఫ్లూ లాంటిది. వస్తుంది పోతుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుని పట్ల సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి.

8. హోం ఐసోలేషన్ ఉండాలంటే వారి గృహంలో ఎలాంటి సదుపాయాలు ఉండాలి ?

జ. వేరే గది మరియు మరుగుదొడ్డి ఉండాలి. ఒకవేళ ఒకే మరుగుదొడ్డి ఉంటే వ్యాధిగ్రస్తుడు వాడిన అర్ధగంట తరువాత ఇతరులు వాడుకోవచ్చు. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడరు తో మరుగుదొడ్డి శుభ్రం చేస్తే సరిపోతుంది.

9. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యాధిగ్రస్తుడి తో ఎవరు ఉండవచ్చు ?

జ. వృద్ధులు చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారిని వేరే గృహంలో ఉంచాలి. వ్యాధిగ్రస్తుని కి సపర్యలు చేయుటకు ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది .

10. సపర్యలు చేయు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

జ. ఎల్లప్పుడూ మాస్కు ధరించాలి. సోకిన వ్యక్తి యొక్క వస్తువులను బట్టలను తాకరాదు. ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి.

11. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

జ. ముందుగా వ్యాధి తీవ్రత లేదు కాబట్టే ఇంటిలో ఉండమన్నారు అని తెలుసుకోవాలి. ఎప్పుడు సెల్ ఫోను ఆన్ లో ఉంచుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. కార్యకర్తలు అందజేసిన మందులు వాడాలి. తేలికపాటి వ్యాయామాలు ధ్యానం చేయాలి. వారి గదిని, బట్టలను మరుగుదొడ్డిని వారే శుభ్రం చేసుకోవాలి. అతను ఉపయోగించిన పాత్రలు శుభ్రం చేసుకోవాలి.

12. హోం ఐసోలేషన్ లో ఎన్ని రోజులు ఉండాలి ?

జ. జ్వరం గాని ఇతరత్రా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేని ఎడల పది రోజుల తదుపరి పూర్తిగా కోల్కన్నట్లుగా భావించవచ్చును.14 రోజుల తర్వాత అతను దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చును.

13. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి ?

జ. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ సెంటర్లో వీరి పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు కాబడును. ప్రతిరోజు కాల్ సెంటర్ ల నుండి వీరికి ఫోన్ చేసి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసు కొందురు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు వారి ఆక్సిజన్ స్థాయిలను తెలుసు కొందురు. మందులను అందజేస్తారు అత్యవసరమైన ఎడల కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వెంటనే మెరుగైన చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించ బడును. అధైర్య పడవలసిన అవసరం లేదు.

14. హోం ఐసోలేషన్ అనంతరం పరీక్షలు అవసరమా ?

జ. అనారోగ్య లక్షణాలు లేని ఎడల మరలా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.

15. ఎటువంటి ఆహారం తీసుకోవాలి ?

జ. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారులు పప్పు ధాన్యాలకు , పాలు, పండ్లు, ప్రాధాన్యతనివ్వాలి. మాంసాహారులు పాలు, పండ్లు, గుడ్డు, చికెన్, మటన్, చేపలు ఆహారంగా తీసుకోవచ్చును.

16. హోమ్ ఐసోలేషన్ వారిపట్ల ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా నివృత్తి చేస్తారు ?

జ. హోమ్ ఐసోలేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అనేది ముందుగా ప్రజలు అర్థం చేసుకోవాలి. గాలి ద్వారా వ్యాప్తిచెందుతోంది అనే ఆలోచన రాకూడదు.ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ప్రేమాభిమానాలతో చూసుకోవాలి. అటువంటి వ్యక్తిని తాకరాదు. మనం పోరాడాల్సింది కరోనాతో, వ్యక్తి తో కాదు అనే నినాదాన్ని తూచా తప్పక పాటించాలి. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. మాస్కు ధరించాలి. అవసరమైతే తప్ప బయటకి రాకూడదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top