Saturday 30 April 2022

పెన్షన్‌పై అవాస్తవాలు - ఒపిఎస్‌ భారం కాదు

 పెన్షన్‌పై అవాస్తవాలు - ఒపిఎస్‌ భారం కాదు



🔖 ప్రపంచీకరణలో భాగంగానే రద్దు

🔖 ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన

🔖 ప్రజాశక్తితో పిడిఎఫ్‌ పక్ష నేత విఠపు బాలసుబ్రమణ్యం

● ''ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు యైన పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది.నిజానికి ప్రపంచీకరణ విధానాల్లో భాగంగానే పాత పెన్షన్‌ విధానం (ఒపిఎస్‌)ను రద్దు చేశారు.ఆ దుర్మార్గామైన రాజకీయ,ఆర్ధిక విధానాల్లో భాగంగానే సిపిఎస్‌ను ముందుకు తీసుకువచ్చారు. ఇది హక్కులపై జరిగిన దాడి. 

● దీనికి బీజం వేసిన కాంగ్రెస్‌ పార్టీయే వెనక్కి తగ్గింది. హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలూ సిపిఎస్‌ను వద్దంటున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌లు ఇప్పటికే రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్దరించాయి.

● తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలూ ఈ దిశలో ప్రయత్నాలు ప్రారంభించాయి.మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పడటం లేదు. అంట కాగుతోంది.సిపిఎస్‌ రద్దుకు వెనకాడటంలో ఇదే కీలకాంశం. 

● పిఆర్‌సి విషయంలో ఉద్యోగులు వంచనకు గురయ్యారు.ఇదే పరిస్థితి సిపిఎస్‌ విషయంలో రాకూడదంటే ఉద్యోగులు,ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలి.ఐక్యపోరాటాలు మాత్రమే హక్కులను కాపాడతాయి.అవసరమైతే సిపిఎస్‌ రద్దు కోసం దీర్ఘకాల ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలి' పిడిఎఫ్‌ పక్ష నేత విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు.

● ప్రజాశక్తి ప్రతినిధి బాలకృష్ణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సిపిఎస్‌, ఒపిఎస్‌లతో ప్రభుత్వం ప్రకటించిన జిపిఎస్‌లకు సంబంధించిన అనేక అంశాలను ఆయన వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా


 పాత పెన్షన్‌ విధానం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

 ప్రభుత్వం ఈ నెల 29న పత్రికల్లో రెండు పేజీల ప్రకటన విడుదల చేసింది.అందులో కొన్ని వాదనలు ముందుకు తెచ్చింది.ఒకటి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, రెండోది ఈ భారాన్ని తట్టుకోలేక 2003వ సంవత్సరం మాదిరి మొత్తం పెన్షన్‌కే మోసం వస్తుందని పేర్కొంది.ఈ రెండు వాదనల్లోనూ వాస్తవం లేదు.రాజస్థాన్‌ ప్రభుత్వం పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తూ ఇచ్చిన పత్రికా ప్రకటన చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది.

రాజస్థాన్‌లో 4.95 లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులు ఉన్నారు.ఎపిలో వారి సంఖ్య 1.85లక్షలు మాత్రమే. పాత పెన్షన్‌ ఇచ్చినందు వల్ల సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజస్థాన్‌ ప్రకటించింది. మరి కేవలం 2లక్షల మంది కూడా లేని మన రాష్ట్రానికి ఎందుకు భారమవుతుంది? 

రాజస్థాన్‌ ప్రభుత్వం పెన్షన్‌ వల్ల సామాజిక బాధ్యత సాధ్యమవుతుందని,ఉద్యోగుల పనితీరు బాగా మెరుగుపడుతుందని,ప్రతిభా వంతులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వస్తారని పేర్కొంది.ఎపి ప్రభుత్వం ఈ వైపు ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడడం లేదు?

అలాగే 2003వ సంవత్సరంలో భారత జిడిపి పెరుగుదల 7.9 శాతం ఉంది.ఆ రోజుల్లో ఆర్థిక భారం అయినందు వల్ల పెన్షన్‌ తీయాల్సి వచ్చిందని ఎపి ప్రభుత్వం ఎలా చెబుతోంది.వాస్తవానికి అప్పుడు అమెరికా జిడిపి 2.9 శాతం, పాకిస్తాన్‌ 5.9 శాతం పెరుగుదలలో ఉన్నాయి.కాబట్టి పెన్షన్‌ను రద్దు చేసింది ఆర్థిక భారమై కాదు.ప్రపంచీకరణలో భాగంగా ఓ రాజకీయ ఆర్థిక విధానంగా రద్దు చేశారు.దీనిని ప్రభుత్వం దాచిపెట్టింది.


 ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల పై మీ అభిప్రాయం ఏమిటి ?

 ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు మోసపూరితంగా ఉన్నాయి.నానాటికీ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. కాంట్రాక్ట్‌,ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పెరిగి పోతున్నాయి.గత 20 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉద్యోగులు ఎందరు తగ్గారోకూడా ప్రభుత్వం చెప్పి ఉంటే బాగుండేది.ప్రస్తుతం ప్రభుత్వం ఆదాయంలో 23శాతం జీతాలు,పెన్షన్లకు వెళుతుందని చెప్పి, 2030కి ఇది 29శాతానికి,2040 ఎకాఎకిన 181 శాతానికి పెరుగుతుందని ఏ లెక్క ప్రకారం చెబుతున్నారో.. అర్థం కావడం లేదు. 

ఉద్యోగులు చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్‌,కార్పస్‌ ఫండ్‌ ఇప్పటికే రూ.15వేల కోట్లకు పైగా ఉంది.ఇది కాలం గడిచే కొద్దీ బాగా పెరుగుతుంది.ఈ రాబడిని ఉద్దేశ పూర్వకంగానే దాచిపెట్టింది.రాబడి ఎంత పెరుగు తుందో.. ఆ వివరాలు కూడా ప్రభుత్వం ప్రకటించి వుంటే బాగుండేది. తక్కువలో తక్కువ 15శాతం క్యుమ్యూలేటివ్‌గా పెరుగుతుందనేది వాస్తవం. అందుకే ఈ లెక్కలను ఖండిస్తూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కొన్ని గణాంకాలను ప్రకటించింది. ప్రభుత్వం దీనికి కూడా సమాధానం చెప్పాలి. తమకు ఇష్టమైన పద్ధతుల్లో గణాంకాలు రూపొదించడం, ప్రజలను పక్కదారి పట్టించడం, ఈ మధ్య ఒక సాంప్రదాయంగా మారింది.


 ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ పై మీరేమంటారు ?

 ఉద్యోగి 30 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేస్తే మూల వేతనంలో 33శాతం పెన్షన్‌ గ్యారంటీ చేస్తా మని ప్రభుత్వం చెబుతోంది.తక్కువ సర్వీసులోనే రిటైర్‌ అయితే ఎంత పెన్షన్‌ ఇస్తారు.? కుటుంబ పెన్షన్‌ ఉంటుందా..? ఉండదా ..? రేపు ఇదికూడా భారమైందని కాంట్రిబ్యూషన్‌ పెంచరని హామీ ఏమిటీ..? గ్రాట్యుటీ ఎంతిస్తారు.? కంట్రిబ్యూషన్‌కు తిరిగి ఎంత చెల్లిస్తారు..? జీవితాంతం ఇదే పెన్షన్‌తో సరిపెట్టుకోవాలా..? వయస్సు,అవసరాలు పెరిగే కొద్దీ పెన్షన్‌ కూడా పెంచుతారా..? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు లేవు.ఇవన్నీ ఆశించవద్దని ప్రభుత్వం నర్మగర్భంగా చెబుతున్నట్లు అనిపిస్తుంది.


 ఉద్యగికి ఆప్షన్స్‌ సౌలభ్యం కల్పిస్తామంటున్నారు కదా...?

10శాతం కాంట్రిబ్యూషన్‌తో 33శాతం, 14శాతం కాంట్రిబ్యూషన్‌తో 40శాతం పెన్షన్‌ ఇస్తామని దీని కోసం ఉద్యోగులు ఆప్షన్‌ ఇచ్చుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.ఇది పచ్చి మార్కెట్‌ విధానం.ఉద్యోగిపై బాధ్యత,భారం పెంచి అతని పెన్షన్‌కు అతడినే బాధ్యుడిగా చేసే విధానం.ఇది రాబోయే కాలంలో ప్రభుత్వం బాధ్యతలను తగ్గించి,ఉద్యోగి బరువు పెంచి,సామాజిక భద్రతకు అవకాశం లేకుండా చేస్తోంది.ఈ విధానమే తప్పు


 ప్రభుత్వంపై సిపిఎస్‌ రద్దు వల్ల భారం ఏమీ ఉండదంటారా ?

ఉంటుంది.కానీ, ప్రభుత్వం చెప్పినంతగా మోయలేని భారంగా మాత్రం ఉండదు.ఇప్పటికే కేంద్రం వద్ద 6.85లక్షల కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్‌ ఉంది.రాష్ట్ర ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద ఎందుకు ఉంచుకోవాలి.? తమిళనాడు ప్రభుత్వంలాగా ఆ నిధిని వెనక్కి తీసుకురావచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన కంట్రిబ్యూషన్‌ ను కొనసాగించి ఒక నిధిగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఠక్కర్‌ కమిషన్‌ కూడా ఈ సూచనే చేసింది.ఇలాంటి ఆలోచనలు చేయకపోగా,ప్రభుత్వం అవాస్తవ గణాంకాలు ముందుకు తెచ్చి,ఉద్యోగులపై వ్యతిరేకతను ప్రజల్లో రెచ్చగొడుతుంది.తామేదో 2100వ సంవత్సరం నాటి పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నట్లు,ఉద్యోగులు భవిష్యత్తు తరాలను అంధకారంలోకి ముంచుతున్నట్లు పనిగట్టు కొని ప్రచారం చేస్తోంది.వాస్తవానికి రాష్ట్ర ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. ఈ యేడాది సుమారు 12వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. కనీసం వాటిలో సగం పోస్టులు కూడా భర్తీ కావడం లేదనేది వాస్తవం.మరి ప్రభుత్వానికి భారమెందుకు అవుతుంది?

 

సిపిఎస్‌ నుంచి వెనక్కి రావడం సాధ్యం కాదని చెబుతున్నారు కదా..  మీరేమంటారు ?

 ఇది ఏమాత్రం నిజం కాదు.రాష్ట్ర ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు రాష్ట్ర పరిధిలోనివి.ఖజానాల నుంచి వీటిని చెల్లిస్తున్నారు.కేంద్రం రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్‌ను ఎలా నిర్ణయిస్తుంది.? ఆ హక్కు దానికి ఎక్కడ ఉంది.? ఇదే నిజమైతే 2003కు ముందు ఎంపికై 2004 తరువాత నియామకమైన వారికి మొదట సిపిఎస్‌ అమలు చేసి,ఇప్పుడు కేంద్రమే వారికి ఓపిఎస్‌లోకి వచ్చేందుకు ఎలా ఉత్తర్వులు ఇచ్చింది.అంత ఉల్లఘించడానికి వీలు లేని నియమమైతే. తమిళనాడు ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఎన్‌ఎస్‌డిఎల్‌ కు జమ చేయలేదు. పశ్చిమ బెంగాల్‌లో పాత పెన్షన్‌ ఎలా అమలవుతుంది.? ఇలా చూస్తే ఉద్యోగుల పెన్షన్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది.


 సిపిఎస్‌ రద్దుపై ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ?

 ప్రపంచీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా సిపిఎస్‌ వచ్చిందనేది స్పష్టం.ప్రపంచీకరణ వల్ల ఇతర నష్టాల లాగానే ఇది కూడా ఆందోళనలకు దారి తీసింది.ఈ సెగ సహజంగానే రాష్ట్రాలకు ఎక్కువగానే తగిలింది. ఫెడరల్‌ వ్యవస్థ ఉన్న మన దేశంలో సహజంగానే ఆయా రాష్ట్రాలు ఆయా పార్టీలు ఈ ఆందోళనలకు తలగ్గి తప్పలేదు.ఇప్పటికే రాజస్థాన్‌, ఛతీస్‌ఘడ్‌ పాత పెన్షన్‌ పునరుద్ధరించాయి.సిపిఎస్‌కు బీజం వేసిన కాంగ్రెస్‌ పార్టీయే వెనక్కి వెళ్లడం ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశం.తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాలు సిపిఎస్‌ రద్దు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆశ్చర్యమే మంటే బిజెపి పాలిస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌ కూడా ఇదే బాట పట్టింది.రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడుల్లా.. ఒక్క బిజెపి మినహా అన్ని పార్టీలు సిపిఎస్‌ రద్దును తమ మేనిఫెస్టోలో చేర్చుతున్నాయి.రేపో మాపో బిజెపి కూడా ఎన్నికల కోసమైనా తన వైఖరిని మార్చక తప్పదు.ప్రపంచీకరణకు పట్టిన గతి సిపిఎస్‌కూ పడుతుంది.


సిపిఎస్‌ ఉద్యోగులకు మీరిచ్చే సూచనలేమిటి ?

సిపిఎస్‌పై ఇంత చర్చ భారత దేశంలో ఎక్కడా లేదు.మన రాష్ట్రంలోనే జరగడం ఐక్య పోరాట ఫలితం.ఇది ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల సమరశీల వారసత్వ ఫలితం.దీనికి గర్వించాలి. సిపిఎస్‌ అనేది ఒక దుర్మార్గమైన రాజకీయ, ఆర్థిక విధానంలో భాగమన్న స్పృహ ఉద్యోగులందరికీ స్పష్టంగా ఉండాలి.భారత దేశంలో ప్రపంచీకరణ అనుకూల రాజకీయాలు ఉన్నంత కాలం ఇలాంటి సమస్యలు ఉద్యోగులకు వస్తూనే ఉంటాయనేది ఎవరూ మర్చిపోకూడదు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంటకాగుతోంది.ఘర్షణ పడడం లేదు. సిపిఎస్‌ రద్దుకు వెనుకాడడంలో ఇది కూడా ఓ కీలక అంశం.దీనిని అర్థం చేసుకోవాలి.పిఆర్‌సి విషయంలో ఉద్యోగులంతా వంచనకు గురయ్యారు. ఇదే పరిస్థితి సిపిఎస్‌ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.ఉద్యోగులు,ఉపాధ్యాయు లందరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతిమంగా ఐక్య పోరాటాలు మాత్రమే కాపాడుతుయి, ఐక్య పోరాటమే విజయపథం వైపు నడుపిస్తుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గం ఏకం కావాలి. చిన్న చిన్న అవరోధాలు ఉంటే పక్కన బెట్టి దీర్ఘకాలమైనా పోరాడి సిపిఎస్‌ను రద్దు చేసుకునేందుకు సిద్ధమవ్వాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top