2.4 లక్షలు ఖాళీ పోస్టులు - అందులో 1.75 లక్షలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌కు
రాష్ట్రంలో ఇంకా 66,309 నికర ఖాళీలుఅసెంబ్లీలో వెల్లడించిన మంత్రి బుగ్గన
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఎన్ని? వేలా? లక్షలా? మంజూరైన పోస్టులను బట్టి 2,41,309 ఖాళీలు ఉన్నాయి. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా సర్కారు ఈ గణాంకాలను బయటపెట్టింది. రాష్ట్రంలోని 33 ప్రభుత్వ శాఖల పరిధిలో మంజూరైన(సాక్షన్డ్) పోస్టులు 7,71,177 ఉండగా, అందులో 5,29,868 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. 2,41,309 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,75,000 పోస్టులను ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో నిర్వహిస్తోంది. అయినా నికరంగా ఇంకా 66,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో శాఖల వారీగా ఖాళీలు, వాటి భర్తీకి సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాళం, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వివరాలను శాసనసభ ముందుంచారు. గ్రామ,వార్డు సచివాలయాల కోసం 1.26 లక్షల నియామకాలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది 51,488 మందిని రవాణా శాఖలో విలీనం చేశామన్నారు. 2021-22 రిక్రూట్మెంట్ కేలండర్ ద్వారా 10,143, ఆ తర్వాత వివిధ జీవోల ద్వారా మరో 22,306 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిందని వివరించారు, ఏటా ఖాళీల భర్తీ కోసం జాబ్ కేలెండర్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ట్లు తెలిపారు. అయితే, ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మంత్రి వెల్లడించలేదు.
భర్తీ ఎప్పుడు?లక్షల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నింపేసిన సర్కారు వాటిని ఎప్పుడు భర్తీచేస్తుంది? నిరుద్యోగుల నుంచి ఎదురవుతున్న ఏకైక ప్రశ్న ఇదే. పక్కరాష్ట్రం తెలంగాణ శాఖలు, పోస్టుల వారీగా ఖాళీలను ప్రకటించింది. వాటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామంది. మరి ఏపీలో భర్తీ ఎప్పుడు? కేటగిరీల వారీగా ఖాళీలను ప్రకటించేది ఎప్పుడు? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉంటే, ఏటా 10వేల పోస్టుల భర్తీకి జాబ్ కేలండర్ అంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా? అసలు పోస్టులు భర్తీచేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
0 comments:
Post a Comment