అమ్మ ఒడికి అందని నిధి! 2021-22 సవరించిన బడ్జెట్‌లో కేటాయింపులు సున్నా : జూన్‌కు వాయిదా వేయడంతో రూ.6,500 కోట్ల మిగులు
విద్యార్థుల హాజరు పేరుతో ‘అమ్మఒడి’ పథకం డబ్బులను ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం లేదు. సవరించిన (2021-22) బడ్జెట్‌లో ఈ పథకానికి నిధుల కేటాయింపును సున్నాగా చూపించింది. వెరసి ఈసారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పేలా లేదు. అమ్మఒడి కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు రూ.15వేలు అందించే పథకాన్ని ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు కుటుంబంలో ఎందరున్నా ఒక్కరికే ప్రయోజనం అందుతుంది. ఈ మొత్తాన్ని తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొదటి ఏడాది 2020 జనవరి 9న 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,456 కోట్లు జమ చేశారు. తర్వాత ఏడాది 2021 జనవరి 11న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు వేశారు. 2021-22లో ఇవ్వకపోవడంతో ఐదేళ్లలో నాలుగు పర్యాయాలే అమ్మఒడి సొమ్ము లబ్ధిదారులకు అందనుంది. 2022, 2023 సంవత్సరాల్లో జూన్‌లో పథకం అమలు చేస్తే 2024 జూన్ నాటికి ఈ పథకం అందకుండానే సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. తొలి రెండేళ్లు జనవరిలో అమలు చేసిన పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. విద్యార్థుల 75 శాతం హాజరును పరిగణనలోకి తీసుకుని, పాఠశాలలు పునఃప్రారంభించే సమయంలో అమ్మఒడి ఇస్తామని ప్రకటించింది. ఈ నిబంధన కారణంగా 2021-22 ఆర్థిక, విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల తల్లులకు ఎలాంటి ప్రయోజనం అందదు. ఈసారి జూన్‌లో ఇవ్వనున్న రూ.6,500 కోట్ల నిధి 2022-23 విద్యా, ఆర్థిక సంవత్సరాల కిందకు వస్తుంది. అది 2022-23 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజులకు సరిపోతుంది. ప్రస్తుత ఏడాది ఫీజుల భారానికి ఉపశమనం లభించదు. ఫిబ్రవరి వరకు విద్యార్థుల హాజరును పరిశీలించి మార్చిలో డబ్బులు ఇచ్చే అవకాశమున్నా పట్టించుకోలేదు.
0 Post a Comment:
Post a Comment