మధ్యాహ్న భోజనంలో రాజీపడం - సీఎం జగన్ ప్రకటన
బడి పిల్లలకు మధ్యాహ్న భోజన ప్రమాణాల్లో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో అత్యాధు నిక కేంద్రీకృత వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముందుగా కొద్దిసేపు ప్రాంగణమంతా కలియ తిరిగారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన వంటశాల గదులను పరిశీలించారు. తాడేపల్లి నుండి రోడ్డు మార్గాన ఆత్మకూరు చేరుకున్న సీఎం జగన్ కు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. జగనన్న గోరు ముద్దలు పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం శుచి, శుభ్రతతో అత్యాధునిక వసతులు, ఉన్నత ప్రమాణాలతో అందించనున్నారు. వంట శాలను ప్రారంభించిన అనంతరం 30 మంది ఆత్మకూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థినులకు సీఎం జగన్ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలకు భోజన సర ఫరా నిమిత్తం ఏర్పాటుచేసిన వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం 15 వాహనాలతో కూడిన సముదాయం ఇన్సులేట్ చేసిన 3 ఆహార కంటైనర్లలో పాఠశాలలకు ఆహారాన్ని తరలిస్తుంది. కంటైనర్లలో 6 గంటలకు మించి ఉష్ణోగ్రత ఉంటుంది. దీనివల్ల ఆహారపదార్ధాలు తాజాగా విద్యార్థులకు అందించవచ్చని నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్షయ పాత్ర తయారుచేసిన కోవా, హల్వా, గోబి మంచూరియా, మసాల వడ, వెజ్ బిర్యానీ, టమోటో కర్రీ, రైతా రైస్, బ్రింజల్, పొటాటో కర్రీ, మాంగో దాల్, గోంగూర చెట్నీలను విద్యార్థినులకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వడ్డించారు. అనంతరం ఇస్కాన్ ఆధ్వర్యంలో కొలనుకొండ గ్రామంలో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన శ్రీ వెంక టేశ్వరస్వామి, రాధాకృష్ణ, కళాక్షేత్రం, యోగా కేంద్రాలకు భూమిపూజ నిర్వహిం చారు. కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇస్కాన్ బెంగుళూరు బృందావన చంద్రోదయ మందిర్ చైర్మన్ మధు పండిట్ దాస్, హరేకృష్ణ మూమెంట్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు గౌర చంద్రదాస్ తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment