బిల్లులకు తలుపులు బంద్! - రూ.వేల కోట్లు వచ్చే అవకాశం లేదా...?
● సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ కాని వైనం
● సాంకేతిక సమస్యలని సమాధానాలు
● ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు చాలాముందే నిలుపుదల
ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల ఉత్తర్వులు విడుదలవుతున్నా బిల్లులు సమర్పించేందుకు తలుపులు మూసుకుపోయాయి. అనేక ప్రభుత్వ విభాగాలు సీఎఫ్ఎంఎస్లో బిల్లులు సమర్పించేందుకు ప్రయత్నిస్తున్నా ఆ సైటు తెరుచుకోవడం లేదు. కొద్ది రోజులుగా అది ‘ఎర్రర్’ చూపిస్తోందని బిల్లుల కోసం ఎదురు చూసేవారు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్దిరోజుల ముందు ఖజానాలో బిల్లులు చెల్లించకుండా ఆపుతారు. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా ముందుగానే బిల్లులకు తలుపులు మూసుకుపోయాయి.
ఒకవైపు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీచేస్తున్నారు. బడ్జెట్ విడుదల చేస్తే తప్ప ఆయా హెడ్ల కింద నిధులు ఉండనందున వాటి బిల్లులు సమర్పించేందుకు ఆస్కారం ఉండదు. అనేక ప్రభుత్వశాఖలు తమ శాఖల పరిధిలో చేసిన పనులకు, సరఫరా చేసిన సరకులకు బిల్లులు సమర్పించేందుకు బడ్జెట్ విడుదల ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తుంటాయి. చివరి త్రైమాసికంలో అదనపు నిధులనూ ఆర్థికశాఖ మంజూరు చేస్తుంది. వాటికీ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీచేస్తారు. ఆ తర్వాతే సీఎఫ్ఎంఎస్లో బిల్లులు సమర్పించాలి. అప్పుడే వాటి చెల్లింపులకు ప్రాసెస్ జరుగుతుంది. అలాంటిది బిల్లులు తీసుకోవడానికి, చెల్లించడానికి వీల్లేని పరిస్థితులు ఉండటంతో సాంకేతికంగా బిల్లులకు తలుపులు మూసేశారన్న విమర్శలు వస్తున్నాయి. బిల్లు సమర్పించేందుకు ఆ సైట్లోకి వెళ్లి ప్రయత్నిస్తే వీలు పడటంలేదు. ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే అంతా సవ్యంగానే ఉందని, సమస్య ఏమీ లేదన్న సమాధానం వస్తోంది. దీంతో అందరూ ఉసూరుమంటున్నారు.
కేంద్ర పథకాల నిధులూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఆ పథకం కింద రాష్ట్ర వాటా నిధులు కూడా కలిపి బిల్లులు చెల్లించాలి. అదీ కాక ఈ ఏడాది బడ్జెట్ను దాదాపు రూ.2.30 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించారు. అందులో చివరి త్రైమాసికంలో దాదాపు రూ.50వేల కోట్లకు పైగానే ఖర్చు చేయాలి. ఇందులో జీతాలు, ఇతరాలు తీసేసినా, అదనపు బడ్జెట్ కేటాయింపులు కలిపినా రూ.వేల కోట్లలోనే చివరి త్రైమాసికం బిల్లులు చెల్లించాలని చెబుతున్నారు.
మరోవైపు గత రెండేళ్లుగా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో క్లియర్ కాని బిల్లుల మొత్తాలు చాలా ఉన్నాయి. ఆ పెండింగు బిల్లులను తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోకి మార్చరు. దీంతో అప్పటికే బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చినా బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాటి ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో మళ్లీ విశ్వ ప్రయత్నాలు చేసి పాత బిల్లులకు బడ్జెట్ మంజూరు చేయించుకుని మళ్లీ విడుదల ఉత్తర్వులు తెచ్చుకోవాలి. ఇలా శ్రమపడి ఉత్తర్వులు తెచ్చుకున్నవారు ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ తలుపులు మూసేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉన్నతాధికారులు అనుమతితోనే కొన్ని బిల్లులు సమర్పించే వీలు కల్పిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
0 Post a Comment:
Post a Comment