ఉద్యోగుల నమ్మకాన్ని తాకట్టు పెట్టారు
ప్రభుత్వంతో జేఏసీ నేతల చీకటి ఒప్పందాలు
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం
ఉద్యోగుల నమ్మకాన్ని జేఏసీ నేతలు తాకట్టు పెట్టారని ఏపీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగుల సంఘం మండిపడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో దగాకోరు, చీకటి ఒప్పందాలు జరిగాయని ఆరోపించింది. ఆదివారం విజయవాడలో ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసీ నేత బాలకాశి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. సలహాదారులకు లక్షల రూపాయల జీతం ఇవ్వటానికి లేని ఆర్థిక ఇబ్బందులు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచటానికి వచ్చాయా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు తమకు న్యాయం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఎంత వరకు న్యాయం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
సమగ్ర శిక్షా అభియాన్ పార్ట్‌టైమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ఎన్ దేవేంద్ర మాట్లాడుతూ.. ఏమీ సాధించకుండానే స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరోసారి మోసం చేశారని ఏపీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫ్రుల్లా ఆరోపించారు.
0 Post a Comment:
Post a Comment