విరమణ తర్వాతే ఐఆర్! ‘రూ.6 వేల కోట్ల భారం’ వాయిదా!
ఉద్యోగుల నుంచి ఐఆర్ రికవరీ ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. ఆ కారణం వల్ల దాదాపు రూ.6,000 కోట్లు డీఏ బకాయిల రూపంలో చెల్లించాల్సి వస్తుందని, ఇది అదనపు భారమేనని చెబుతోంది. అయితే, ఆ రూ.6 వేల కోట్లు ఇచ్చేది ఇప్పుడు కాదని, డీఏ బకాయిలన్నీ పదవీ విరమణ చేసిన తర్వాతేనని పెట్టిన మెలికపై ఉద్యోగులు నిట్టూర్పు విడుస్తున్నారు. పదవీ విరమణ వయసు ఇటీవలే 62 ఏళ్లకు పెంచారు. రానున్న రెండేళ్లలో ఎవరూ రిటైర్ అయ్యే అవకాశం లేదు. అంటే, దాదాపు ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలంలోగా రూ.6 వేల కోట్లు అందవన్న మాట! ఈ సమీకరణం అర్థం చేసుకున్న వారు విస్తుపోతున్నారు. మంత్రుల కమిటీ నిర్ణయాలపై జీవోలు వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఉద్యోగుల్లో ముసురుకొన్న సందేహాలివి.
* డీఏ బకాయిలు ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామని చెప్పినా వీటికి విధివిధానాలు తెలియదు. జనవరి 17న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బకాయిలు నాలుగు సమాన వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయాలి. మారిన పరిస్థితుల దృష్ట్యా జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదు.
* జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తే కనీసం 8శాతం వడ్డీ అయినా వచ్చేదని, అలా కాకుండా పదవీ విరమణ తర్వాత అంటే.. ఈ మొత్తం విలువ ఆనాటికి ఎంత అవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా 20 ఏళ్లకో, పాతికేళ్లకో పదవీ విరమణ చేసే వారూ ఉన్నారని, ఇప్పుడే అందాల్సిన రూ.50 వేలో.. రూ.60 వేలో సొమ్ము అప్పటికి ఏపాటి విలువ చేస్తుందన్నది వారి ప్రశ్న.
* సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేవు. మిగిలిన ఉద్యోగులకు జీపీఎఫ్‌కు జమ చేయాలని ఒకవేళ నిర్ణయించినా ఈ అవకాశం సీపీఎస్ ఉద్యోగులకు వర్తించదు.
* ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులపై పడే భారాన్ని సర్దుబాటు చేసేందుకు ఇచ్చేదే డీఏ. ఇప్పటి ధరల భారాన్ని తగ్గించాల్సిన కరవు భత్యం ఎప్పుడో పదవీ విరమణ తర్వాత ఇవ్వడమేంటన్నది మౌలిక ప్రశ్న.
ఇంకా రిక‘వర్రీ’యే!
మధ్యంతర భృతి 9 నెలల పాటు రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ శనివారం రాత్రి ప్రకటించింది. ఇంటి అద్దె భత్యానికి సంబంధించి తాజాగా ప్రకటించిన శ్లాబులు 2022 జనవరి నుంచి మాత్రమే అమలవుతాయని వెల్లడించారు. అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ 31 వరకు కొత్త జీవో 1లోని మార్చిన ఇంటి అద్దె భత్యం మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అంటే మోనిటరీ ప్రయోజనం లెక్కించిన 21 నెలల కాలానికి కనిష్ఠంగా 4శాతం, గరిష్ఠంగా 14శాతం మేర హెచ్‌ఆర్‌ఏ రికవరీ చేస్తున్నట్లేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మోనిటరీ ప్రయోజనం సమయంలో ఫిట్‌మెంట్ 23శాతంగా నిర్ణయించారు. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అక్కడా 4శాతం ఐఆర్ రూపంలో నష్టపోతున్నట్లు కొందరు ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలోనూ ఇదే సమస్య ఎదురు కానుంది. పాత విధానానికి, శనివారం నాటి మంత్రుల కమిటీ నిర్ణయానికి మధ్య 8శాతం పెన్షన్ వ్యత్యాసం ఉంది. ఆ మేరకు 21 నెలలు తాము 8శాతం చొప్పున రివకరీలో కోల్పోతున్నట్లే కదా అని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్య కార్డులపై ఆందోళన :
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులకు విలువ ఉందని, ఇతర రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మన రాష్ట్ర ఆరోగ్య కార్డులకు నగదు రహిత వైద్యం ఎక్కడా అందడం లేదని, ప్రధాన ఆస్పత్రుల్లో వాటిని అనుమతించడం లేదని చెబుతున్నారు. ఈ తరుణంలో అదనపు క్వాంటమ్ పెన్షన్ తగ్గించడం ఎంతవరకు సబబు అని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. తమ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అదనపు పరిమాణంలో పెన్షన్ మంజూరు చేస్తుందని గుర్తుచేస్తున్నారు.
0 Post a Comment:
Post a Comment