Thursday, 20 January 2022

దద్దరిల్లిన కలెక్టరేట్లు - ఫ్యాప్టో పిలుపుతో ఉధృతంగా PRC పోరు

 దద్దరిల్లిన కలెక్టరేట్లు - ఫ్యాప్టో పిలుపుతో ఉధృతంగా PRC పోరుభారీగా కదిలిన ఉపాధ్యాయులు

కలిసి వచ్చిన ఉద్యోగులు

నిర్బంధాలు బేఖాతరు

పలు జిల్లాలో ఉద్రిక్తత

ఉపాధ్యాయులు కదిలారు. కలెక్టరేట్ల ముందు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లోనూ వేలాదిమంది నిర్బంధాలను లెక్క చేయకుండా కదలివచ్చారు. ఫ్యాప్టో పిలుపు మేరకు గురువారం పిఆర్‌సి పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయలు, వారికి మద్దతుగా కలిసివచ్చిన ఉద్యోగులు ఉదయం నుండే అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లను ముట్టడించారు. దీంతో కలెక్టరేట్లు స్థంభించాయి. మెరుగైన పిఆర్‌సి కోసం, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేసిన నినాదాలతో కలెక్టరేట్లు దద్దరిల్లాయి. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనేక చోట్ల ఉపాధ్యాయ నేతలను మందస్తు అరెస్ట్‌లు చేశారు. ఇలా అదుపులోకి తీసుకును వారిచేత కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం లేదని కొన్ని జిల్లాల్లో బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయులకు ఫోన్లు చేయించి కార్యక్రమానికి రావద్దని చెప్పించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ కుట్రలను ఉపాధ్యాయులు తిప్పికొట్టారు. ఒక్క ఉదుటున ముట్టడికి తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్లకు చేరుకునే రోడ్లపై బారికేడ్లు పెట్టడం, అడ్డుకోవడం వంటి చర్యలకు పోలీసులకు దిగారు. వీటిని కూడా ఉపాధ్యాయులు తిప్పికొట్టి కలెక్టరేట్లకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్య అనేక ప్రాంతాల్లో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అనేక చోట్ల ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలువురు ఉపాధ్యాయులకు గాయాలైనాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో 60 నుండి 70 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారని అంచనా! దీంతో రానును రోజుల్లో ఈ పోరాటం మరింత తీవ్రం కానుందని భావిస్తునాురు. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి సచివాలయ ఉద్యోగులు, ఎపి జెఎసి, ఎన్‌జిఒ అసోసియేషన్‌, సిఐటియు తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.

తూర్పుగోదావరిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో కలెక్టరేట్‌ నుంచి జెడ్‌పి సెంటర్‌, బాలాజీపేట సెంటర్‌ వరకూ వీధులనీు కిక్కిరిసాయి. ఉదయం 8 గంటలకే జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేలాదిగా కాకినాడ కలెక్టరేట్‌ చేరుకున్నారు. ధర్నానుద్దేశించి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. తిరోగమన పిఆర్‌సిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హితవు పలికారు. ఎస్‌టియు రాష్ట్ర కోశాధికారి పి.సుబ్బరాజు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర వర్మ, సిపిఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి కుమార్‌, మాట్లాడారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మద్దతు తెలిపారు.

గుంటూరులో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. దూరప్రాంత ఉపాధ్యాయులు బుధవారం రాత్రికే గుంటూరుకు చేరుకున్నారు. పోలీసుల ఒత్తిళ్లను ఎదుర్కొని సుమారు ఐదువేల మంది ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు. నగరం నుంచి కలెక్టరేట్‌కు చేరుకునే మూడు ప్రధాన రహదారుల్లో ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి, ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు విడతల వారీగా ఉపాధ్యాయులు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సహా జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు సుమారు 500 మందినిఅదుపులోకి తీసుకుని, మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. సిఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. జోసఫ్‌ సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

నెల్లూరులో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్ల వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉపాధ్యాయులను నిర్బంధించారు. జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ఆర్‌టిసి, ప్రైవేట్‌ ట్రావెల్స్‌, కార్లను తనిఖీ చేశారు. మరోవైపు కలెక్టరేట్‌కు చేరుకున్న ఉపాధ్యాయులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోచుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్‌ను భారీ రోప్‌తో కట్టివేయడంతో ఉపాధ్యాయులు అక్కడే నిలుచొనిప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాంతం ఖాళీచేసి వెళ్లిపోవాలని, కోవిడ్‌ ప్రమాదం పొంచి ఉందనిపోలీసులు ఉపాధ్యాయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలపడంతో..అందరినీ లోనికి పంపాలని..లేనిపక్షంలో గాంధీబొమ్మ వరకు నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అనుమతివ్వడంతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు.

కర్నూలు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ముట్టడికి తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు రావడంతో పోలీసులు కలెక్టరేట్‌ గేట్లను మూసివేశారు. శాంతియుత వాతావరణంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడారు. అనైతికంగా ఫిట్‌మెంట్‌ను తగ్గించి హెచ్‌ఆర్‌ స్లాబుల్లో కోత విధించడం దుర్మారమైన చర్య అని వాపోయారు.

కడప జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు రోడ్డుకు అడ్డంగా భారీకేడ్లు, ముల్లకంచను ఏర్పాటు చేశారు. ఒకనొక దశలో పోలీసులకు ఉపాధ్యాయులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సృహతప్పి పడిపోయారు. ఫ్యాప్టో నాయకులు సుబ్రమణ్యం రాజు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారందరిని విడుదల చేశారు.లక్ష్మిరాజను బుధవారం రాత్రే హౌస్‌ అరెస్టు చేశారు.

ఉపాధ్యాయులను అరెస్టు చేస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కుప్పం ఉద్యోగులు తమిళనాడు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి పలువురి ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. అయితే ప్రవాహంలా తరలివస్తున్న ఉద్యోగులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. బారికేడ్లను తోసుకుంటూ ప్రధాన గేటు ముందుకుచొచ్చుకెళ్లారు. గేటు ఎక్కి నిరసన తెలుపుతున్న యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జివి. రమణను పోలీసులు కిందికి లాగేశారు. గేటు తగులుకొని గాయమవ్వడంతో ఆయన్ను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు ఎం.నాగార్జున, వెంకటేశంను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి ఆందోళనకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పిఆర్‌సిని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. ఫ్యాప్టో ఛైర్మన్‌ కె.వెంకటరమణ, సెక్రటరీ జనరల్‌ రామచంద్రయ్య పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్దఎత్తున జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉద్యోగులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.

ప్రకాశంలో వందలాది మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఉద్యోగులను లోనికి అనుమతించాలని ఒంగోలు డిఎస్‌పి యు.నాగరాజు కోరినా.. ఫ్యాప్టో నేతలు నిరసనను కొనసాగించారు. దీంతో ఫ్యాప్టో నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. ఫ్యాప్టో నేతలు పట్టు విడవకుండా ముట్టడిని కొనసాగించారు. సుమారు మూడు గంటల పాటు కలెక్టరేట్‌ ముట్టడించారు. అనంతరం చర్చి సెంటర్‌లో ఫ్యాప్టో నేతలు మానవహారం నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు ఏలూరు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్‌ ముట్టడి నేపథ్యంలో ముందుగానే మండలాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను, జిల్లాలోని ఎన్‌జిఒ సంఘం నాయకులు హరనాథ్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు ముందుగానే గృహనిర్బంధం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీనిసైతం గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా తప్పించుకుని కలెక్టరేట్‌ ముట్టడి ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఉపాధ్యాయులంతా పెద్దఎత్తున నినాదాలు చేసి ముందుకు కదిలేందుకు ప్రయత్నించగా జెడ్‌పి గెస్ట్‌ హౌస్‌ వద్ద బారికేడ్లు పెట్టి ఆడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. వేలాది మంది ఉపాధ్యాయులు ఒక్కసారిగా ముందుకు సాగడంతో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్దకు ఉపాధ్యాయులంతా చేరుకున్నారు. గేట్లను మూసివేసి వ్యానులను అడ్డుపెట్టడంతో ఉపాధ్యాయులంతా గేటుముందు బైఠాయించారు. పిఆర్‌సిపై విడుదల చేసిన జిఒలను రద్దు చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ హెచ్చరించారు.

విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. పార్వతీపురం, బబ్బిలి నుంచి కలెక్టరేట్‌కు వస్తున్న ఉపాధ్యాయులను రైల్వేస్టేషన్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఐఆర్‌ కంటే ఫిట్మెంట్‌ ఎక్కువ ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లు యథావిధిగా ఉంచాలని తదితర డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. 12.30గంటలకు బారికేడ్‌లను తీసుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ఉపాధ్యాయులు ప్రయతిుంచగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ర్యాలీగా ఎత్తు బ్రిడ్జి వరకు చేరుకొని అక్కడ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ మాట్లాడారు.

శ్రీకాకుళంలో కలెక్టరేట్‌ ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌ లోపలికి చొచ్చుకువెళ్లేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్‌ గేటు లోపల బైఠాయించారు. కలెక్టరేట్‌ లోపలికి ప్రవేశించిన వారిలో ఆరుగురిని అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎపి జెఎసి జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంతో పాటు పలువురు ఉపాధ్యాయులను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

విశాఖ జిల్లా నలుమూల నుంచి ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తప్పించుకొని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. విశాఖ ఆర్‌డిఒ కిశోర్‌కుఫ్యాప్టో ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గేట్‌ వద్ద బైఠాయిస్తున్న ఉపాధ్యాయులను రోప్‌తో పోలీసులు వెనక్కు నెట్టడంతో తోపులాట చోటు చేసుకుంది. ఉదయం 10 గంటలకుప్రారంభమైన ఉపాధ్యాయుల నిరసన మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్‌ ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఐడి కార్డు లేకుండా ఉద్యోగులను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. అడ్డంకులను దాటుకుని ఫ్యాప్టో కో ఛైర్మన్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కనకారావు, ప్యాప్టో స్టేట్‌ సెక్రటరీ జనరల్‌ శరత్‌చంద్రతో పాటు మరికొందరు ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌ తరలించారు. నేతల అరెస్టుతో మార్కెట్‌యార్డు నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరారు. పోలీసులు పెడన బైపాస్‌ రోడ్డుకు బారికేడ్డు అడ్డుగా పెట్టి మోహరించారు. బారీకేడ్లను తొలగించుకుని లక్ష్మీటాకీస్‌ సెంటర్‌కు చేరారు. ఈ సెంటర్‌లో భారీగా మొహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మచిలీపట్నం - పెడన రోడ్డుపై లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో ఉపాధ్యాయులు బైఠాయించారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top