ఆర్టీసి ఉద్యోగులకు అన్ని విధాల నష్టం
విలీనంతో ఆర్‌టిసి విస్తరణ ఆగిపోయినది. ప్రజలకు రవాణా సౌకర్యాలు కుదించుకుపోతున్నాయి. ఈ కాలంలో వ్యక్తిగత వాహనాలు పెరిగాయి. ఆర్టీసి ఉద్యోగుల కార్మికులు అనేక సౌకర్యాలు, హక్కులు ఒక్కొక్కటి కోల్పోతున్నారు. చట్టపరంగా ఉన్న మెడికల్ సౌకర్యం స్థానంలో ఇ.హెచ్.ఎస్.ను రుద్దారు. 94% గా ఉన్న డ్రైవర్, కండెక్టర్, మెకానికల్ కాటగిరీ ఉద్యోగులకు ఎమ్.టి.డబ్ల్యూ చట్టం మరియు ఫ్యాక్టరీల చట్టం ప్రకారం పనిగంటలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉద్యోగులను చేర్చుకున్నామనే పేరుతో ఈ చట్టాల ప్రకారం వర్తించే సౌకర్యాలను ట్రేడ్ యూనియన్ హక్కులను వర్తింప చేయడం లేదు. సంస్థలో డిపో, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చర్చలు ద్వారా, ట్రేడ్ యూనియన్ ద్వారా పరిష్కరించుకొనే వెసులుబాటుకు స్వస్థి చెప్పారు. అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకు పోతున్నాయి. పండుగ అడ్వాన్సు వంటి అంశాలను కూడా ప్రభుత్వానికి వ్రాసామనే పేరుతో చెల్లించడం లేదు. విలీనం కాకముందు సకాలంలో వచ్చే డి.ఎలను నిలిపివేసారు. 5 డి.ఎ.లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్ స్కీమ్ వంటి ప్రయోజనకరమైన స్కీములను రద్దు చేసారు. విలీనంతో సంస్థలో ఉన్న ఒక్కో సౌకర్యాన్ని నిలిపివేసారు. ఖాళీ ఉన్న 10వేల పోస్టులను భర్తీ చేయకపోవడం వలన మిగిలిన ఉద్యోగులపై పనిభారం పెరిగినది. డ్రైవర్ల పోస్టులలో కూడా ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ఈ కాలంలో సంస్థలో అకాల మరణాలు పెరిగాయి. 2021 ఆగష్టు నుండి 2021 డిశంబరు వరకు152 మంది ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోయారు. 14 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారు. ఈ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. సర్వీసులో చనిపోయిన వారికి ఇచ్చే ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియమ్‌లు అన్నీ ఉద్యోగుల వేతనాల నుండే రికవరీ చేస్తున్నారు. ఈ కాలంలో ఉద్యోగులకు వివిధ రకాల రికవరీలు పెరిగాయి. విలీనంతో ఎంతో నష్టపోయామని ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది.
ఆర్టీసి ఉద్యోగులకు పి.ఆర్.సి. వర్తింపచేసే విషయంలో చీప్ సెక్రటరీ కమిటీ రిపోర్టులో స్పష్టత లేదు. 1.6% ఫిట్‌మెంట్‌ను మాత్రమే ఆర్టీసి ఉద్యోగులకు ప్రకటించారు. విలీనంతో ప్రభుత్వ ఫించను వస్తుందని ఆశించిన ఆర్టీసి ఉద్యోగులకు సి.పి.ఎస్.ను లేదా పి.ఎఫ్. ఫించనును ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇప్పటికి కూడా ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. 11వ పి.ఆర్.సి.కోసం నియమించిన అశుతోష్ కమిటీ ఆర్టీసి ఉద్యోగ సంఘాలతో ప్రత్యేకంగా చర్చించింది. 11వ పి.ఆర్.సి కోసం చర్చల సందర్భంగా అశుతోష్ మిశ్రా కమీషన్‌తో చర్చలు జరిపి స్టాఫ్ Ê వర్కర్స్ ఫెడరేషన్ నిర్ధిష్ట ప్రతిపాదనలు ఇచ్చింది.తమ పి.ఆర్.సి.రిపోర్టులో ఆర్టీసి ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్నే వ్రాసారు. దీనిని బయట పెట్టకుండా సి.ఎస్.కమిటీ రిపోర్టు పేరుతో ఆర్టీసి ఉద్యోగులను విస్మరించారు. పి.ఆర్.సి కమీషన్ రిపోర్టును ప్రక్కన పెట్టి సి.యస్. కమిటీ రిపోర్టును ముందుకు తేవడం ఈ ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చర్యల్లో భాగమే. అసుతోష్ మిశ్రా నివేదికను ఇప్పటికైనా విడుదల చేయాలి.
2019 ఫిబ్రవరి5న ఆర్టీసి జె.ఎ.సి.ఆధ్వర్యంలో 25% తాత్కాలిక ఒప్పందంతో ఎగ్రిమెంటు చేసుకొని అమలు చేయించుకున్నాము. అదే ఒప్పందంలో ఇది 2017 ఆర్.పి.యస్. తాత్కాలిక ఒప్పందం అని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకు మించి ఫిట్‌మెంట్ వచ్చినచో దాన్ని 01.04.2017 నుండి అమలు చేసి బకాయిలతో సహా చెల్లించాలని ఒప్పందం జరిగినది. నాటి ఒప్పందంలో స్టాఫ్ Ê వర్కర్స్ ఫెడరేషన్ కూడా సంతకం చేసింది. పి.టి.డి. ఉద్యోగులకు 2021 ఏప్రియల్ నుండి న్యాయంగా రావలసిన వేతన ఒప్పందం విలీనంతో ఆగిపోయినది. ఈ నష్టాన్ని కూడా పి.టి.డి. ఉద్యోగులకు సర్దుబాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పిఆర్‌సి ఫిట్‌మెంట్ మొత్తాన్ని వర్తింపచేస్తూ స్కేల్స్ మ్యాచింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యంతో పి.టి.డి.ఉద్యోగుల కరువు భత్యాన్ని కలపడంతో పి.టి.డి ఉద్యోగులు తీవ్ర నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని ఫిట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలి.
నేడు 23% మాత్రమే ఫిట్‌మెంట్ ఇవ్వడంతో పి.టి.డి.ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. పి.టి.డి. ఉద్యోగుల వేతన స్కేళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లతో మెర్జ్ చేస్తామని ప్రభుత్వ సెక్రటరీల కమిటీ పేర్కొన్నది. పి.టి.డి ఉద్యోగులు 2021 ఏప్రియల్ నుండి రావలసిన వేతన ఒప్పందం (ఆర్.పి.యస్-2021)ను కూడా వర్తింప చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతు న్నారు. విద్యుత్ ఉద్యోగులకు 2022 ఏప్రిల్ నుండి వర్తించే వేతనఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఒక వేతన ఒప్పందం కోల్పోవడమంటే తీవ్ర ఆర్ధిక నష్టం. కోలుకోలేని దెబ్బ, విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులకు తమకు మధ్య ఉన్న జీతాల వ్యత్యాసము తగ్గుతుందని ఆశతో ఎదరు చూసిన కార్మికుల, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లటమే. అందువలన 2021 ఏప్రియల్‌కి బకాయిగా ఉన్న వేతన ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇస్తున్న / ఇవ్వబోతున్న ఫిట్‌మెంటును పి.టి.డి.ఉద్యోగులకు ఇప్పుడున్న స్కేళ్ళకు వర్తింపచేయడమే పరిష్కారం. 2021 ఆగస్టు 16న ఆర్టీసి (పి.టి.డి) లోని వివిధ అసోసియేషన్‌లతో జరిపిన చర్చల సందర్భంగా ఇప్పటికే ఆర్.టి.సి.ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు తేడాగా ఉన్న 19% ఫిట్‌మెంటును భర్తీ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం తరపున ప్రకటించారు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని ఆర్టీసి (పి.టి.డి) ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతున్నారు. ఆర్టీసిలో పెరుగుతున్న అకాల మరణాలు, ప్రతికూల వాతావరణంలో పనిచేయవలసిన పని పరిస్థితులు, ప్రమాదాలు, మిగిలిన ఉద్యోగుల కంటే ఎక్కువ పనిగంటలు, ఉత్పాదకత వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకుల, ప్రజారవాణా రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు ఉండాలి. వీటన్నింటి దృష్ట్యా 2021 ఏప్రియల్ నుండి రావలసిన వేతన ఒప్పందమును పరిగణలోనికి తీసుకోవాలి. నష్టపోతున్న డి.ఏ ను ఫిట్‌మెంట్‌గా లెక్కించి స్కేల్ నిర్ణయించాలి.
ప్రభుత్వము, ఆర్టీసి యాజమాన్యము తక్షణమే ఆర్టీసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ సమస్యలను పరిష్కరించాలి. 11వ పి.ఆర్.సి. ఫిట్‌మెంట్ మొత్తాన్ని పి.టి.డి. ఉద్యోగులకు వర్తింపచేయాలి. 19 శాతం ఉన్న వ్యత్యాసాన్ని సర్ధుబాటు చేయాలి. ఇలా చేసిన తరువాతనే ప్రభుత్వ ఉద్యోగుల స్కేళ్ళతో మ్యాచింగ్ చేయాలి. హెచ్.ఆర్.ఎ స్లాబ్‌లను యధాతథంగా కొనసాగించాలి. సిసిఏ రద్దును ఆపాలి. 01.04.21 వేతన ఒప్పందం పూర్తి చేసాకే పి.టి.డి ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యంతో కలపాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సంక్షేమ అంశాలను పి.టి.డి.ఉద్యోగులకు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఆర్.పి.యస్.2017 బకాయిలు మొత్తం చెల్లించాలి. సి.ఎఫ్.ఎమ్.ఎస్.లో ఉన్న ఇ.ఎల్.ఎన్‌క్యాష్‌మెంటును వెంటనే చెల్లించాలి. సి.పి.ఎస్.ను రద్దు చేయాలి. ప్రభుత్వ పెన్షన్‌ను పి.టి.డి ఉద్యోగులకు వర్తింప చేయాలి. ఆర్టీసిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పి.ఆర్.సి.ని అమలు చేయాలి. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. సర్వీసులు రెగ్యులర్ చేయాలి.
- వ్యాసకర్త ఎ.పి.యస్.ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి
సి.హెచ్.సుందరయ్య
0 Post a Comment:
Post a Comment