నేటి నుంచే పోరుబాట - ‘పీఆర్సీ’ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం - జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ భేటీలు రేపు సీఎ్‌సకు సమ్మె నోటీసు అందజేత
పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పడుతున్నాయి. ఉద్యమ కార్యాచరణ ఆదివారం ప్రారంభం కానుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నాయి. నాలుగు జేఏసీలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణలో మొదటగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వరంలో అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించిన విధానం, ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాడాల్సిన తీరు, ఉద్యోగులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పి కొట్టాలనే అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు. సోమవారం సీఎ్‌సకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ నెల 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, సచివాలయంలోనూ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు కలిసి అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఫిబ్రవరి 5వ తేదీన అన్ని శాఖల ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లనున్నారు. నూతన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీవోలను ప్రభుత్వం ఆమోదించింది. ఉద్యోగుల్లో ఇది మరింత ఆగ్రహాన్ని కలిగించింది
0 Post a Comment:
Post a Comment