Sunday, 23 January 2022

బడిలో వైరస్‌ : కొవిడ్‌ పరీక్షలనిర్వహణకు వినతి - శానిటైజర్లు, మాస్కులు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులు

 బడిలో వైరస్‌ : కొవిడ్‌ పరీక్షలనిర్వహణకు వినతి - శానిటైజర్లు, మాస్కులు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులుజిల్లాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏకంగా ఐదుగురు టీచర్లకు వచ్చింది. బొప్పూడి, గొట్టిపాడు, కారంపూడి, వినుకొండ పాఠశాలల్లోనూ దానిబారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరి నుంచి పిల్లలకు వ్యాపిస్తుందా? లేక పిల్లల నుంచి టీచర్లకు వస్తుందా అనేది తెలియకుండా ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని ఉపాధ్యాయవర్గం, జిల్లా విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత మందిలో వైరస్‌ లక్షణాలు బయటపడినా పాఠశాలల్లో ఎక్కడా కొవిడ్‌ పరీక్షలు చేయడం లేదు. ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర అనుమానిత లక్షణాలు ఉన్నాయో వారికే పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైరస్‌ నిర్ధారణ అవుతోందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయిందో కనీసం అక్కడైనా అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయవర్గం కోరుతోంది. ప్రభుత్వ ఆసుప్రతులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలకు చాలా జాప్యం జరుగుతోంది. అక్కడ రెండు, మూడు గంటలే సిబ్బంది అందుబాటులో ఉండడం, మరికొన్ని చోట్ల కిట్ల కొరతతో పరీక్షలు చేయడం లేదు. ఉదయం ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట చొప్పునే పరీక్షలు చేస్తున్నారు. ఆ సమయం తర్వాత వస్తే అయిపోయిందని, ఇప్పుడు పరీక్ష చేసినా దాని నమూనాలు మరుసటిరోజే పంపుతామని చెప్పి నిరాకరిస్తున్నారు. మొత్తంగా వైరస్‌ పరీక్షల నిర్వహణే అస్తవ్యస్తంగా ఉంది. మరోవైపు ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు ప్రభుత్వం రూ.399 వసూలు చేయాలని ఆదేశించినా దాన్ని అమలు చేయడం లేదు. కొన్ని ల్యాబ్‌ల్లో రూ.600 నుంచి వెయ్యి దాకా వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకోవడంతో చాలా మంది సకాలంలో పరీక్షలు చేయించుకోవడం లేదు. ఇది కూడా వైరస్‌ బాగా వ్యాప్తి చెందడానికి కారణమవుతోందని అనుమానిస్తున్నారు. మొన్నీమధ్య పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, పరీక్ష భవన్‌లో జరిగిన పాఠశాలల మ్యాపింగ్‌ కార్యశాలకు హాజరైన పలువురు ఉపాధ్యాయులకు కరోనా వ్యాప్తి చెందింది. అంతకు మునుపు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి(ఎన్‌సీటీఈ) దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యాయుల సమావేశం విజయవాడలో నిర్వహించింది. ఆ వర్క్‌షాపునకు హాజరైన వారిలో చాలా మంది వైరస్‌ బారిన పడ్డారని దానికి హాజరైన జిల్లా ఉపాధ్యాయుడొకరు తెలిపారు.

కనీస ఏర్పాట్లు లేవు :

కరోనా ఇంత ఉద్ధృతంగా ఉంటే కనీసం తరగతి గదులను శానిటైజ్‌ చేసుకోవడానికి కనీసం శానిటైజర్‌ నిల్వలు జిల్లా విద్యాశాఖ నుంచి పంపలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి వచ్చేటప్పుడు మాస్కులు మరిచిపోతారు. అలాంటి వారికి స్కూల్‌ నుంచి ఇవ్వటానికి కూడా వాటిని సరఫరా చేయలేదని, ప్రతిదీ పాఠశాలనే సమకూర్చుకోవాలని మొక్కుబడిగా ఒక సర్క్యులర్‌ ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకున్నారని విమర్శిస్తున్నారు. పాఠశాల ఖాతాలో చాలా వరకు నిధుల లేమి ఉందని, ప్రతి పాఠశాలకు కొంతమేరకు శానిటైజర్లు, మాస్కులు సరఫరా చేయాలని అధికారులను కలిసి కోరినా ప్రయోజనం లేదని ఉపాధ్యాయులు వివరించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పిల్లల్లో వైరస్‌ లక్షణాలు రోజురోజుకు బాగా బయటపడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.

పోలీసులకు సైతం :

ఈసారి పోలీసు శాఖలోనూ వైరస్‌బారిన పడిన వారు ఎందరో ఉన్నారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌లో కలిపి ఇప్పటి వరకు పది మంది అధికారులు, 20 మంది కానిస్టేబుళ్లకు నిర్ధారణ అయింది. ఈ ప్రభావం కేసుల పురోగతిపై చూపుతోంది. ఆయా కేసుల్లో నేరస్థులను పట్టుకురావటానికి వీరు ప్రయాణాలు చేయలేని పరిస్థితి. మొత్తంగా కేసులు పెరుగుతుండటంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిరంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో చేసేలా ఏర్పాట్లు చేయాలని పోలీసువర్గాలు కోరుతున్నాయి. నిత్యం ప్రజల రద్దీ బాగా ఉండే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనూ చాలా మంది వైరస్‌కు ప్రభావితమై ఇంటి వద్దే ఉంటున్నారు. ఇప్పటి వరకు జిల్లా మొత్తంమీద సబ్‌రిజిస్ట్రార్లు మొదలుకుని కిందిస్థాయి సిబ్బంది 15 మంది వరకు దాని బారిన పడ్డారు.®️

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top