కుడితిలో పడ్డ ఎలుకలా ఉద్యోగుల పరిస్థితి - సీఎంకి భయపడి సమర్థిస్తున్నారా? ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? : : ఉద్యోగ సంఘాల నేతలకు అయ్యన్న ప్రశ్న
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని మాజీ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో గురువారం విలేకరులకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే... మన రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల ఆర్థిక లోటు వున్నప్పటికీ చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సంగతి ఉద్యోగులందరికీ తెలుసునన్నారు. రెండు పాత డీఏ బకాయిలతో కలుపుకొని ఐదేళ్లలో మొత్తం 10 డీఏలు ఇచ్చారన్నారు. జగనన్న స్మార్ట్ సిటీలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, గజానికి రూ.17,500 చెల్లించాల్సి ఉంటుందని ప్రస్తుత ముఖ్యమంత్రి చెబుతున్నారనీ, చంద్రబాబు హయాంలో గజం రూ.4 వేలకే ఇవ్వడానికి జీవో ఇచ్చిన సంగతి వెంకట్రామిరెడ్డి మర్చిపోయారా? అని అయ్యన్న ప్రశ్నించారు.
‘‘ఉద్యోగులకు జగన్‌రెడ్డి ఏ విధంగా ఉపకారం చేశారని సంతోషపడుతున్నారు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చినందుకా? లేదా మూడు డీఏలు ఇచ్చి 8 డీఏలు ఇవ్వనందుకా? బొప్పరాజు సమాధానం చెప్పాలి. పదవీ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం పెద్ద మోసం. ఈ రెండేళ్లలో 40 వేల మంది రిటైర్ కానున్నారు. వారికి రూ.20 వేల కోట్లు వరకూ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చే పరిస్థితి లేకే పదవీ కాలం పెంచారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో ఇన్ని లోపాలు వుంటే భయపడి సమర్థిస్తున్నారా? లేదా ప్రత్యేకమైన ఇంట్రస్ట్ ఏమైనా ఉందా?’’ అని అయ్యన్న, ఉద్యోగ సంఘం నేతలను ప్రశ్నించారు.
0 Post a Comment:
Post a Comment