విద్యార్థి నిరంతర మదింపుతో క్రెడిట్లు _ ఉన్నత విద్య పరీక్షల్లో మార్పులు : ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వెల్లడి
ఉన్నత విద్య పరీక్షల్లో సంస్కరణలు తీసుకురాబోతున్నామని, విద్యార్థి నిరంతర మదింపు విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. సెమిస్టర్ పరీక్షలతోపాటు విద్యార్థి తరగతి గది మదింపునకు క్రెడిట్లు ఇవ్వనున్నామని వెల్లడించారు. దీనిపై అధ్యయానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నాం. ఆయా జిల్లాల్లోని పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తారు. విద్యా సంస్థల్లోని మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నాం. మూడేళ్లలో అన్ని విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. కళాశాలల్లో ఏడాది పొడవునా తనిఖీలు నిర్వహించేందుకు స్వతంత్ర వ్యవస్థను తీసుకొస్తున్నాం. కరోనాతో విద్యా సంస్థలు మూతపడితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు 150కిపైగా ఆడియో, వీడియో పాఠాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? ఏం చదువుకున్నారు? ఎందుకు చదువును మధ్యలో నిలిపివేశారనే అంశాలపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం’ అని వెల్లడించారు. ‘రాష్ట్రంలోని ఐఐటీ, నిట్‌లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలతో కలిపి ప్రణాళిక మండలిని ఏర్పాటు చేశాం. పరిశోధనలు, సృజనాత్మక ఆలోచనలపై కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు కలిసి పని చేస్తాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల పరిశోధనల్లో నాణ్యత తీసుకొచ్చేందుకు ప్రత్యేక పరిశోధన మండలిని ఏర్పాటు చేశాం. ప్రతి విద్యార్థి రెండు నెలలు సొసైటీ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్లు రామమోహన్‌రావు, లక్ష్మమ్మ, కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్, పరిశోధన మండలి సంచాలకురాలు అపర్ణ ఉన్నత విద్యామండలి వార్షిక నివేదికను విడుదల చేశారు.
0 Post a Comment:
Post a Comment