ఉధృతంగా ఉద్యమం - రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
మంత్రుల కమిటీకి నిరసన లేఖ ఇచ్చిన పోరాట కమిటీ
ఇది ఆత్మగౌరవ పోరాటం : విజయవాడ ధర్నాలో నేతలు
27న మరోసారి చర్చలు
పిఆర్సి పోరు ఉధృతంగా సాగుతోంది. పిఆర్సి పోరాట కమిటీ పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాల్లోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ధర్నాలు, ప్రదర్శనలతో కలెక్టరేట్లు హోరెత్తాయి. విజయవాడలో జరిగిన ధర్నాలో ప్రసంగించిన నాయకులు 'ఇది ఆత్మగౌరవ పోరాటం.. తాయిలాలతో కొనలేరు' అని ప్రకటించారు. అంతకుముందు మంగళవారం ఉదయమే మంత్రుల కమిటీ నుండి చర్చలకు ఆహ్వానం అందింది. దీంతో ఎన్జిఓ హోమ్‌లో నేతలు సమావేశమైనారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం పోరాట కమిటీ నాయకులు కె.వి.శివారెడ్డి, కె.రాజేష్, ఆస్కార్‌రావు, వై.వి.రావు, జోసఫ్సుధీర్, కె.ఎస్.ఎస్.ప్రసాదు, హృదయరాజు, అరవపాల్, వి.వి.మురళీకృష్ణ, ఎం.కృష్ణయ్య సచివాలయంలో మంత్రుల కమిటీని కలిసి నిరసన లేఖను అందించారు. ఏకపక్షంగా జారీచేసిన జిఓలను రదు చేయాలని లేదా అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో పాత జీతాలే ఇవ్వాలని కోరారు. అప్పుడే చర్చలకు వస్తామని చెప్పారు. అనంతరం మీడియాతోనూ, ధర్నా చౌక్‌లో జరిగిన ఉద్యోగ సంఘాల ధర్నాలోనూ పాల్గన్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ చర్చలకు రావడం లేదంటూ మంత్రుల కమిటీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి తాము తొమ్మిదిసార్లు చర్చలకు వెళ్లామని అన్నారు. తమ అభిప్రాయాలు తీసుకోకుండానే జిఓలు ఇచ్చేశారని, ఉద్యోగులకు తమపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోందని, సమ్మెదాకా వెళ్లకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మరో నేత బప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేననే విషయాన్ని గుర్తించాలన్నారు. తమపై పార్టీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చి 23 శాతం ఫిట్మెంట్ ఇస్తే తగ్గించడమా కాదా చెప్పాలన్నారు.. రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ సెక్రటేరియట్ ఉద్యోగులు బయట సంఘాలతో కలిసి పనిచేయలేదని, అలాంటిది ఇప్పుడు తొలిసారి కలిసి పనిచేస్తున్నామంటే ఉద్యోగుల అసంతృప్తి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. అలాగే ఫ్యాఫ్టో నాయకులు జోసఫ్ సుధీర్ మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సత్తా ఏమిటో ఫ్యాప్టో నిర్వహించిన ఆందోళనతో స్పష్టమైందన్నారు. యుటిఎఫ్ నాయకులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పిఆర్సి విషయంలో ప్రభుత్వం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అన్నారు.సభకు అధ్యక్షత వహించిన ఎన్జిఓ నాయకులు ఎ.వి.సాగర్ మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
ఫిట్‌మెంట్‌పై మార్పు ఉండదు : సజ్జల
ఫిట్మెంట్ విషయంలో ఎలాంటి మార్పూ ఉండదని, ఇతర అంశాలపై ఉద్యోగులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పోరాట కమిటీ నాయకులు కలిసిన అనంతరం మంత్రులు బత్స, పేర్నితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల అపోహలు తొలగించే ప్రయత్నం చేశామన్నారు. 27వ తేదీన ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలిచామని తెలిపారు. . సిఎం జగన్ ఉద్యోగులకు మేలు చేస్తున్నారని, అప్పటి వరకూ వారు అడగకుండానే అన్నీ చేశామని తెలిపారు.
కొత్త పిఆర్సి ప్రకారమే జీతాలు : ఆర్థికశాఖ మెమో
ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కొత్త పిఆర్సి ప్రకారమే జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం మరో మెమోను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పెన్షనర్లు, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, కన్సాలిడేటెడ్, అవుట్ సోర్సింగ్, మినిమం టైమ్ స్కేల్ (ఎంటిఎస్) తదితర ఉద్యోగులకు కొత్త పిఆర్సి ప్రకారమే జీతాలు, వేతనాలు చెల్లించాలని ఈ మెమోలో పేర్కొంది.
0 Post a Comment:
Post a Comment