Wednesday 26 January 2022

జీతం పడేనా...? కొందరికి ఇంకా పడని డిసెంబరు జీతాలు - జనవరి వేతనాలపై ఎన్నెన్నో అనుమానాలు

జీతం పడేనా...? కొందరికి ఇంకా పడని డిసెంబరు జీతాలు - జనవరి వేతనాలపై ఎన్నెన్నో అనుమానాలుబిల్లుల ప్రాసెస్‌ అంటూ సర్కారు ఉత్తుత్తి ఒత్తిడి

జీతం వేసేసినట్టేనని నిన్నటిదాకా డాంభికం

అప్పుల అంచనా తప్పడంతో కొత్త ఎత్తు

ఉద్యమంపై నెపంనెట్టి ఊరటకు యోచన

ఉద్యోగులకు 4,790 కోట్ల బకాయిలు

పాత జీతాలకే కట్టుబడిన ఉద్యమ డిమాండ్‌


ఒకటో తేదీ వస్తే టెన్షన్‌! ఉద్యోగులకు వేతనాలు వేయడానికి డబ్బులు కేంద్రం ఇస్తుందా...ఆర్బీఐ సర్దుతుందా అని ఒకటే ఆందోళన! డిసెంబరు వేతనాలు జనవరి చివరికి వస్తున్నా ఇంకా పూర్తిగా పడని పరిస్థితి. ఫిబ్రవరి కూడా వచ్చేస్తోంది. అయినా.. వేతనాలపై  నిన్నటివరకు ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. పోరులో ఉన్న ట్రెజరీ ఉద్యోగులు జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే సీఎ్‌ఫఎంఎస్‌ తానే చేతుల్లోకి తీసుకుని ఆ ప్రక్రియను పూర్తిచేసి పీఆర్సీ ప్రకారం కొత్తజీతాలు వేసేస్థాయిలో బింకం ప్రదర్శించింది. అయితే.. కేంద్రం నుంచి వస్తాయని అంచనావేసిన నిధులు ఇంకా చేతికి రాకపోవడం.. నాలుగు రోజుల్లో కొత్త నెల కూడా వస్తుండటంతో.. ప్రభుత్వం ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

‘‘వేతనాలు వేయడానికి మేం రెడీ. కానీ, పాత జీతాలంటూ ఉద్యోగ నేతలు, ప్రాసెస్‌ చేయకుండా ట్రెజరీ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు’’ అని నెపం ఉద్యమంపైకి నెట్టి.. తాత్కాలికంగా ఊరట పొందాలని ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి, ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం రూ.4,790కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి గట్టిగా డిమాండ్‌ చేయలేకపోతున్నారని ఉద్యోగ నేతలపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంది. మరోవైపు ఉద్యోగుల ఆర్థిక కష్టాలను మరింత పెంచేలా సర్కారు చురుగ్గా పావులు కదుపుతోంది. అందుకు ఉద్యోగుల ఉద్యమాన్ని వాడుకోవాలని చూడటం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. 

జీతాల ప్రక్రియ పేరిట డ్రామాలుజనవరికి పాత జీతాలు వేస్తేనే చర్చలకు వస్తామనేది ఉద్యోగ నేతల డిమాండ్లలో ఒకటి. చర్చలకు రావాలని పిలిచిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేతలు ఇదే విషయం స్పష్టం చేస్తూ లేఖ ఇచ్చి వచ్చారు. ఈ డిమాండ్ల విషయంలో ఉద్యోగులు సంతృప్తితోనే ఉన్నారు. అయితే, పాత బకాయిల విషయం ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ నేతలు ఎందుకు తీసుకెళ్లడం లేదని అడుగుతున్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఇంతవరకు వారికి ఉద్యోగ నేతలు ఇప్పించలేకపోయారు. పెండింగ్‌లో ఉన్న 4,790 కోట్లలో డిసెంబరు సప్లిమెంటరీ జీతాలు రూ.1800 కోట్లు, పెన్షన్లు రూ.140 కోట్లు, ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్‌, ఎపీజీఎల్‌ఐ అడ్వాన్సులు, కార్లు లోన్లు, ఇతర లోన్లకు సంబంధించిన అడ్వాన్సులు కలిపి రూ.1900కోట్లు, సరెండర్‌ లీవ్స్‌, ఈఎల్స్‌కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు రూ.650 కోట్లు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.300 కోట్లు, 2018 జూలై 1నాటికి పెండింగ్‌లో ఉన్న డీఏ ఎరియర్లు రూ. 300కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉంది. వేల కోట్లు పెండింగ్‌లో పెట్టుకుని జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేయాలంటూ ప్రభుత్వం ట్రెజరీ అధికారులపై ఒత్తిడి తేవడం పెద్దడ్రామా అని ఉద్యోగులు అంటున్నారు.  ఫిబ్రవరి 1న తమకు వేతనాలు అందకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టు చెప్పినా పడని కొవిడ్‌ వేతనాలు..మరో రెండు నెలలు అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. సాకు సమ్మెపైకి నెట్టి ఫిబ్రవరి, మార్చి జీతాలు వాయిదా వేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. ఆ జీతాల డబ్బులను ఏప్రిల్‌, మే నెలల్లో ప్రభుత్వం తన సొంత ఖర్చులకు వాడుకునేందుకే ఇదంతా చేస్తున్నదని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. వీరి భయాలు నిరాధారం అయితే కావు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్రా ఉద్యోగులు సమ్మె చేస్తే ఆ కాలాన్ని 37 రోజులుగా తీర్మానించి దాని తాలూకు వేతనాలివ్వడానికి ప్రభుత్వానికి ఆరు నెలలు పట్టింది. ఒకవేళ కోర్టుకు వెళ్లినా వాయిదా వేసిన వేతనాలను పొందే అవకాశం ఉండకపోవచ్చునని ఉద్యోగులు భావిస్తున్నారు. ఎందుకంటే కరోనా మొదటిదశ లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెలల పాటు ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ సగం జీతాలిచ్చింది. దీనిపై ఉద్యోగులు ఏపీ హైకోర్టుకు వెళ్తే వడ్డీతో సహా తిరిగివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఉద్యోగులకు వేతనాల చెల్లింపు మరింత ఆ లస్యం చేసేందుకు జగన్‌ సర్కార్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్థించి ఉద్యోగులకు వడ్డీతో సహా వేతనాలు చెల్లించాలని ఆదేశించింది, అయినప్పటికీ ఈ రోజుకీ ఉద్యోగులకు ఆ కరోనా లాక్‌డౌన్‌ తాలూకు బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top