Wednesday, 26 January 2022

ఫిట్‌మెంట్‌కు ఎప్పుడు అంగీకరించాం...?

 ఫిట్‌మెంట్‌కు ఎప్పుడు అంగీకరించాం...?
ప్రభుత్వం దగ్గర ఫిట్‌మెంట్‌కు తాము ఎక్కడా అంగీకరించలేదని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. తాము ఎక్కడన్నా ఫిట్‌మెంట్‌కు అంగీకరించినట్లు ఉంటే దాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. చీకటి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. విజయవాడలో మహాత్మాగాంధీరోడ్డు డీటీసీ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి సాధన సమితి రాష్ట్ర నేతలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించి, తమ న్యాయమైన కోర్కెలు తీర్చేలా దిశా నిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఎన్‌ఎంయూఏ సెంట్రల్‌ కమిటీ, విజయవాడలోని రెవెన్యూ సంఘ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నేతలు సమావేశమై, ఉద్యమ కార్యాచరణ అమలుపై చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై పీఆర్సీ సాధన సమితి నేతలకు ఎన్‌ఎంయూఏ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ నెల 30 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.

ఉద్యమ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయొచ్చు : బండి శ్రీనివాసరావు

‘ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఉద్యమ నేతల ఇళ్లపై దాడులు చేయొచ్చు. ఉద్యమం చేయకుండా మమ్మల్ని అరెస్టులు చేయొచ్చు. దేనికీ భయపడం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ సాధనే మా ధ్యేయం. ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పీఆర్సీ అంటే వేతనాలు పెరగాలి గానీ తగ్గకూడదని అధికారులకు తెలియదా? ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. ఇంకా ఆగితే మాకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉంది. ఇంత వరకు మేం ఆర్థిక మంత్రి బుగ్గన ముఖమే చూడలేదు. మా బాధను మంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీ ఉద్యోగుల్లో కండక్టర్లు, మెకానిక్‌లు వంటి వారి జీతాల ఖరారుపై అశుతోష్‌మిశ్రా నివేదికలో ఉన్నా దాన్ని బయటపెట్టడం లేదు’ అని సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులతోనే నాడు సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమైంది.. ఇప్పుడు ఈ సమ్మెనూ వారే విజయవంతం చేయాలని కోరారు. ‘ప్రభుత్వం మా మాటలు వినడం లేదు. అందువల్లే అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలి’ అని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు అన్నారు.

పాత జీతాలిస్తే రూ.10 వేల కోట్లు మిగులు : బొప్పరాజు : 

‘పాత జీతాలిస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగులుతాయి. పీఆర్సీ నివేదికను బయటపెడితే వాస్తవాలు బహిర్గతమవుతాయని ప్రభుత్వం భయపడుతోంది. జనవరి నెల జీతం ఇవ్వకూడదని.. జీతాలు రాకపోతే ఉద్యోగులే మాపై తిరగబడతారని భావిస్తోంది. మా ఉద్యమాన్ని అణిచివేసేందుకు జిల్లాల విభజన తీసుకొచ్చారని మేం అనుకోవడం లేదు. విభజన పనిని ఉద్యోగులు చేయగలిగినంత చేస్తారు. వారిపై ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లను కోరుతున్నాం. ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతోంది. వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ వంటి కీలక శాఖలను ఉద్యమంలోకి తీసుకురావాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. మీరు బ్రహ్మాస్త్రం వంటివారు. మిమ్మల్ని వాడితే పరిస్థితులు తిరగబడాల్సిందే. జీతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా? పెంచడానికా? మేం ఎక్కడన్నా ఫిట్‌మెంట్‌కు అంగీకరించినట్లు ఉంటే దాన్ని బయటపెట్టాలి’ అని వెల్లడించారు.

పీఆర్సీ ఉత్తర్వులపై పునరాలోచించాలి : 

‘పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మంత్రుల కమిటీని కోరాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల ప్రయోజనం దృష్ట్యా పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచించాలి’ అని ఆర్టీసీˆ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు వైవీరావు తెలిపారు. ‘పీటీడీ ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశాలు పీఆర్సీలో ఉన్నాయో చెప్పడం లేదు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో పాలుపంచుకొని, సమ్మెలో పాల్గొనేలా మా సంఘం సెంట్రల్‌ స్టీరింగ్‌ కమిటీ  తీర్మానం చేసింది. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తే ప్రజలు ఇబ్బందులు పడేందుకు ప్రభుత్వమే కారణమవుతుంది. ఒకటి, రెండు రోజుల్లో అన్ని ఆర్టీసీ సంఘాలు మాట్లాడుకొని కార్మికులంతా ఉద్యమంలో పాల్గొనేలా చూస్తాం’ అని ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు వెల్లడించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top