Wednesday, 26 January 2022

పి.ఆర్.సి. సాధన సమితి పోరాట కార్యక్రమం : ప్రభుత్వ వివరణ - సంఘాల సవరణ

పి.ఆర్.సి. సాధన సమితి పోరాట కార్యక్రమం : ప్రభుత్వ వివరణ - సంఘాల సవరణ


జీతభత్యాల్లో కోతను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను తిరస్కరించండి! 

పి.ఆర్.సి. సాధన సమితి కార్యక్రమాల్లో పాల్గొనండి!!పెరిగిన ధరలకు అనుగుణంగా 11వ పి.ఆర్.సి. సిఫార్సుల మేరకు జీతభత్యాలలో తగినంత పెంపుదల ఉంటుందని రాష్ట్రంలోని ఉద్యోగ - ఉపాధ్యాయ కార్మిక - పెన్షనర్లు ఎదురు చూస్తున్న తరుణంలో పెంపుదలకు బదులుగా జీతభత్యాలలో కోతలతోపాటు ప్రస్తుతం పొందుతున్న అనేక రాయితీలను తొలగిస్తూ 17.01.2022న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని యావత్ ఉద్యోగలోకం కపోద్రేకంతో ఆయా సంఘాల ఆధ్వర్యంలో విడివిడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

దీనికి పూర్వం రాష్ట్రంలో ఉన్న 4 జె.ఎ.సి.లు పి.ఆర్.సి. రిపోర్టును బయట పెట్టాలని, వేతనాలు సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని, ముఖ్యమంత్రి గారు లోగడ పాదయాత్రలో ఇచ్చిన హామీలైన సి.పి.యస్. రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్సోర్సింగ్ తదితర ఉద్యోగుల వేతనవృద్ధి మొదలగు డిమాండ్లతో విడిగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ దఫాలుగా చర్చలు జరిపింది. సమస్యలు పరిష్కరిస్తామని, సానుకూలంగా ఉన్నామని, స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనలు తాత్కాలికంగా వాయిదా వేశాము. 12 సార్లు చర్చలు జరిపినా చర్చల్లో పురోగతిలేదు. రాజ్యాంగబద్ధంగా నియమించబడిన శ్రీ అశుతోష్ మిశ్రా పి.ఆర్.సి. రిపోర్టు బయటపెట్టకుండా అస్తవ్యస్థంగా ఉద్యోగుల హక్కులను హరించే విధంగా అధికార్లు రూపొందించిన కమిటీ ఆధారంగా జీతభత్యాల్లో కోత విధిస్తూ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వమూ తీసుకోని తిరోగమన చర్యలు తీసుకున్నారు.

పొందుతున్న 27% మధ్యంతర భృతి కన్నా తగ్గించి 23% ఫిట్మెంటుగా ఇవ్వడం 12, 14.5, 20, 30 శాతాలుగా ఉన్న ఇంటి అద్దె శ్లాబులు 8, 16 శాతాలుగా ఖరారు చేసి భారీ కోత విధించడం, దశాబ్దాలుగా పొందుతున్న నగర పరిహార భత్యం తొలగించడం, 70, 75 సం.లకు అమలులో ఉన్న పెన్షన్ పెంపుదల (క్వాంటమ్ ఆఫ్ పెన్షన్)ను తొలగించడం, పి.ఆర్.సి. కాలగడువును 5 సం.లకు బదులుగా 10 సం.లకు పొడిగించడం మొ॥ మచ్చుకు కొన్ని. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతున్న కాలంలో, వేతనాల్లో పెంపుదల లేకపోయినా ఉన్నదాన్ని తగ్గించడం. ఇది తగ్గింపుగా కాకుండా పెంపుగా భావించాలని నమ్మబలకడం ఈ ప్రభుత్వపు విడ్డూరపు చర్య. ఉద్యోగ-ఉపాధ్యాయ- కార్మిక పెన్షనర్లు పోరాడి సాధించుకున్న హక్కులు హరించే చర్య. ఉద్యోగులు, పెన్షనర్లు మరణించిన సందర్భంలో అంత్యక్రియలకు ఇచ్చే పైకంలో కూడా కోత విధించి, ఉద్యోగులపట్ల తన కారుణ్యాన్ని, ఉదారత్వాన్ని బాహాటంగా చాటుకొన్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ.20 వేల నుండి మొదలు కావలసి ఉండగా రూ.14,500/- లు, రూ.15,000/-లు అని జి.ఓ.లో ప్రస్తావించడం అశాస్త్రీయం. పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ జి.ఓ. విడుదల తేదీ 17.01.2022 నుండి వర్తింపచేస్తామనడం మూడున్నర సంవత్సరాల నుండి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను నష్ట పరచడం గత చరిత్రలో ఎన్నడూలేదు. 01.04.200 నుండి ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిల నుండి ఇప్పటికే ఇచ్చిన వాటిని రికవరీ చేస్తామనడం ఉద్యోగులకు తీరని ఆశనిపాతం అయ్యింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ రాష్ట్రంలోని 4 జె.ఏ.సి.లు ఏకమై, జీతభత్యాల్లో కోత విధిస్తూ జారీ చేసిన జి.ఓ.ల రద్దు, పెరిగిన ధరలకు అనుగుణంగా న్యాయమైన పి.ఆర్.సి. సాధన కొరకు ఒకే వేదికగా ఏర్పడి కార్యక్రమాలను రూపొందించినది (అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్లను దిగ్బంధించారు. వారికి మద్దతుగా ఉద్యోగులు నిలిచారు) 23.01.2022 నుండి దశలవారీ ఆందోళనా కార్యక్రమాలు 07.01.2022 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. న్యాయమైన మా ఆందోళనను అర్ధంచేసుకుని, చర్చలకు పిలిచి పరిష్కరించాల్సిన పాలకులు, తద్విరుద్ధంగా, ఎదురుదాడి చర్యలకు పూనుకొన్నారు.

1. పి.ఆర్.సి. రిపోర్టు బయటపెట్టకపోవడం :

ఇప్పటి వరకు పి.ఆర్.సి. కమిషనర్స్ తమ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆ రిపోర్టును పబ్లిక్ | డొమైన్లో ఉంచడం, పాత్రికేయులకు మరియు సంఘాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును | బయట పెట్టకపోవడం తన అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం. 

2. మా ఈ ఆందోళనలు మాకోసం మాత్రమే కాదు - ప్రజలబిడ్డల కోసం, భవిష్యత్ తరాలకోసం :

ప్రస్తుత 11వ పి.ఆర్.సి. జీతభత్యాలు పెంపుదలగాకుండా తగ్గుదల చేయవచ్చని ప్రభుత్వం కొత్త బాష్యం చెబుతున్నది. ఇప్పటి వరకు మేము పొందుతున్న హక్కులు, రాయితీలు మాముందు తరం పోరాడి మాకు అందించినవే. త్యాగాలతో కూడిన ఈ ఫలితాలు భద్రపరచి భవిష్యత్ తరాలకు అందించడం మా బాధ్యత. ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగిన ఈ కాలంలో జీతభత్యాలు తగ్గించి విడుదల చేసిన ఉత్తర్వులు వ్యతిరేకించడం మా సామాజిక బాధ్యతలలో భాగం. ఈ అన్యాయాన్ని ఆమోదించి భవిష్యత్ తరాలముందు దోషులుగా నిలబడలేం.

3. అవాస్తవాలతో కూడిన ప్రకటనలు - రెచ్చగొట్టే రాతలు - విఫలయత్నాలే : 

ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక-పెన్షనర్లు తమ న్యాయమైన హక్కులకోసం ఏకతాటిమీదకు వచ్చి పోరాడిన ప్రతి సందర్భంలో 1986లో ఎన్.టి. రామారావు గారి ప్రభుత్వాలు గాని, అంతకు పూర్వం, ఆ తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా అవాస్తవాలతో కూడిన ప్రచారం ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉన్న అనుభవమే. నాటి ప్రభుత్వాలు ఎంత దుష్ప్రచారం చేసినా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు. అవన్నీ విఫల ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. ప్రజలకు వాస్తవాలు / వక్రీకరణలకు మధ్య ఉన్న అంతరం తెలుసు. ప్రజా సహకారం న్యాయం వైపే ఉంటుంది.

అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన 12 పేజీల పత్రం విడుదల చేశారు. వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు (ముఖ్యమైనవి)

1. కొత్త పి.ఆర్.సి.లో జీతాల కోత అవాస్తవం, 10 వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.

జవాబు: కొత్త జీతాలు మాకొద్దు - ఉన్న జీతాలు, భత్యాలు కొనసాగించండి అని లక్షలాది మంది కలెక్టరేట్ల నినదించారు. కొత్త పి.ఆర్.సి.లో జీతభత్యాల్లో విధించిన కోతలను ఏ ప్రజావేదిక మీదైనా ముందు వివరించగలం, వేదిక ఏర్పాటు గావించండి. అప్పటి వరకు అబద్దపు ప్రచారాలు ఆపండి. ఐ. ఆర్. తక్కువ ఇచ్చిన కారణంగా ఉద్యోగల జీతాల నుండి 4 శాతాన్ని ప్రభుత్వం రికవరీ చేస్తామనడంతో ఆ ఫిట్మెంట్  రికవరీ చేయబోయే మొత్తం 10 వేలకోట్ల కంటే ఇది అధికం కాదా?

2. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62కు పెంచాం, దేశంలో ఎక్కడా లేనివిధంగా...

జవాబు :  ఇది నిజం - 4వ తరగతి ఉద్యోగులు మాత్రమే కోరుకున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ-కార్మికులు దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నదీ నిజం. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలమీద నీళ్ళు చల్లడమే ఈ చర్య. మాకున్న సామాజిక బాధ్యతలో భాగంగా దీన్ని మేము ప్రభుత్వం మాకు అందించిన 'వరం'గా భావించలేం.

3. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ 10% స్థలాలు కేటాయించాం. 20% రిబేటుకే అందిస్తున్నాం. మీ సంక్షేమమే మా ధ్యేయం. 

జవాబు : స్థలాల కేటాయింపు, రిబేటు ఏ ఉద్యోగి కోరలేదు. ఇందులో సంక్షేమం కన్నా వ్యాపారమే ప్రధానంగా ఉందనే విషయం స్పష్టం. రిబేటు రూపంలో 10 లక్షల లబ్ది చేకూర్చుచున్నామని అన్నారు. స్థలం ఖరీదు 50 లక్షలా? సగటు ఉద్యోగి కొనగలడా? (ఇప్పటికే ఉన్న ఉత్తర్వులు (ఉద్యోగులు సొసైటీగా ఉండి అడిగితే సరసమైన ధరకు ఇండ్ల స్థలాలు కేటాయించే) ఏమైనట్లు)) ఇది సంక్షేమమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా?

4. గ్రాట్యుటీ 12 లక్షల నుండి 16 లక్షలకు పెంచాం.

జవాబు : ఇది సీలింగ్ పరిమితి పెంచాల్సింది 20 లక్షలకు - ప్రతి ఉద్యోగి సగటున 2 నుండి 4 లక్షలు సవరించిన వేతనాలలో పోగొట్టు కుంటున్నారు. అది కూడా జి.ఓ. విడుదల తేదీ 17.01.2022 నుండి వర్తింపచేస్తామనడం మూడున్నర సంవత్సరాల నుండి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను నష్ట పరచడం గత చరిత్రలో ఎన్నడూలేదని గమనించాలి.

5. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి జూన్ 30 లోగా నియామకాలు ? 

జవాబు : అడిగింది ప్రాణాలు కోల్పోయిన అందరికీ, మీరు మరణంలో కూడా వివక్ష చూపి కేవలం 'ఫ్రంట్ లైన్ వారియర్స్' కే అదీ గ్రామ/పట్టణ సచివాలయాల్లో. షరతులకు లోబడి కారుణ్య నియామకాల ఉత్తర్వులు దశాబ్దాల నుండి అమల్లో ఉన్నాయి. సంవత్సరాల నుండి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారు. సంపాదనా పరులు మరణించడం వలన కుటుంబాలు కకలావికలం అయినాయి. కారుణ్యం చూపండి, ఉత్తర్వులు వేగంగా అమలు జరపండి అనే డిమాండ్ ఈ విధంగా కుదించబడింది. 

6. విభజన సమస్యలు - కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది. 

జవాబు : విభజన సమస్యలున్న కాలంలో 2015లో 43% ఫిట్మెంట్ - పొందాం. ప్రస్తుతం విభజన సమస్యలన్నీ సర్దుకున్నాయి. కోవిడ్ కారణంగా కొంతకాలం ఆదాయం తగ్గింది. వాస్తవం. కనుకనే మే 2 సం.ల నుండి మా వంతుగా సహకారం అదిస్తున్నాం. ప్రస్తుతం ఆదాయం పెరిగిందని 'కాగ్' గణాంకాలే చెపుతున్నాయి. తాత్కాలికంగా పైకం సర్దుబాటు కాకపోతే బకాయిలను పి.ఎఫ్.లో కలపడమో! కొంత కాలానికి వాయిదా వేయడమో! జరిగేది. కాని ప్రస్తుతం జీతభత్యాలు తగ్గించి, ఐ. ఆర్. రూపంలో ఇచ్చినది కూడా ఇవ్వాల్సిన డి.ఏ.ల నుండి రికవరీ చేస్తున్నారు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న మాకు ఇది కాదా!

7. ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో కలిపాం.

జవాబు : వాస్తవం - కార్పొరేషన్ ఉద్యోగులు - ప్రభుత్వ ఉద్యోగులుగా నామకరణం పొందినా పరిస్థితి మాత్రం "పెనం మీద నుండి పొయ్యిలోపడినట్లు" అన్న సామెతను తలపిస్తుంది. ప్రభుత్వోద్యోగులు పొందుచున్న హక్కులు, రాయితీలు వారు పొందుచున్నారా? కార్పొరేషన్లో ఉన్న పరిస్థితి కన్నా ప్రస్తుతం వారి జీవితాలు ఏవిధంగా మెరుగుపడ్డాయో వివరించగలరా!

8. ప్రతిపక్ష నాయకుడు, వారి అనుకూల పత్రికలకు అమ్ముడుపోయారు. 

జవాబు: ఇది నిందా ప్రచారం. రాజకీయ పక్షాలో, మరొకరో! మమ్ములను ప్రభావితం చేయలేదు. ఆంధ్రనాట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికోద్యమాలకు సుసంపన్నమైన చరిత్ర ఉంది. ఆయా రంగాల్లో ఉన్న సమస్యలు, ఆయా వర్గాల పట్ల వారికున్న బాధ్యత ఈ పోరాట రూపాలకు నాంది పలికాయి. ప్రభుత్వాన్ని విశ్వసించాం. విశ్వాసాన్ని దెబ్బతీసేవిధంగా, జీతభత్యాల కోత ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవాలు గమనించండి. నిందా ప్రచారాలు ఆపండి. మా ఉద్యమంలో, పోరాట కార్యక్రమాలలో ఏ రాజకీయ పక్షాన్ని అనుమతించకూడదని, వ్యక్తిగత రాజకీయ విశ్వాసాలకు దూరంగా ఉం లని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగాలని మా కార్యచరణ కమిటీ చేసిన తీర్మానమే దీనికి ఉదాహరణ.

9. యూనియన్ నాయకులు ఉద్యోగులను పెడదోవ పట్టించారు.

జవాబు: జీతభత్యాల్లో కోత ఒకవైపు, మరోవైపు ధరాఘాతం ఉద్యోగుల్లో కడుపుమంటను రగిల్చింది,  ప్రభుత్వం నమ్మించి మోసపూరితంగా వ్యవహరించిందనే ఆవేదన. ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. 20.01.2022న కలెక్టరేట్ కార్యాలయాల దిగ్భందంలో నాయకత్వాన్ని ముందుగా అరెస్టులు చేసినా లక్షలాదిగా ఎవరికి వారుగా పోరాటంలోకి వచ్చారు. నాయకుల నుండి ఉద్యోగులను విడదీసే మీ ఎత్తుగడలను మేం అర్ధం చేసుకోగలం. ఉద్యోగులు సరైన దారిలోనే ఉన్నారు.

10. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు.

జవాబు: విమర్శే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ-కార్మిక-పెన్షనర్ల హక్కులను హరించే చర్యలను మీకు ఎత్తి చూపుతున్నాం, విమర్శిస్తున్నాం, సరిచేసుకోమని విన్నవిస్తున్నాం. ఇది మా బాధ్యత.

11. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా దూషించడం సరికాదు.

జవాబు: మేం ముఖ్యమంత్రి గారిపట్ల గౌరవభావం కలిగిఉన్నాం. వ్యక్తిగతంగా దూషించే కుసంస్కారులం కాము. వ్యవస్థీకృతంగా ప్రభుత్వం చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఆపాటి సంయమనం విచక్షణ మేం పాటిస్తున్నాం.

వేలాదిమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చినపుడు, ఆకతాయిలు, అల్లరిమూకలు ఉద్రేకపరచే మాటలు, తప్పుదారి పట్టించే నినాదాలిస్తారు. మన ఉద్యమాలను పక్కదారి పట్టించడం, మనలను అప్రతిష్టలపాలు చేయడం వారి లక్ష్యం. అందుకే తగు జాగ్రత్తలు వహించాలని క్రిందిస్థాయి బాధ్యులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటాము.

12. నాయకుల మాటలు విని ఆందోళనలు చేస్తే దెబ్బతినేది ఉద్యోగులే. 

జవాబు: ఇది ఒక బెదిరింపు ప్రక్కదారి పట్టించే బుజ్జగింపు. ప్రభుత్వం ఈ నెల 17న విడుదల చేసిన పి.ఆర్.సి. ఉత్తర్వులే వారిలో మంటలు రేపాయి. ఆ జి.ఓ. లు రద్దుచేసి, ఉన్న హక్కులను పునరుద్ధరించి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాల్లో తగు పెంపుదలనిస్తూ ఉత్తర్వులు జారీచేసినపుడే వారి ఆగ్రహ జ్వాలలు చల్లారగలవు. ప్రస్తుతం దెబ్బతినే వారు వీధుల్లోకి వచ్చారు. కొత్తగా దెబ్బతినేది ఏమీ ఇలాంటి దుష్ప్రచారాలు సత్ఫలితాలనివ్వవని మనవిచేస్తున్నాం. 

ఆందోళనా కార్యక్రమాలు ప్రారంభించిన ఈ దశలోనే అసత్యాలు ఎదురు దాడులు ఒకవైపు, నిర్భందాలు ఒకవైపు ప్రయోగిస్తున్నారు. ఉద్యోగ-ఉపాధ్యాయ-కార్మిక- పెన్షనర్లు ఈ రెండింటినీ సమర్ధ వంతంగా ఎదుర్కోవాలని, గత ప్రభుత్వాలూ ఇలాంటి విచ్ఛిన్నకర చర్యలకు దిగినపుడు మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలకు వాస్తవాలు వివరించి వారి మద్దతునూ పొందాం. ఆ అనుభవాల ఆధారంగా ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, పి.ఆర్.సి. సాధన సమితి పోరాటాలలో తమ సహాయ సహకారాలు అందించాలని, ప్రజలు - ప్రజాతంత్రవాదులను కోరుచున్నాము.


పోరాట కార్యక్రమం షెడ్యూలు :


23.01.2022 : జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు


25.01.2022: : జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు


26.01.2022: తాలూకా కేంద్రాలలో డా॥ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు మెమోరాండం సమర్పణ


26.01.2022 నుండి 30.01.2022 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఉ. 9-5 రిలే నిరాహార దీక్షలు


03.05.2022 నుండి 05.02.2022: “ఛలో విజయవాడ" 


సహాయ నిరాకరణ - అన్ని కార్యాలయాల్లో “యాప్స్ డౌన్”


07.02.2022 : నిరవధిక సమ్మె


- PRC సాధన సమితి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top