నూతన విద్యా విధానం గమ్యం ఏటో...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన విద్యా విధానం అమలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గమ్యం ఎటో తెలియని విద్యావిధానంలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా విద్యార్థులను ఉన్నతపాఠశాలల్లో విలీనం చేసిన అన్ని పాఠశాలలో సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బోధన చేసేందుకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించకపోవడం సమస్యగా మారింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్తగా ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3,4,5 తరగతుల విద్యార్థులు వచ్చి చేరడంతో సమస్య మరింత తీవ్రమైంది. జిల్లాలో 3173 ప్రభుత్వ పాఠశాలలుండగా.. వాటిలో 3.11లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులున్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్‌లు ఆరు వేల మంది ఉన్నారు. విజయవాడలోని నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత మరింత తీవ్రంగా వేధిస్తోంది. నగరంలో 105 పాఠశాలలుండగా.. 27వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రస్తుతం 700మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో 250మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు విద్యాశాఖ అంచనావేసింది. ఒకే ప్రాంతంలో ఉన్న పాఠశాలలను గుర్తించి అందులోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. తొలివిడత 195 స్కూల్స్‌ను సమీపంలోని 180 పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. అలా ఎంపిక చేసిన ఆయా ప్రాథమిక పాఠశాలలకు చెందిన 14,183మంది విద్యార్థులు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రాకపోవడంతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఉన్నవారిపై పనిభారం పెరగడంతోపాటు బోధనపైనా ప్రభావం చూపుతోంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో, దాదాపు 1,200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మరోవైపుప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరగడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా అదనపు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మొత్తం 3.11లక్షల మంది విద్యార్థుల్లో.. లక్షన్నర మంది వరకూ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు. తరగతి గదుల కొరత కూడా ప్రాథమిక పాఠశాలల్లోనే అధికంగా ఉంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో వంద నుంచి 150మందికి పైగా విద్యార్థులుంటే.. అక్కడ ఇద్దరుకి మించి ఉపాధ్యాయులు లేరు. వాళ్లే మొత్తం అన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకర(రేషనలైజేషన్) జరగకపోవడంతో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది ఉండగా.. మరికొన్నింటిలో చాలా తక్కువ ఉన్నారు. హేతుబద్ధీకరణ జరిగితే అసలు ఎంతమంది ఉపాధ్యాయుల కొరత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు. విలీన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై, ఉపాధ్యాయుల కొరత పై ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమే వాటిని పరిష్కరించాలి.
0 Post a Comment:
Post a Comment