పీఆర్సీపై బెడిసికొట్టిన జగన్ సర్కార్ ప్లాన్ - నేతలు ఒప్పుకున్నా ఉద్యోగులు రివర్స్ కిం కర్తవ్యం...?
ఏపీలో ఉద్యోగులు మళ్లీ పోరు బాట పట్టబోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై వారు సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. అన్నింటికీ మించి రాష్ట్రంలో తొలిసారిగా ఐఆర్ కంటే తక్కువ శాతం ప్రకటించిన పీఆర్సీ ఫిట్ మెంట్ పై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. అందుకు అంగీకరించిన ఉద్యోగ సంఘాల నేతలపై మండిపడుతున్నారు దీంతో వీరిని కూల్ చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది.
పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారం :
ఏపీలో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీని ప్రకటించే క్రమంలో తొలుత 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగి రెండేళ్లవుతున్నా ప్రభుత్వం పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు పోరు బాట పట్టారు.
దీంతో ప్రభుత్వం నియమించిన సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ను సిఫార్సు చేసింది. దీనిపై ఉద్యోగులు పెదవి విరిచారు. పలుదఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాక 23 శాతం ఫిట్ మెంట్ కు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. ఇచ్చిందే మహాప్రసాదం అన్నట్లుగా సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే ట్విస్ట్ ఎదురవుతోంది.
సంఘాలపై ఉద్యోగుల గుర్రు :
ఓ దశలో 45 శాతం, 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగ సంఘాలు చివరికు అందులో సగం ఫిట్ మెంట్ కూడా ఖరారు కాకపోయినా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇచ్చిన ప్రకటనలు ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచినా తమకు ఓట్లేసిన ఉద్యోగుల్ని మాత్రం సంతృప్తి పర్చలేకపోయాయి. దీంతో 23 శాతం ఫిట్ మెంట్ కు అంగీకరించి తమకు నష్టం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు సెగ తగులుతోంది. ఉద్యోగ సంఘాల నేతల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ తమ కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నారని గౌరవించిన నేతల నిర్వాకంపై వారు మండిపడుతున్నారు.
సచివాలయాల చిచ్చు :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జేఏసీలు ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపించిన ఉద్యోగ సంఘాల నేతలు.. చివరికి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కూడా చేయించలేకపోయారు. దీంతో సచివాలయాల ఉద్యోగుల్లో ఆగ్రహం మొదలైంది. దీంతో వారు ప్రభుత్వ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల తీరుకు నిరసనగా ఆందోళన బాట పట్టారు. తమ ప్రొబేషన్ ను జూలైలో ఇస్తామంటే ఒప్పుకోవడానికి ఉద్యోగ సంఘాల నేతలెవరంటూ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వారిని నిలదీసే పరిస్ధితి.
జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బలు :
ఉద్యోగులకు పెండింగ్ ఉన్న 71 సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాన్ని విజయవంతంగా విరమింపజేసిన ప్రభుత్వానికి నేతలు అండగా నిలిచినా, కింది స్దాయిలో మాత్రం సహకారం లభించడం లేదు. ఎందుకంటే ఉద్యోగులు ప్రాణప్రదంగా భావించే ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజీ పడే పరిస్ధితి కనిపించడం లేదు.
దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏకంగా ప్రభుత్వ వాట్సాప్ గ్రూప్ ల నుంచే తప్పుకున్నారు. వీరి ఆందోళనతో ఇప్పుడు ఇతర ఉద్యోగులు కూడా పీఆర్సీపై నిరసనలకు సిద్ధమవుతున్నారు
ప్రభుత్వం ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఉద్యోగులు మాత్రం పీఆర్సీ, ప్రొబేషన్ ఖరారు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో వీరి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
0 Post a Comment:
Post a Comment