Friday 21 January 2022

ఉద్యోగుల సమ్మె సైరన్‌ - ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి

ఉద్యోగుల సమ్మె సైరన్‌ - ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకినాలుగు ఐకాసలతో పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు

కార్యాచరణ ప్రకటించిన సమితి నేతలు

వేతన సవరణ (పీఆర్సీ)పై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ఏపీ ఐకాస, ఐకాస అమరాతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి వేదికపైకి వచ్చాయి. ఉద్యోగసంఘాలు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. మొదట ఉదయం ఎన్జీవో హోంలో ఐకాసలు సమావేశమై మధ్యాహ్నం వరకు సమ్మె, ఉద్యమ కార్యాచరణపై చర్చించాయి. మధ్యాహ్నం నుంచి నాలుగు ఐకాసలు కలిసి సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాయి. సమావేశం అనంతరం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని డీడీఓలపై ఒత్తిడి చేయొద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ఉత్తర్వులు ఆపాలని విన్నవించారు. సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సమయం కోరారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించడానికి 12 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వానిది మొండి వైఖరి : బండి

పీఆర్సీపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. ‘తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు ఐకాసలు కలిసి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటుచేసి, ఉద్యమించాల్సి వస్తోంది. సామాన్య ఉద్యోగి, ఉపాధ్యాయుల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నాం. రెండు రోజులుగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్యంలో జరిగిన ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం మారుతుందనుకున్నాం. కానీ, ప్రభుత్వం ముందుకు వెళ్లడంవల్లే ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికులనూ నిరసనలో భాగస్వాములు కావాలని కోరాం. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గలేదని ప్రభుత్వం అంటోంది. దీనిపై పునరాలోచించాలి. 3.5 లక్షల మంది ఉన్న పింఛనుదారులకు అదనపు పింఛను పీఆర్సీలో భాగమే అయినందున వారూ ఉద్యమానికి కలిసి రావాలి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మంత్రుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిసింది’ అన్నారు.

పార్టీలను అనుమతించం : బొప్పరాజు

ఉద్యమంలోకి రాజకీయ పార్టీలను అనుమతించకూడదని నిర్ణయించామని, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, కార్మిక సంఘ నాయకులనే ఉద్యమంలోకి తీసుకుంటామని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘పీఆర్సీపై ప్రకటన సమయంలో సీపీఎస్‌ రద్దుపై సీఎం కాలవ్యవధి ప్రకటించారు. దాని ప్రకారం చాలా సమయం పడుతుంది. దీనిపై ఇప్పటికే నివేదికలను తెప్పించుకున్నారు. మూడేళ్లుగా సీపీఎస్‌ రద్దు గురించి లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేలా పీఆర్సీ సాధనసమితి ద్వారా నాలుగు ఐకాసలు కలిసి పోరాడుతాయి. పీఆర్సీ ప్రకటన సమయంలో సీఎం పేర్కొన్న అంశాలు.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ వంటి అంశాలపై కార్యాచరణ ఉంటుంది’ అన్నారు.

గొంతెమ్మ కోర్కెలు కావు:  వెంకట్రామిరెడ్డి :

ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో జీతాలు తగ్గుతున్నాయి. ఆ నష్టాన్ని పూడ్చాలనే డిమాండు చేస్తున్నాం. జీతాలు తగ్గుతాయనే ఆందోళనతోనే ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వారి ప్రయోజనాలను కాపాడాలని అన్ని సంఘాల నాయకులు విభేదాలను పక్కనపెట్టి.. ఒకే డిమాండుతో పోరాడాలని నిర్ణయించాం. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను ఉద్యోగసంఘాలకు ఇవ్వాలి. అందులోని లోటుపాట్లను పరిశీలించి, మళ్లీ ఉద్యోగసంఘాలతో చర్చించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసి.. పరీక్షల్లో పాసైనవారికి ప్రొబేషన్‌ ఇవ్వాలి. పీఆర్సీ ప్రకారం వారికీ కొత్త పేస్కేలు అమలుచేయాలి. ఉద్యోగులు ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా చట్ట పరిమితులకు లోబడే ఆందోళనల్లో పాల్గొనాలి’ అని వెల్లడించారు.

వెనక్కి తీసుకోవాల్సిందే: సూర్యనారాయణ :

పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ‘పీఆర్సీ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. పీఆర్సీ, దానికి అనుబంధంగా ఉన్న అంశాలన్నింటిపై ఆందోళన కార్యక్రమాలను పీఆర్సీ సాధన సమితి రూపొందిస్తుంది. దీనికోసం అన్ని సంఘాల జేఏసీల నుంచి ముగ్గురి చొప్పున 12మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేశాం. పీఆర్సీ ఉత్తర్వుల అమలు నిలిపేసి జనవరికి పాతజీతాలే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం. సవరించిన జీతాలు చేయాలని ప్రభుత్వం డీడీఓలపై ఒత్తిడి చేస్తోంది. కార్యాచరణలో ఎక్కడా రాజకీయ పార్టీలను అనుమతించకూడదని నిర్ణయించాం’ అని వెల్లడించారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా...

🔹జనవరి 23: అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు  

🔹జనవరి 24: సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసు

🔹జనవరి 25: అన్ని జిల్లాకేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు. సచివాలయంలో ప్రత్యేకంగా నిరసన

🔹జనవరి 26: అంబేడ్కర్‌ విగ్రహానికి అన్నిచోట్లా వినతిపత్రాలు  

🔹జనవరి 27 నుంచి 30 వరకు: అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు

🔹ఫిబ్రవరి 3: చలో విజయవాడ

🔹ఫిబ్రవరి 5: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది సహాయ నిరాకరణ. అన్ని విభాగాల యాప్‌లలో సమాచారం అప్‌లోడ్‌ నిలిపివేత

🔹ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top