ప్రతి సబ్జెక్టుకూ టీచర్ - పెరిగిన విద్యార్థులకు సరిపడా వసతులు.పాఠశాలల్లో పరిశుభ్రతపై దృష్టిపెట్టండి : విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండే లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను మ్యాపింగ్ చేయాలన్నారు. నాడు-నేడు తర్వాత పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు వసతుల కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం ప్రకారం సిద్ధం చేసిన పాఠశాలల విలీనం మ్యాపింగ్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇతరత్రా అవసరాలను గుర్తించి నియమించాలన్నారు. నాడు-నేడుతో పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగిందని... ఆమేరకు తగిన మౌలిక వసతుల ఏర్పాటుపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయుల నియామకంపై చర్యలు తీసుకోవాలన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ మూడు అంశాలపై కార్యాచరణ నివేదికను ి తనకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించడంలో ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్దవంతంగా అమలుచేయాలన్నారు. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలన్నారు. ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ కార్యక్రమాల వివరాలు అధికారులు అందించారు. ఆంగ్ల పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలని సీఎం సూచించారు. గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలని, ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలన్నారు. ‘పాఠశాలల్లో వండే ఆహారం నాణ్యతగా ఉండాలి. మరుగుదొడ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంగన్‌వాడీలు, పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్ దృష్టిపెట్టాలి. విద్యార్థులను పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు’ అని సీఎం అధికారులకు నిర్దేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్య కమిషనర్ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment