నాడు - నేడు : : 1986 లో జరిగిన 53 రోజుల ఉద్యోగుల సమ్మె.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీయే. చంద్రబాబునాయుడు ప్రభుత్వం నియమించిన అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిషన్ చేసిన సిఫార్సులను జగన్ ప్రభుత్వం పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ముఖ్యమంత్రి పీఆర్సీని ప్రకటించడం జరిగింది.అయితే ఈ పీఆర్సీ కారణంగా జీతాలు పెరగడం అటుంచి తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. అయితే దీన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో లైట్ తీసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే చండశాసనుడైన ఎన్టీ రామారావుకే చెమటలు పట్టించిన ఘనులు ప్రభుత్వోద్యోగులు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాగే పీఆర్సీ విషయమై 1986 లో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై మూడు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. చివరకు ఎన్టీఆరే దిగిరావాల్సి వచ్చింది.
PRC : అప్పుడు ఏమి జరిగిందంటే...?
1986 జులైలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పటి పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అయితే మూడు అంశాలపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్త పీఆర్సీని ఆ ఏడాది జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలని, మినిమం బేసిక్ పేను 740 నుండి 750 రూపాయలు అంటే కేవలం పది రూపాయలు పెంచాలని, అప్పటివరకూ ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ ను బేసిక్ పేలో కలపాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయగా ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. ఆనాటి రాష్ట్ర ఆదాయంలో 48శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నాయని, ఇక పెంచే అవకాశమే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పడమే కాకుండా ఆనాటి అన్ని దినపత్రికల్లో ఇదే విషయంతో పూర్తి పేజీ ప్రకటనలను సైతం ఇచ్చారు.
రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘమైన సమ్మె :
ఈ నేపథ్యంలో వారు 1986 వ సంవత్సరం నవంబర్ అయిదో తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు. స్కూళ్లు మూతపడ్డాయి.ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కూడా అందలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పాలన దాదాపు స్తంభించింది.
కమిటీ వేసినా కాదన్న ఎన్జీవోలు...!
సమ్మె ప్రారంభమైన కొద్ది రోజులకు ఎన్టీఆర్ కాస్త దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి ఒక కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు. కానీ ప్రభుత్వోద్యోగులు దాన్నీ తోసి రాజన్నారు. సీఎంతో తప్పితే ఇతరులతో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. తమ సమ్మెను ఇంకా ఉధృతం చేశారు. పరిస్థితులు ప్రభుత్వం చేజారి పోయే విధంగా తయారవడంతో ఎన్టీఆర్ రాజదండం బయటకు తీశారు.*
జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టులు...!
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నిర్వాహకులైన పన్నెండు మంది నాయకులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయించారు. దీంతో పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారయింది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో రెచ్చిపోయారు. రాస్తారోకోలు, రాష్ట్ర బంద్ నిర్వహించారు. శాంతిభద్రతలు కూడా భగ్నమయ్యే వాతావరణం నెలకొంది.
ఉద్యోగులను వూస్టు చేస్తామని హెచ్చరిక :
దీంతో అహం దెబ్బతిన్న ఎన్టీఆర్ మరింత బిగుసుకుపోయారు. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్టీఆర్ ఆదేశించారు. దీంతో పీటముడి మరింత బిగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తగ్గేదేలే అన్నట్టు సమ్మెను కొనసాగించారు.
సుకుమార్ సేన్ మధ్యవర్తిత్వం...!
ఈ దశలో ఎన్టీఆర్ కు కొండంత అండగా సుకుమార్ సేన్ నిలచాడు. వామపక్ష పార్టీ ఎంపీ, అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అయిన సుకుమార్ సేన్ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ కు, ప్రభుత్వోద్యోగులకు మధ్య రాయబారం నెరిపారు. సామరస్యపూరిత వాతావరణం నెలకొల్పారు. అటు ఎన్టీఆర్, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన నచ్చచెప్పారు. సుకుమార్ సేన్ మధ్యవర్తిత్వం ఫలించి యాభై మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు శుభం కార్డు పడింది. అయితే అంతిమ విజయం ప్రభుత్వ ఉద్యోగులదే కావడం ఇక్కడ గమనార్హం.
0 Post a Comment:
Post a Comment