ప్రాథమిక విద్యార్థులకు కష్టాలు _ బడుల విలీనంతో చదువుకు ఆటంకాలు
బాలల జీవితంలో ప్రాథమిక విద్యార్థి దశ చాలా కీలకం. సరైన ప్రణాళిక లేకుండా 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విద్యాసంవత్సరంలోనే ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. 250 మీటర్ల పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలలను ఇప్పటికే విలీనం చేస్తున్నారు. వచ్చే ఏడాది కిలోమీటరు పరిధిలోని బడులను; 2023-24 నాటికి 3, 4, 5 తరగతులను పూర్తిగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యార్థుల సంఖ్య 150 దాటిన ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా పరిగణించాలని భావిస్తోంది.
ప్రమాణాలు, అవగాహనా స్థాయి, విద్యార్థుల మధ్య సంబంధాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా మూడంచెలను ఆనాటి మేధావులు ఏర్పరిచారు. విద్య ప్రాథమిక అవసరాల జాబితాలో ఉండటంవల్ల కనీసం ఇరవై మంది విద్యార్థులున్నప్పటికీ ఒక పాఠశాలను ఏర్పరిచి స్థానికంగానే విద్య నేర్పడానికి ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటుచేశారు. అవి చిన్నారుల రాకపోకలకు అనుకూలంగా ఉంటాయి. ఊళ్లో జనాభాకు అనుగుణంగా రెండు, మూడు ప్రాథమిక పాఠశాలలు సైతం ఉండవచ్చు. ప్రాథమిక స్థాయి తరగతులకు అదనంగా మరో రెండు లేదా మూడు తరగతులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉంటాయి. పిల్లల సంఖ్యకు అనుగుణంగా అవి ఏర్పాటయ్యాయి. ఉన్నత పాఠశాలలు ఆ రెండింటికీ భిన్నమైనవి. వాటికి విశాలమైన* *ఆట స్థలం, ఇతర భవనాలు వంటివి అవసరం కాబట్టి అవి ఊరి చివర, లేదా కొన్ని గ్రామాల కూడలిలో ఉంటాయి. అన్ని గ్రామాల విద్యార్థులు చేరడం వల్ల ఉన్నత పాఠశాలల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉంటుంది.
ఉన్నత పాఠశాలకు వచ్చే విద్యార్థులు కొన్ని ఇబ్బందికరమైన దారులను దాటుకుని బడికి రావాలి. 3, 4, 5 తరగతుల పిల్లలు పదేళ్లలోపువారే ఉంటారు కాబట్టి, వారిని ఉన్నత పాఠశాలల్లో కలిపితే అంత దూరం నడవటం వారికి ప్రయాస అవుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో పరిమిత సంఖ్య, తక్కువ వయసు కలిగిన విద్యార్థులు ఉంటారు. అటువంటి వారిని భారీ సంఖ్య, వయసులో బాగా తేడాలున్న విద్యార్థులతో కలిపితే వారి మధ్య అవగాహన, సామరస్యం లేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రాథమిక విద్యార్థుల మధ్యాహ్న భోజన సమయం మధ్యాహ్నం 12.10 గంటల నుంచి మొదలవుతుంది. ఉన్నత పాఠశాల విద్యార్థుల భోజన విరామం మధ్యాహ్నం ఒంటిగంట తరవాత ఉంటుంది. ప్రాథమిక విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆకలికి తట్టుకోలేరు. అలాగని చిన్నపిల్లలను వారి సమయానికి అనుగుణంగా భోజనానికి అనుమతిస్తే, పెద్ద తరగతుల పాఠ్యాంశాల బోధనకు ఇబ్బంది కలుగుతుంది.
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆట పాటలు, సందడి మధ్య విద్యాబోధన చేయాలి. దానికి అలవాటు పడిన ఉపాధ్యాయులే అలా బోధించగలరు. టీచర్ల సర్దుబాటు కారణంగా 3, 4, 5 తరగతుల పిల్లలకు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సైతం పాఠాలు బోధించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అటువంటి సందర్భంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ సహజ శైలిలో పాఠాలు చెప్పడం వల్ల ప్రాథమిక తరగతుల పిల్లలు బెంబేలెత్తే అవకాశం ఉంది. పైగా ప్రాథమిక స్థాయి విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల అకస్మాత్తుగా పిల్లల సంఖ్య పెరిగి పారిశుద్ధ్యం, తాగునీరు, తరగతి గదులు, ఆటస్థలం వంటివాటి విషయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చేష్టలు, అవసరాలు వేరుగా ఉంటాయి. పూర్తిగా ఊహ తెలియనివారు కావడంతో పెద్ద తరగతుల పిల్లల విద్యార్జనకు వారివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కళాశాల విద్యకు పదో తరగతి ముఖద్వారం వంటిది. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, బోధన అవసరమవుతాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలిపితే పదోతరగతి విద్యార్థులకు తీవ్ర ఆటంకం కలగవచ్చు. వీటన్నింటినీ పరిశీలిస్తే ప్రాథమిక పాఠశాల విద్యార్థులను, ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అర్థమవుతుంది. పైగా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇప్పటి వరకు ఉన్న విధానంలోనే యథాతథంగా విద్యాబోధన జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0 Post a Comment:
Post a Comment