Sunday, 19 December 2021

అమ్మభాషలో ఇంజినీరింగ్‌

  అమ్మభాషలో ఇంజినీరింగ్‌



అమ్మ భాషలో బీటెక్‌ బోధనకు ఎన్‌ఆర్‌ఐ కళాశాల ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ) కోర్సును ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్‌ కోర్సు ప్రారంభమైంది. భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యానికి అనుగుణంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 20 విద్యాసంస్థలు అనుమతులు పొందగా.. తెలుగు మాధ్యమంలో ఏపీ నుంచి ఈ కళాశాల అనుమతి పొందింది. తెలుగు మాధ్యమ సీఎస్‌ఈలో 60 సీట్లు ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో 20 మంది, స్పాట్‌ కింద 11 మంది ప్రవేశాలు పొందారు. తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయభాషల్లో బోధనకు పుస్తకాలను ఏఐసీటీఈ సరఫరా చేస్తుంది. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రెడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు ఉన్న కోర్సులకే ప్రాంతీయ భాషల్లో సెక్షన్లకు అనుమతించింది.

బోధన ఇలా...

విద్యార్థులను క్రమంగా తెలుగు నుంచి ఆంగ్లం వైపు తీసుకువెళ్తారు. మొదటి ఏడాది మాతృభాష, ఆంగ్లం కలిపి చెప్పడంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి. ఆంగ్లంపై భయం తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. పరీక్షల్లో ప్రశ్నపత్రాలను రెండు మాధ్యమాల్లో ఇస్తారు. విద్యార్థులు ఇష్టమైన భాషలో రాసుకోవచ్చు.

ఉద్యోగాలకు శిక్షణ :

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నైపుణ్యాలు, సామర్థ్యాలనే చూస్తున్నాయని ప్రాంగణ నియామకాల అధికారి సురేంద్ర తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, విద్యార్థులకు భాషాపరమైన సమస్య ఏర్పడదని అన్నారు. ప్రోగ్రామింగ్‌, భావవ్యక్తీకరణ, ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ నైపుణ్యాలుంటే బ్రాంచితో సంబంధం లేకుండా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అనుమతులు :

ఉన్నత విద్యలో జీఈఆర్‌ను (స్థూల ప్రవేశాల నిష్పత్తి) పెంచేందుకు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నతవిద్యను బోధించాలని జాతీయ విద్యావిధానం సూచించింది. ప్రస్తుతం జాతీయ సగటు జీఈఆర్‌ 27% ఉండగా.. దీన్ని రాబోయే 15 ఏళ్లలో 50%కు తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఐసీటీఈ ఈ ఏడాది మాతృభాష, ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు అనుమతులు ఇచ్చింది.

గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం : 

విద్యార్థులను తెలుగు నుంచి ఆంగ్లానికి తీసుకువెళ్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల భాషతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. చివరి ఏడాదికి వచ్చేసరికి విద్యార్థులు ఆంగ్ల భాషపైనా పట్టు సాధిస్తారు.

- సీఎన్‌ నాగభాస్కర్‌, ప్రిన్సిపల్‌

అర్థం కాని వాటిని చెబుతున్నారు :

తరగతిలో ఆంగ్లంలో అర్థం కాని వాటిని తెలుగులో చెప్పడంతో తేలిగ్గా అర్థమవుతున్నాయి. ఆంగ్లం, తెలుగు కలిపి చెప్పడంతో ఇబ్బంది ఉండడం లేదు.

- శ్రీనివాసరెడ్డి, విద్యార్థి, తెలుగు మాధ్యమం సీఎస్‌ఈ

సాంకేతిక అంశాలు అర్థమవుతున్నాయి :

తెలుగు, ఆంగ్లం కలిపి చెప్పడంతో సాంకేతిక అంశాలు తొందరగా అర్థమవుతున్నాయి. బోధన సౌకర్యవంతంగా ఉంది.

- సౌజన్య, విద్యార్థిని, సీఎస్‌ఈ తెలుగు

కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందించాలి :

‘తెలుగు మాధ్యమంలో బోధన సృజనాత్మకత పెరగడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమయ్యే ఆంగ్లభాష కమ్యూనికేషన్‌ నైపుణ్యాలనూ పిల్లలకు అందించాలి. పాఠ్య పుస్తకాలతో పాటు ప్రముఖ జర్నల్స్‌ను తెలుగులోకి అనువదించి విద్యార్థులకు అందించాలి. చైనాలో పత్రికలను ఇలాగే ఇస్తారు. విద్యార్థుల్లో బోధన, వినడం, అభ్యసన, రాత నైపుణ్యాలు పెంచాలి.’

- డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌, తెలుగు భాష ప్రేమికులు, సహాయ ఆచార్యులు, ఆశ్రమ వైద్య కళాశాల

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top