లెక్కలు, ఎక్కాలు మరిచారు - ఆన్‌లైన్ విద్యపై నిసా సర్వేలో వెల్లడి
ఇంగ్లిష్, మాతృభాషను చదవలేకపోతున్నారు
దిగువ తరగతి నైపుణ్యాలకూ దగ్గరగా లేరు
ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకంజ
అభ్యసనా సామర్థ్యాన్ని కోల్పోయిన బడి పిల్లలు
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత నష్టం
కరోనా కారణంగా అనివార్యమైన ఆన్‌లైన్ తరగతుల వల్ల బడి పిల్లలకు అనుకున్నంత మేలు జరగలేదని ఓ సర్వేలో స్పష్టమైంది. ఆన్‌లైన్ విద్య విద్యార్థుల అభ్యసనా సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు దీని వల్ల ఎక్కువగా నష్టపోయారని తెలిసింది. ఇందులో ఎక్కువగా పేద వర్గాల వారే ఉన్నారని వెల్లడైంది. విద్యార్థులపై కరోనా ప్రభావంపై నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ (నిసా) ఓ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణలతో పాటు 17 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు నాలుగు పాఠశాలలు ఎంపికచేసి, 3, 5, 8 తరగతుల విద్యార్థులపై ఈ సర్వే చేశారు. రాష్ట్రంలో ఏపీయూఎ్‌సఎంఏ కూడా సర్వేలో భాగస్వామ్యమైంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలకు హాజరవుతున్నా.. చాలామంది అవేమీ బుర్రకెక్కించుకోవడం లేదని ఈ సర్వేలో గుర్తించారు. విద్యార్థులు లెక్కలు, ఎక్కాల్లో వెనుకబడ్డారని.. మాతృభాషల్లో చదవలేకపోతున్నారని సర్వేలో స్పష్టమైంది. ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకబడిపోయారని తెలిసింది. మూడో తరగతిలో 44 శాతం మంది పిల్లలు లెక్కలు, ఎక్కాల్లో వెనుకబడ్డారు. వీరిలో 36 శాతం తాము చదువుతున్న తరగతి కన్నా ఒక క్లాస్ వెనుకబడిపోగా, 8 శాతం పిల్లలు 2 క్లాసులు వెనుకబడి ఉన్నారు. సెమీ అర్బన్‌లో 5వ తరగతిలో 42 శాతం పిల్లలు గణితంలో వెనుకబడిపోగా, 8వ తరగతిలో 34 శాతం విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అన్ని క్లాసుల విద్యార్థులు గణితంలో తాము చదువుతున్న తరగతుల కన్నా ఒకటి లేదా రెండు తరగతుల దిగువస్థాయి నైపుణ్యాలను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీలోనూ పిల్లలు మాతృభాషలో చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 30శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం పిల్లలు మాతృభాషలో చదవలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడ్డారు. కొందరు విద్యార్థులు చదవగలుగుతున్నా.. రాయలేకపోతున్నారని తేలింది. 35 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులు మాతృభాషలో రాయడం అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30శాతం విద్యార్థులది అదే పరిస్థితి. 8వ తరగతిలో 2శాతం విద్యార్థులు మాతృభాషలో రాయలేకపోతుండగా, 35 శాతం పట్టణ విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 9శాతం విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతుల కన్నా రెండు తరగతులు వెనుకబడి ఉన్నారు. ఆంగ్లంపై పట్టు సాధించడంలో ఏ ఒక్క విద్యార్థి దిగువ తరగతి నైపుణ్యాలను కూడా కనబర్చలేదని సర్వేలో తేలింది.
0 Post a Comment:
Post a Comment