Wednesday 29 December 2021

ఆంగ్ల మాధ్యమం _ బోధనతో భాషా సమస్య

 ఆంగ్ల మాధ్యమం _ బోధనతో భాషా సమస్య



ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పెరుగుతున్న అంతరం

పాఠ్యప్రణాళిక రూపకల్పన, బోధన అమల్లో వ్యత్యాసం

ఎన్‌సీఈఆర్టీ వార్షిక నివేదికలో వెల్లడి 

 ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలన్న నిబంధన కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భాషా సమస్య ఏర్పడుతోందని జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) 2019-20 వార్షిక నివేదికలో పేర్కొంది. ‘ఈ కారణంగా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పిల్లలు అర్థం చేసుకోవడంలోనూ లోపం కనిపిస్తోంది. పిల్లలు, ఉపాధ్యాయుల మధ్య అంతరం పెరుగుతోంది’ అని వెల్లడించింది. ఎన్‌సీఈఆర్టీ 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు అంశాలపై చేసిన అధ్యయనాల ఫలితాలతో వార్షిక నివేదికను రూపొందించింది. ఈ పరిశోధనలో భాగంగా ఉపాధ్యాయులు సైన్సు పాఠ్యాంశాల బోధన, విషయ పరిజ్ఞానాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారో పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అధ్యయనం నిర్వహించింది. మూడు జిల్లాల్లో 30 మంది ఉపాధ్యాయులను నమూనాగా ఎంపిక చేసుకుంది. బోధన సమయంలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో దగ్గర నుంచి పరిశీలించింది. ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏం నేర్పాలి? ఏం నేర్చుకుంటున్నారు? అన్న విషయాల్లోనూ అభ్యసన మదింపులోనూ స్పష్టత లోపించిందని తెలిపింది. విద్యార్థులు భావనలు (కాన్సెప్ట్‌) నేర్చుకోవాల్సిన అవసరాన్ని బోధన సమయంలో ఉపాధ్యాయులు వారికి చెప్పడం లేదని పేర్కొంది. 

ఏపీలో నిర్వహించిన అధ్యయనానికి సంబంధించి ఎన్‌సీఈఆర్టీ నివేదికలో ప్రస్తావించిన మరికొన్ని ముఖ్యాంశాలు.

ఉపన్యాసాలుగా పాఠాల బోధన :

* ఉపాధ్యాయులు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెబుతున్నారు. కార్యాచరణ ఆధారిత విద్య (కాన్సెప్ట్‌ యాక్టివిటీ) అమల్లోకి వచ్చినా దీన్ని వారు సరిగా అర్థం చేసుకోవడం లేదు.

* చాలా మంది బోధన పద్ధతులు, కంటెంట్‌ నడుమ సమన్వయ లోపం కనిపిస్తోంది.

* పాఠ్య ప్రణాళిక రూపక్పలన చేసుకుంటున్నా అమలు చేయలేకపోతున్నారు. బోధనకు, ప్రణాళికకు మధ్య అంతరాలు ఉంటున్నాయి.

* చెప్పాలనుకుంటున్న దానికి చెప్పేదానికి పొంతన ఉండడం లేదు. చాలా మంది తాము చెప్పే పాఠాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారని భావించి, తమ కృషిని అంతటితో అపేస్తున్నారు.

* ఉన్నతాధికారుల నుంచి పరీక్షల ఫలితాల ఒత్తిడి, కష్టమైన పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యం, వనరుల కొరత, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

పెరిగిన హాజరు శాతం :

విద్యాహక్కు చట్టం ఎలా అమలవుతోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న అంశంపై కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎన్‌సీఈఆర్టీ అధ్యయనం చేసింది. చట్టం అమలు తర్వాత విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెరిగినట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు, వ్యవసాయ పనులకు వలసలు వంటి కారణాల వల్ల కొందరు బడిమానేస్తున్నారని తెలిపింది. మౌలిక వసతులు మెరుగుపడినా నిర్వహణ సరిగా ఉండడం లేదని పేర్కొంది. పాఠ్య పుస్తకాలు, బ్యాగ్‌లు, ఏకరూప దుస్తుల పంపిణీ బాగా జరుగుతోందని, కొన్నిచోట్ల ఆలస్యమవుతోందని వెల్లడించింది. విద్యార్థుల హాజరు పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం దోహదం చేస్తోందని తెలిపింది.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top