పిల్లలు కిటకిట _ గదులకు కటకట
పాఠశాలల్లో పెరిగిన విద్యార్థులు
సబ్జెక్టు ఉపాధ్యాయులు, గదుల కొరత
సెక్షన్‌కు 90మంది
ఆరుబయట పాఠాల బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరతకు నిదర్శనం ఈ చిత్రం. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం శంకరభారతిపురంలోని లింగుంట్లకాలనీ జిల్లాపరిషత్తు పాఠశాలలో ఒక్కో సెక్షన్‌లో 90-95మంది పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. బెంచీలు సరిపోక బ్లాక్‌బోర్డు వరకు నేలపైనే కూర్చుంటున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 1,429 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మరో 18 మంది ఉపాధ్యాయుల అవసరం.
రాష్ట్రంలో జడ్పీ, పురపాలక ఉన్నత పాఠశాలలను తరగతి గదులు, సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దీని ప్రభావం పడుతోంది. నిబంధనల ప్రకారం 40 మందికి ఒక సెక్షన్ ఉండాలి. చాలా చోట్ల 60-90 మంది విద్యార్థులను ఒకే సెక్షన్‌గా ఇరుకుగా కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధన అమలు కావడం లేదు. కొన్నిచోట్ల సాంఘిక శాస్త్రాన్ని తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయులు... మరికొన్నిచోట్ల తెలుగు పాఠాలను ఇతర ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పిల్లలకు పాఠాలు అర్థమవుతున్నాయా? లేదా? అనే దాన్ని పట్టించుకోకుండా సిలబస్ పూర్తి చేశామా? లేదా? అనే కోణంలో బోధన తీరు సాగుతోంది. సబ్జెక్టు ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారే తప్ప కొత్త నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలల స్థితిగతులపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పర్యటనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
విద్యార్థులు పెరిగినా.నియామకాలు లేవు :
ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం లేదు. ఇటీవల 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేయడంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల సమస్య మరింత పెరిగింది. విద్యా వాలంటీర్ల నియామకాలకూ అనుమతి ఇవ్వడం లేదు. గుంటూరు జిల్లా సాతులూరు పాఠశాలలో 466 మంది పిల్లలున్నారు. ఇక్కడ 13 సెక్షన్లున్నాయి. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు ఒక్కరే ఉండటంతో ఆయన ఆరింటికి, తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయులు ఐదింటికి, రెండు సెక్షన్లకు ప్రధానోపాధ్యాయురాలు బోధిస్తున్నారు.
తెలుగు, ఆంగ్ల మాధ్యమానికీ వీరే.* పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో 25 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. దాంతో సెక్షన్లను తగ్గించి బోధన చేస్తున్నారు.
కింది తరగతులకు ఇబ్బందులు:
కామన్ పరీక్షల కారణంగా పదో తరగతిపైనే ఎక్కువగా ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు. దాంతో 6-9 తరగతుల విద్యార్థులకు సరైన రీతిలో బోధన సాగడం లేదు. గణితం, సామాన్య, ఆంగ్లం వంటి సబ్జెక్టులపై కిందిస్థాయి తరగతుల్లో పట్టుసాధించలేకపోతే పదోతరగతిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు బోధనేతర యాప్‌ల పనులు అప్పగించడంతో కొంత సమయం వృథాగా పోతోంది. ‘నాడు-నేడు’ మొదటివిడతలో తరగతి గదుల నిర్మాణం చేపట్టలేదు. గతంలో సమగ్ర శిక్ష అభియాన్ కింద ఆరు వేల వరకు నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తి కాలేదు. ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ గుత్తేదారులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రధాన ఉన్నత పాఠశాలలో గదులు సరిపోకపోవడంతో రోజుకో తరగతిని ఆరుబయట నిర్వహిస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
* ఉన్నత పాఠశాలల్లో 1,795 మంది సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది
* ఉపాధ్యాయుల బదిలీల సమయంలో 15 వేల పోస్టులను బ్లాక్ చేశారు
* పదవీ విరమణలు, మరణాలతో మరో వెయ్యికి పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇవన్నీ కలిపితే 18వేల వరకు ఖాళీలున్నాయి.
* పురపాలక బడుల్లో 2,400 మంది వరకు ఉపాధ్యాయులు అవసరం.
* అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు తొలుత అనుమతి తెలిపిన పురపాలకశాఖ ఆ తర్వాత నిరాకరించింది
* రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,498 తరగతి గదులు అవసరం.
* 220 పురపాలక బడులను గదుల సమస్య వేధిస్తోంది.
* డీఎస్సీ-2018 తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు
నియామకాలు చేపట్టాలి :
పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగిస్తూ 40మందికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఖాళీలను భర్తీ చేయాలి. పురపాలక బడుల్లో వేలల్లో పిల్లలు ఉంటే సబ్జెక్టు ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేరు...
- బాబురెడ్డి, గౌరవాధ్యక్షుడు, యూటీఎఫ్
శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలం రాగోలు ఉన్నత పాఠశాలలో 3-10 తరగతుల్లో 464 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు సరిపోక ఆరుబయటేపాఠాలు చెబుతున్నారు. ఇక్కడ 21 మందికి గాను 15 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌ఆర్‌కే పురపాలక ఉన్నత పాఠశాలలో 10 గదులు అవసరమవగా ప్రస్తుతం నాలుగు గదులు నిర్మాణంలో ఉన్నాయి. గదుల కొరతతో పదో తరగతి మినహా మిగతా వారికి ఉదయం, సాయంత్రం విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. పదోతరగతిలో ఆరు సెక్షన్లు ఉండడంతో ఉన్న ఒక్క తెలుగు ఉపాధ్యాయుడే పాఠాలు చెబుతున్నారు. మిగిలిన తరగతులకు ఎవరు ఖాళీగా ఉంటే వారు తెలుగును బోధించడం గమనార్హం.
0 Post a Comment:
Post a Comment