ఉద్యోగులు ఎక్కువఊహించుకొని నిరుత్సాహపడొద్దు ప్రభుత్వ ఆర్థిక వనరులకు అనుగుణంగానే పీఆర్సీ : ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టీకరణ
కొవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకునే కొత్త పీఆర్సీ ప్రకటన ఉంటుందని, దీన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఉద్యోగులు ఎక్కువ ఊహించుకుని తర్వాత నిరుత్సాహపడే కంటే.. ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిదని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం పీఆర్సీపై సీఎం జగన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సలహాదారు సజ్జల, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ అధికారులు సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా పలుమార్లు ఉద్యోగ సంఘాలతో సమావేశమైన అధికారులు, సజ్జల పీఆర్సీపై ఉద్యోగుల అభిప్రాయాలను సమావేశంలో చెప్పారు. పీఆర్సీ ఇస్తే ప్రభుత్వంపై పడే భారాన్ని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘పీఆర్సీ కసరత్తు ఈ నెలాఖరుకు కొలిక్కివస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాతే ప్రకటన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతాలు కొంతమేర తగ్గుతాయని గుర్తించాం. మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా ఉద్యోగుల జీతాలు కొంత పెరిగేటట్లు కసరత్తు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో అధికారులు పీఆర్సీపై కసరత్తు చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారు. ఆ అంశాలను సీఎంకు వివరిస్తారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పీఆర్సీ ప్రకటించింది’ అని వెల్లడించారు.
0 comments:
Post a Comment