తెలంగాణ ఇంటర్‌లో అందరూ పాస్...?
ఫెయిలైన విద్యార్థులందరికీ 35 శాతం మార్కులు వేసే యోచనలో ప్రభుత్వం
ఆందోళనల నేపథ్యంలో మల్లగుల్లాలు
ఫలితాల నివేదికను పరిశీలిస్తున్న సీఎంవో
ఒకటి రెండు రోజుల్లో ప్రకటన!
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని యోచిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 35 శాతం కనీస మార్కులు వేసి, పాస్ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కేవలం 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈ పరీక్షలను మొత్తం 4,59,242 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాసైన వారిలో 25 శాతం మంది విద్యార్థులు.. 75 శాతానికి పైగా మార్కులు సాధించారు. కనీస మార్కులు 35-50 శాతం మధ్య సాధించిన విద్యార్థులు 3 శాతం మంది మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి 5-10 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడం, 10వ తరగతిలో పరీక్ష రద్దు చేసి అందరినీ పాస్ చేయడమేనని అంచనా వేస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం తప్ప.. మరో మార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫలితాలపై అధ్యయనం చేస్తోంది.
ముందే నిర్ణయం తీసుకోవాల్సింది..!
వాస్తవానికి గత ఏడాది కరోనాతో ఇంటర్ వార్షిక పరీక్షలను రద్దు చేసినప్పుడే సరైన నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి, అందరికీ 35 శాతం మార్కులు ఇచ్చి పాస్ చేసినా.. తర్వాత ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు కొత్త మార్కులను ఇచ్చారు. తక్కువ మార్కులు వచ్చినవారికి 35 శాతాన్ని అలాగే ఉంచారు. దీంతో విద్యార్థులు ఫెయిల్ అన్న సమస్య ఉత్పన్నం కాలేదు. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలను రద్దు చేసిన సమయంలో విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ మాత్రమే చేశారు. దీంతో ద్వితీయ సంవత్సరం చదువుతున్నా.. మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్‌లు ఉండిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ద్వితీయం సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయినా.. మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయకపోతే మొత్తంగా ఇంటర్‌లో విద్యార్థి ఫెయిల్ అయినట్లే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 35 శాతం మార్కులు ఇచ్చి, పాస్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఫస్టియర్ పరీక్షల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు మినహా, మిగిలిన అన్ని మేనేజ్‌మెంట్ల కాలేజీల్లోనూ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రభుత్వ కాలేజీల్లో ఇది అన్నింటికంటే తక్కువగా ఉండడం గమనార్హం. ప్రైవేటు కాలేజీల్లోనూ 53 శాతమే నమోదయింది.
ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు మినహాయింపు :
ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలనుకునే ఆర్ట్స్, హ్యూమనిటీస్ వంటి కోర్సుల్లోని విద్యార్థులకు హాజరునుంచి మినహాయింపు ఇచ్చారు. తరగతుల కోసం కాలేజీలకు వెళ్లకుండానే వారు వార్షిక పరీక్షలు రాయవచ్చు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. హాజరు మినహాయింపును కోరుకునే విద్యార్థులు జనవరి 5లోగా రూ.500 చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. అలాగే, రూ.200 ఆలస్య రుసుముతో జనవరి 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
0 Post a Comment:
Post a Comment