39శాతం ప్రైవేటు బడుల్లోనే ఆన్‌లైన్ తరగతులు _ రాష్ట్రంలో 3,221 పాఠశాలలపై సర్వే : కేంద్రం విడుదల చేసిన డిజిటల్ విద్యా నివేదికలో వెల్లడి
కరోనా వైరస్‌తో బడులు మూతపడిన సమయంలో రాష్ట్రంలో 39శాతం ప్రైవేటు పాఠశాలలే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిజిటల్ విద్యా నివేదిక పేర్కొంది. బోధన, అభ్యసనకు విద్యా రంగంలో రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై ప్రత్యేక నివేదికను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 61శాతం ప్రైవేటు బడులు ఆన్‌లైన్‌కు దూరంగా ఉన్నాయి. రాష్ట్రంలో 3,221 ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్) సర్వే నిర్వహించాయి. ఇందులో 369 కార్పొరేట్, 2,852 ఇతర ప్రైవేటు పాఠశాలలున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 1,272 పాఠశాలలే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయి. డిజిటల్ సదుపాయంలేని చాలా మంది విద్యార్థులు చదువును కోల్పోయారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల బోధనకు లో-టెక్, హై-టెక్, నో-టెక్ విధానం అనుసరించినట్లు నివేదిక వెల్లడించింది. హై-టెక్ కింద కొందరు ఉపాధ్యాయులు జూమ్ తరగతులు నిర్వహించగా.. లో-టెక్ కింద వాట్సప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాలు, నో-టెక్ కింద టీవీ పాఠాలు, వర్క్‌షీట్ల పంపిణీ ద్వారా బోధన కొనసాగించినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,03,897 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు 90 రోజుల నిష్ఠ శిక్షణను నిర్వహించగా.. అన్ని మాడ్యూల్స్ శిక్షణను 97,894 మంది పూర్తి చేశారని, పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంచేందుకు ‘మేం చదవడాన్ని ఇష్ట పడతాం’ కార్యక్రమాన్ని అమలు చేశారని వెల్లడించింది. ఈ-కంటెంట్‌ను రూపొందించడంపై దీక్ష ప్లాట్‌ఫామ్ ద్వారా 6,500 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందినట్లు పేర్కొంది. 609 పాఠశాలలకు చెందిన 18,270 మంది పిల్లలకు ట్యాబ్‌లు, 95 సెకండరీ బడులకు చెందిన 2,850మందికి ల్యాప్‌టాప్‌లు ప్రభుత్వం అందించినట్లు తెలిపింది.
49వేల మంది బడిబయటే...
రాష్ట్రంలో 6 నుంచి 14ఏళ్లలోపు వయసున్న 49,138 మంది విద్యార్థులు బడిబయట ఉన్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ గుర్తించింది. యాప్ ద్వారా ఇంటింటికి నిర్వహించిన సర్వేలో ఈ అంశం బహిర్గతమైంది. వీరే కాకుండా 15-19ఏళ్ల మధ్యలో చదువుకోని వారు 38,036మంది ఉన్నారు. మరో 30,396మంది తల్లిదండ్రులతో కలిసి పనులకు వలస వెళ్లిపోయారు.
0 Post a Comment:
Post a Comment