పీఆర్సీపై వీడని ఉత్కంఠ - 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే స్థిరంగా ఉన్న ప్రభుత్వం
అంగీకరించబోమని ఉద్యోగుల ప్రకటన
స్పష్టత రాకుండానే ముగిసిన చర్చలు
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు ముందుకు కదలడం లేదు. అధికారులు 14.29 శాతం ఫిట్‌మెంట్ పైనే స్థిరంగా ఉండగా.. ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సచివాలయంలో గురువారం ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. గతంలో ఇచ్చిన ఫిట్‌మెంట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే.. సీఎం జగన్ ఫిట్‌మెంట్ ఎంత ఇస్తారో వెల్లడిస్తే తమ అభిప్రాయం చెబుతామని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. వారం రోజుల్లో సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఐకాసలు ఇచ్చిన 71 డిమాండ్లూ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారుల సంఘాలతో సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
సీఎం, సీఎస్‌ల హామీలు అమలు కావడం లేదు :
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్
తిరుపతిలో సీఎం జగన్, అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ ప్రకటన 72 గంటలు.. వారం రోజుల్లో ఉంటుందని చెప్పినా ఇప్పటి వరకు ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ‘అధికారులు ఇచ్చిన పీఆర్సీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సీఎం చెప్పమన్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే మాట్లాడుతోంది. ప్రస్తుతం తీసుకుంటున్న 27 శాతం ఐఆర్‌పై ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారో సీఎంతో చర్చించి, చర్చలకు పిలవాలని చెప్పాం. ఇక ఉపేక్షించేది లేదు. జనవరి 3న ఐకాసల స్ట్రగుల్ కమిటీ సమావేశం పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం’ అని వెల్లడించారు.
ఉద్యోగులను అవమానించేలా చర్చలు :
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్
ఉద్యోగులను అవమానించేలా పీఆర్సీ చర్చలు నిర్వహిస్తున్నారని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ‘సీఎం దగ్గరకు చర్చలకు తీసుకువెళ్తామని చెప్పి, ఇప్పుడు ఆర్థికశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక భాగం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతుందన్న మాటలు అవాస్తవం. ప్రస్తుతం తీసుకునే జీతం కన్నా తగ్గకుండా పీఆర్సీ వచ్చేలా చూస్తామని అధికారులు చెప్పడం దుర్మార్గం. ప్రభుత్వం నుంచి ఎంత ప్రతిపాదన ఉందంటే మళ్లీ 14.29 శాతం అంటున్నారు. 2,500 మంది ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ ఛార్జి మెమోలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సస్పెండు చేశారు. సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. చర్చల్లో పురోగతి ఉంటేనే మమ్మల్ని పిలవాలని, లేదంటే సీఎంవద్ద సమావేశానికి పిలవాలని చెప్పాం’ అని తెలిపారు.
పీఆర్సీ పదేళ్లకు ఇస్తారా...?
- ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు
పీఆర్సీ అయిదేళ్లకు కాకుండా పదేళ్లకు ఇస్తారా? అని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు ప్రశ్నించారు. ‘పీఆర్సీ అంటే పే రివర్స్‌డ్ కమిషన్‌గా మార్చేశారు. చర్చలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. క్రమపద్ధతిలో సమావేశాలు జరగడం లేదు. ఈసారి సీఎం దగ్గర మాత్రమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం’ అని వెల్లడించారు.
13 జిల్లాల్లోనూ ఉద్యోగుల చైతన్య యాత్రలు :
- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
జనవరి నుంచి 13 జిల్లాల్లోనూ చైతన్య యాత్ర నిర్వహిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ‘చాయ్ పే చర్చ తరహా సమావేశాలతో ఉద్యోగులకు ఉపయోగం లేదు. దీర్ఘకాలిక ఆందోళనలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ వెల్లడిస్తాం. ఐఏఎస్ అధికారులు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
0 Post a Comment:
Post a Comment