కొవిడ్ వేళ నడుము నొప్పి వేధిస్తోందా?
Source: eenadu
కొవిడ్ కాలం మొదలయ్యాక నడుము నొప్పి కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు దొరికినా, ఆఫీసులో ఉన్న సౌకర్యాలు ఇంట్లో లేకపోవడం వల్ల చాలా మందిని నడుము నొప్పి వేధిస్తోంది. కొవిడ్ బారిన పడ్డవారిలో నడుము నొప్పి ఒక లక్షణంగా ఉంటోంది. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం, కూర్చునే, పడుకునే భంగిమలు సరిగా లేకపోవడం వల్ల నడుము నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో స్పైన్ సర్జన్‌గా పనిచేసే డాక్టర్ జి.పి.వి సుబ్బయ్య, నడుము నొప్పిని నివారించడానికి కొన్ని పరిష్కార మార్గాలను సూచించారు.
కొవిడ్ వేళ నడుము నొప్పి కేసులు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి?
ఈ సమయంలో నడుము నొప్పి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. గతంలో నడుము నొప్పికి చికిత్స తీసుకున్న వాళ్లు ఈ లాక్డౌన్ సమయంలో తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల తగ్గిపోయిన నొప్పి మళ్లీ మొదలవుతోంది. అలాగే కొవిడ్ సోకిన వాళ్లలో సాధారణంగా నడుము నొప్పి వస్తుంటుంది. ఇది ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ప్రస్తుతం తీవ్రమైన నడుము నొప్పి, ఒళ్లు నొప్పులను కొవిడ్ లక్షణాల్లో భాగంగా పరిగణించవచ్చు. అలాగే ఇప్పటి వరకూ నడుము నొప్పి లేని వాళ్లు ఒకే చోట ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల నడుము నొప్పి సంభవిస్తుంది. ఇంటి నుంచి పనిచేస్తున్న వాళ్లలో నడుము నొప్పి ఎందుకు వస్తోంది?
ఇంటి నుంచి పనిచేసే వారు సరైన పద్ధతిలో కూర్చోవడం లేదు. వాళ్లు సరైన భంగిమలో కూర్చుని పనిచేయడం వల్ల నడుము నొప్పిని నివారించవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే.. కుర్చీలో కూర్చున్నపుడు వీపు కుర్చీకి ఆనుకొని ఉండాలి. అలాగే మోకాలి భాగం తుంటి భాగానికి దిగువన ఉండాలి. పాదాలను నేలకు తాకేలా చూసుకోవాలి. లేదా ఫుట్‌రెస్ట్ లాంటి దాని మీద కాళ్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కూర్చుని పనిచేస్తూ.. ప్రతి 30 లేదా 45 నిమిషాలకు ఒకసారి లేచి రెండునిమిషాల పాటు నడవాలి. వీటితో పాటు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
కరోనా వేళ నడుము నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యునిటీని పెంచుకునే ఆహారంతో పాటు కాల్షియం ఎక్కువ లభించే ఆహారం తీసుకోవాలి. పాలు, పాలు సంబంధిత ఆహార పదార్థాల్లో కాల్షియం మెండుగా లభిస్తుంది. ఆకు కూరలు, ఆయా కాలాల్లో లభించే పళ్లు, రాగులు వంటి వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల తగినంత కాల్షియం శరీరానికి అందుతుంది. దాంతో వెన్నెముక, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కరోనా వేళ తీవ్రమైన నడుము నొప్పి వస్తుంటే తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలి. కరోనా వల్ల వచ్చే నడుము నొప్పి ఒక వారం మాత్రమే ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఫలితం నెగిటివ్ వచ్చి, నడుము నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.కొవిడ్ వేళ నడుము నొప్పి వేధిస్తోందా?కొవిడ్ వేళ నడుము నొప్పి వేధిస్తోందా?
0 Post a Comment:
Post a Comment