పథకమా...జీతమా...
Source: Andhra Jyothi
👉 రెండింటికీ నిధులివ్వలేక సతమతం
👉 ఇప్పటిదాకా ఆర్బీఐకి చేరని జీతాల బిల్లు
👉 8 నుంచే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు
👉 9వ తేదీ ‘విద్యా దీవెన’ సొమ్ములు కష్టం
👉 పథకం అమలు 15వ తేదీకి వాయిదా
కొత్త నెల వచ్చి మూడు రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ‘ఆఫీసులకు వరుస సెలవులు వచ్చాయి కదా! అందువల్లే జీతాలు పడలేదేమో’ అనుకుంటున్నారా! సెలవులు ఎన్ని వచ్చినప్పటికీ... నెలలో చివరి పని దినం రోజున జీతాలు జమ చేయాలి. పైగా... శనివారం బ్యాంకులకు సెలవేమీ లేదు. ‘పోనీలే, సర్దుకుపోదాం! మంగళవారమైనా జీతాలు పడతాయి’ అనుకుంటే మళ్లీ పొరపాటు పడినట్లే! ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు 8వ తేదీ నుంచి మాత్రమే జరుగుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దిగజారి పోయిన ఆర్థిక పరిస్థితే దీనికి కారణం. ప్రస్తుతం... ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతా లు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. అందుకే జీతాల చెల్లింపుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది.
ఇంకెప్పుడు...?
ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు మరింత ఆలస్యం అవుతాయని 8వ తేదీకిగానీ వేతనాలు పడడం ప్రారంభం కాదని అంచనా వేస్తున్నారు. గత ఏడాదిగా ప్రాధాన్యక్రమంలో మొదట సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు విడతల వారీగా 20వ తేదీ వరకు చెల్లిస్తున్నారు. శనివారం బ్యాంకులకు పనిదినమే. ముందుగా నిధులు సర్దుబాటు చేసి ఉంటే శనివారమే ఉద్యోగులకు వేతనాలు అందేవి. కానీ... ఈనెలలో ఇప్పటిదాకా ఉద్యోగుల వేతనాల ఫైలు ఆర్బీఐకి పంపలేదు. ఆది, సోమవారాలు బ్యాంకు సెలవులు కాబట్టి పంపే అవకాశం లేదు. మంగళవారం వేతనాల ఫైలు ఆర్బీఐకి చేరితే బుధవారం నుంచి చెల్లింపులు ప్రారంభం కావచ్చు. ఈ నెల 9వ తేదీన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం అమలు చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ వేతనాలు, పెన్షన్లకే డబ్బులు సరిపోతాయి. దీంతో విద్యాదీవెన పథకం కోసం నిధులు సమకూరడం అసాధ్యమనే అంచనాకు వచ్చారు. ఆ పథకాన్ని ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. వేతనాల చెల్లింపులు ప్రారంభమయ్యాక ఏ వారం రోజుల వ్యవధిలో అప్పులు తీసుకొచ్చి ‘విద్యా దీవెన’కు నిధులు సమకూరుస్తారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి!
0 comments:
Post a Comment