Saturday, 13 March 2021

నేడు ప్రముఖ శాస్త్రవేత్త "ఆల్బర్ట్ ఐన్ స్టీన్" గారి జయంతి

 నేడు ప్రముఖ శాస్త్రవేత్త "ఆల్బర్ట్ ఐన్ స్టీన్" గారి జయంతి
  ఐదేళ్ల వయసులో సంగీత ప్రపంచంలోకి అడుగిడిన ఆ బుడతడు వయోలిన్ తీగలతో ఆటలడుకున్నాడు. స్వర మాంత్రికుడయ్యాడు.పదహారేళ్ల వయసుకే గణితం, భౌతిక శాస్త్రాలతో ప్రేమలో పడ్డాడు. స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలో కనీస మార్కులకు బహుదూరంగా నిలిచి పోయాడు. ఆ పరీక్షలోనే గణిత, భౌతిక శాస్త్ర అంశాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి, అత్యుత్తమ మార్కులు సాధించాడు.

  పాఠశాల దశలోనే బోధనా విధానాలను విమర్శించాడు. బట్టీ అభ్యసనాన్ని వ్యతిరేకించాడు. సృజనాత్మక వికాసం జరగాలన్నాడు.అతడే ప్రపంచానికి సాపేక్ష విధానాన్ని పరిచయం చేసి, అఖండ ప్రతిభావంతునిగా ప్రసిద్ధి పొంది, ‘జీనియస్’ అనే పదానికి పర్యాయ పదంగా నిలిచిన ఆల్బర్ట్ ఐన్ స్టీన్.

  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి నెల 14న జర్మనీలో జన్మించాడు. ఆయన జన్మించిన అరువారాలకు ఆ కుటుంబం ఉర్టెంబర్గ్ నుండి మ్యూనిచ్ నగరానికి వలస పోయింది. ఐన్ స్టీన్ బాల్యం అక్కడే గడిచింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఇటలీకి మారింది. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో అత్తెసరు మార్కులు రావడంతో పాలిటెక్నిక్ లో చేరలేక పోయాడు. దాంతో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సలహా మేరకు 1895లో స్విట్జర్లాండ్ లోని అర్గోవియన్ కంటోనల్ పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేసేందుకు చేరారు. ఆ సంవత్సరంలో సెకండరీ విద్య పూర్తి చేసుకున్నారు. సెకండరీ విద్యలో అత్యుత్తమ స్థాయి ప్రతిభ కనబరిచారు. గణిత, భౌతిక శాస్త్రాల్లో ఉత్తమ గ్రేడ్ పొందారు. 1896లో జ్యురిచ్ లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ కళాశాలలో కేవలం పదిహేడేళ్ల వయసులోనే గణిత, భౌతిక శాస్త్రాల ఉపాధ్యాయ శిక్షణ కోసం చేరారు. 1901లో ఉపాధ్యాయ శిక్షణ లో డిప్లొమా పూర్తి చేశారు. స్విట్జర్లాండ్ పౌరసత్వం పొందారు. 1905లో ‘ఎ న్యూ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ డైమెన్షన్స్’ అనే అంశంపై పిహెచ్.డి. పొందారు.  అదే సంవత్సరం ఐన్ స్టీన్ ప్రఖ్యాతి గాంచిన నాలుగు పరిశోధనా పాత్రలను సమర్పించారు. ఈ నాలుగే అత్యుత్తమమైనవే. ఈ పత్రాలు కాంతి విద్యుత్ ఫలితం, బ్రౌనియన్ చలనం, ప్రత్యేక సాపేక్షికత, ద్రవ్యరాశి –శక్తి తుల్యత. ఈ నాలుగు ఐన్ స్టీన్ కు గొప్ప పేరు సాధించి పెట్టాయి.

  బోధనలో డిప్లొమా పూర్తి చేసిన ఐన్ స్టీన్ కు ఎక్కడా ఉపాధ్యాయ ఉద్యోగం దొరకలేదు. దాంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు. 1908 నాటికి ఐన్ స్టీన్ కు శాస్త్రవేత్తగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం విద్యుత్ గతి శాస్త్రం పై, సాపేక్ష సిద్ధాంతంపై లెక్చర్ ఇవ్వడంతో అల్ఫ్రెడ్ క్లీనర్ ఆయనను జ్యురిచ్ విశ్వ విద్యాలయంలో కొత్తగా ఏర్పడ్డ  ప్రొఫెసర్ పోస్టుకు ప్రతిపాదించారు. 1909లో ఐన్ స్టీన్ ను అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు లో నియమించారు.  1911లో ప్రేగ్ లో పూర్తి స్థాయి భౌతిక శాస్త్ర ఆచార్య పదవి పొందారు. ఆ తర్వాత జ్యురిచ్ లోనూ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1914లో కైసర్ విలియం ఇన్ స్టిట్యుట్ సంచాలకుడయ్యారు. అదే ఏట బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి పొందారు. అనంతరం ఐన్ స్టీన్ ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడయ్యారు. 1916లో జర్మన్ ఫిజికల్ సొసైటీ అధ్యక్షుడయ్యారు.

  వేరే నక్షత్రం నుండి వెలువడిన కాంతి సూర్యుని ఆకర్షణ ప్రభావం వల్ల వంగి ప్రయాణిస్తుందని ఐన్ స్టీన్ 1911లో కనుగొన్నారు. ఈ భావనను 1919లో సర్ ఆర్థర్ ఎడ్డింగ్ టన్ ఒక పరిశోధన ద్వారా ధృవీకరించారు. దాంతో ఐన్ స్టీన్ ఖ్యాతి పెరిగింది. న్యూటనియన్ సిద్ధాంతాన్ని తోసి రాజని విజ్ఞాన శాస్త్రంలో నవీన సిద్ధాంతం ఆవిష్కృత మైందని ‘టైమ్స్’ దినపత్రిక కితాబిచ్చింది.

  1920లో ఐన్ స్టీన్ రాయల్ నెదర్లాండ్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు సభ్యుడిగా ఎంపికయ్యారు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఆయన కృషికి- ప్రత్యేకించి కాంతి విద్యుత్ ఫలితం ఆవిష్కరణకు 1921లో నోబెల్ బహుమతి వరించింది.  సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ పరిశోధనల్లో ప్రసిద్ధి చెందింది. కదులుతున్న వస్తువును పరిశీలకుడి దృష్ట్యా చూడడాన్ని నిర్ధారించి చెప్పింది ఈ సిద్ధాంతం. ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమానికి ఆయనకు గొప్ప పేరు వచ్చింది. ఈ పరిశోధనలతో పాటు ఐన్ స్టీన్ అనేక పరిశోధనలు నిర్వహించారు. వందలాది పరిశోధనా పత్రాలను, గ్రంథాలను ప్రచురించారు.

ఐన్ స్టీన్ జయంతి అయిన ఈరోజే 'పై' దినోత్సవం గా జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చిన గొప్ప గౌరవం.

  జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ‘జీనియస్’ అనే పదానికి మారు పేరు గా నిలిచిన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1955 ఏప్రిల్ 18 న మరణించినప్పటికీ సాపేక్ష సిద్ధాంత సృష్టికర్తగా నిరంతరం మన అన్ని కార్యకలాపాల్లో చిరంజీవిగా ఉంటారు. ఆయనే పుట్టక పోయి ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఊహకు అందదు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top