పదిమందికి ఇద్దరు.. 60మందికీ ఇద్దరేనా...?
▪️ బదిలీలపై విద్యాశాఖ కసరత్తు
▪️ హేతుబద్ధీకరణ సక్రమంగా జరగాలంటున్న సంఘాలు
వివరాల సేకరణలో ఎంఈవోలు :
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా పాఠశాలల కేటగిరీల వివరాలు సేకరించడంతోపాటు ఉపాధ్యాయుల వివరాలను సరిచూసుకుని అప్‌డేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండలాల వారీగా ఎంఈవోలు తమ పరిధిలోని పాఠశాలల సమాచారాన్ని కేటగిరీల వారీగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
హెచ్‌ఆర్‌ఏ 20, 12.5, 10 శాతాన్ని బట్టి వరుసగా కేటగిరీ 1, 2, 3లుగా విభజించారు. రోడ్ల్ల సౌకర్యంలేని గ్రామాల్లోఉన్న పాఠశాలలు కేటగిరీ 4 పరిధిలోకి వస్తాయి. అలా జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలో ఎన్ని పాఠశాలలు ఏ కేటగిరీలో ఉన్నాయో సేకరిస్తున్నారు. దీంతోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల వివరాలను కూడా పరిశీలించుకుని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులనుంచి డీఈవో లాగిన్‌కు అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టులు, 5, 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారో పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ వివరాలను ముందుగానే సేకరించడం ద్వారా బదిలీలకు ఎంతమంది అర్హులు కాబోతున్నారనేది ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఎంఈవో లాగిన్‌కు పంపాల్సి ఉంటుంది.
నమోదుపై అవగాహన అవసరం :
ఉపాధ్యాయులు తమ వివరాలను అప్‌డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించడంతో వివరాల నమోదుపై అందరూ అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ట్రెజరీ ఐడీ, ఉపాధ్యాయుని పేరు, ప్రస్తుత పాఠశాలలో ఎన్నాళ్లనుంచి పనిచేస్తున్నారు, ఉద్యోగ సర్వీసులో ఎప్పుడు ప్రవేశించారు, గడిచిన 8 ఏళ్లలో స్పౌస్ కోటా వినియోగించుకున్నారా, బోధిస్తున్న అంశం, ఎస్జీటీనా, స్కూల్ అసిస్టెంటా ఏ భాషలో బోధిస్తున్నారు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లాగిన్‌లో తమ వివరాలు సరిచూసుకుని ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ :
హేతుబద్ధీకరణ ప్రక్రియ తీరు ఉపాధ్యాయ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించాలని నిర్ణయించింది. కొవిడ్ కారణంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక తదితర పథకాల కారణంగా ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో ఫిబ్రవరితో పోల్చితే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఫిబ్రవరి నాటి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. పదిమంది విద్యార్థులు ఉన్న పాఠశాలకూ ఇద్దరే , 60మంది ఉన్నా ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటారు. దీనివల్ల అక్కడి ఉపాధ్యాయులపై పనిభారం పెరగడంతోపాటు విద్యార్థులకు అందించే బోధనపైన కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేయాలని సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలా చేయడంవల్ల మిగులు ఉపాధ్యాయుల లెక్కలు పక్కాగా తేలేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
0 Post a Comment:
Post a Comment