Thursday 22 April 2021

Corona vaccine ల నుంచి ఎంతకాలం రక్షణ - కొనసాగుతోన్న పరిశోధనలు

 Corona vaccine ల నుంచి ఎంతకాలం రక్షణ -  కొనసాగుతోన్న పరిశోధనలు



వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ దాదాపు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే, ఈ టీకాలు ఎంతకాలం పనిచేస్తాయనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వీటిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో వెలుగు చూస్తోన్న కొత్తరకాలపై టీకాల పనితీరునూ విశ్లేషిస్తున్నారు. వీటి ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపైనే అధ్యయనం కొనసాగించాల్సి ఉన్నందున.. ఇందుకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కనీసం 6నెలల రక్షణ :

ప్రపంచ వ్యాప్తంగా గత ఐదారు నెలలుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫైజర్‌ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కనీసం 6నెలల పాటు రక్షణ ఇస్తుందని ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో తేలింది. అంతకంటే ఎక్కువ కాలం కూడా రక్షణ ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికాకు చెందిన మోడెర్నా టీకా రెండో డోసు తీసుకున్న 6నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనిపిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకుడు డెబోరా ఫుల్లెర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న వ్యాక్సిన్‌లు  జీవితాంతం రక్షణ కల్పించకపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌కు చెందిన నిపుణుడు డాక్టర్‌ కథ్‌లీన్‌ న్యూజిల్‌ వెల్లడించారు. ఒక ఏడాది కాలమైతే ఇవి రక్షణ కల్పిస్తాయనే నమ్మకముందన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్‌లు కోసం అదనంగా మరో డోసు తీసుకోవాల్సి రావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు ఒకరకమైన స్పైక్‌ ప్రొటీన్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించబడినవని అమెరికాలోని ఎమోరీ వ్యాక్సిన్‌ సెంటర్‌కు చెందిన మెహుల్‌ సుథార్‌ పేర్కొన్నారు. వైరస్‌లో మ్యుటేషన్‌లు జరుగుతున్నాకొద్దీ వాటిని ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసులు అవసరం కావచ్చన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్తరకాలపైనా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తేలడం ఊరట కలిగించే విషయమని చెప్పారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పొందిన వారి సంఖ్య పెరిగినప్పుడు వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో పాటు కొత్తరకాల ప్రభావం కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన పలు నివేదికలు కూడా 6నెలల నుంచి కొన్ని ఏళ్లపాటు వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తాయని అంచనా వేశాయి.

టీ కణాలు దోహదం :

వైరస్‌లను ఎదుర్కోవడంలో కేవలం యాంటీబాడీలే కాకుండా శరీరంలో బీ, టీ కణాల వ్యవస్థ కూడా దోహదపడుతుంది. యాంటీబాడీలు తగ్గిపోతున్నా ఈ కణాలు చాలా కాలం పాటు ఉంటాయి. మళ్లీ అదే వైరస్‌ భవిష్యత్తులో శరీరంలో దాడి చేసినప్పుడు ఈ కణాలు వాటిని గుర్తించి వెంటనే ప్రతిస్పందిస్తాయి. అయితే, పూర్తి స్థాయిలో అవి పోరాడకపోయినా.. పరిస్థితి తీవ్రరూపం దాల్చకుండా రక్షిస్తాయి. అయితే, ఇటువంటి కణాలు ఎంతకాలం, ఏమేరకు పనిచేస్తాయన్న విషయం మాత్రం కచ్చితంగా తెలియదు.

వ్యాక్సిన్‌ తీసుకున్నా..జాగ్రత్తలు తప్పనిసరి :

కరోనా వ్యాక్సిన్‌లు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయని ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేమని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి కేవలం ఐదు నుంచి ఆరు నెలలు మాత్రమే అవుతున్నందున వీటిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top