పర్వతరాజు-పర్వతరాణి -- చందమామ కథలు
మహేంద్రగిరి రాజ్యంలో ఎక్కడ విన్నా ఒకే మాట. ఎటు తిరిగినా అదేమాట. నిన్నటి వరకు విడివిడిగా ఉన్న రెండు కొండలు, తెల్లవారే సరికి ఎలా ఒకటయ్యాయని ప్రజలు గుంపులు గుంపులుగా చేరి అబ్బురంగా మాట్లాడుకోసాగారు. ఈ సంచలన వార్త చెవినపడగానే మహారాజు ఇంద్రసేనుడు ఆ వింతను చూడడానికి స్వయంగా అక్కడికి బయలుదేరాడు. రాజ్యానికి దక్షిణ దిశలో ఎడమవైపున సుగంధగిరి, కుడివైపున సుగంభీరగిరి అనే రెండు కొండలు ఉండేవి.
రెండు కొండల నుంచీ, వెండి తీగల్లా జారే రెండు జలపాతాలు నేల మీద ఒకటిగా కలిసి చిన్న నదిలా కొండలను వేరు చేస్తూ ఉత్తరాభిముఖంగా ప్రవహించేవి. ఇప్పుడు హఠాత్తుగా ఆ రెండు కొండలూ ఒకటి కావడంతో రెండు జలపాతాలూ ఒకటిగా కలిసిపోయి మరింత పెద్ద పాయగా మారి ఉరుకుతున్నాయి. నదీ ప్రవాహం మరింత ఉధృతంగా తూర్పుదిశకేసి గలగలా సాగుతున్నది.
జలపాతం పక్కన ఒక దివ్యపురుషుడు విహరిస్తూండడం చూసిన రాజు ఆయనకు భక్తితో నమస్కరించాడు. "ఇంద్రసేన మహారాజు ఒంటరిగా ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది," అన్నాడు దివ్యపురుషుడు. "నిన్నటి వరకు విడి విడిగా ఉన్న గిరిశిఖరాలు హఠాత్తుగా ఒకటి కావడం అంతకన్నా ఆశ్చర్యం కదా! ఈ గిరిశిఖరాలు రెండూ ఒకటిగా కలిసిపోవడానికి గల కారణం దివ్యపురుషులైన తమకు తప్పక తెలిసివుంటుంది.
ఆ సంగతి వివరిస్తారా," అని వేడుకున్నాడు రాజు వినయంగా. "తప్పక చెబుతాను," అంటూ దివ్యపురుషుడు ఇలా చెప్పసాగాడు: సుగంధ పుష్పాలతో, ఫల వృక్షాలతో సుందరంగా ఉండే సుగంధగిరి మీద పర్వతరాణి నివాసముండేది. ఆమె దేవతలకు తప్ప మనుషులకు కనిపించేది కాదు. ఆ పర్వతంపైన చాలా చల్లగా ఉండేది. అందువల్ల వేసవి కాలంలో ఆ పర్వతం యాత్రికులతో చాలా సందడిగా ఉండేది.
ఆ సమయంలో పర్వతరాణి అదృశ్యంగా అటూ ఇటూ తిరుగుతూ, యాత్రికులందరికీ ఎలాంటి కొరతా లేకుండా చూసుకునేది. అంతే కాదు. తన వద్దకు వచ్చిన వారందరూ క్షేమంగా, సుఖసంతోషాలతో తిరిగి వెళ్ళాలని భగవంతుణ్ణి ప్రార్థించేది. సుగంధగిరి పక్కనే సుగంభీరగిరి ఉండేది. అక్కడక్కడ పెద్ద పెద్ద బండలు కనిపించినప్పటికీ అది కూడా పుష్ప ఫల వృక్షాలతో, జలపాతాలతో చూడడానికి అందంగానే ఉండేది.
అయినా ఎప్పుడుగాని, ఏఒక్కరూ అక్కడికి వెళ్ళేవారు కారు. ఆ పర్వత శిఖరాన నివసిస్తూన్న పర్వత రాజుకు ఇదెంతో అసంతృప్తిని కలిగించేది. పక్కనే ఉన్న సుగంధగిరికి ప్రజలెందుకు తరచూ తండోప తండాలుగా వెళతారో, తన కొండ మీదికి ఒక్కరు కూడా ఎందుకు రారో పర్వతరాజుకు అర్థమయ్యేది కాదు. సుగంధగిరి మీదికి సంతోషంగా వచ్చే పోయేవారిని పర్వతరాజు అప్పుడప్పుడు తన కొండపై కూర్చుని చాలా దిగులుగా చూస్తూండేవాడు.
అలా ఒక వైశాఖపూర్ణిమనాడు సుగంధగిరి యాత్రికులతో కళకళలాడుతోంది. ఎప్పటిలాగే పర్వతరాణి ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతూ యాత్రికులకు ఎలాంటి కొరతా రాకుండా అపురూపంగా చూసుకోసాగింది. పిల్లలు, పెద్దలు; స్త్రీలు, పురుషులు అందరూ తన పర్వతం అందచందాలను పొగుడుతూ ఉంటే విని మురిసిపోయింది.
ఆమె ఆనంద పరవశంతో చేతులు మోడ్చి ఆకాశం వంక చూస్తూ, "నా వద్దకు వచ్చే ప్రజలందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ సుఖసంతోషాలతో వర్థిల్లాలి!" అని భగవంతుణ్ణి మనసారా ప్రార్థించింది. అదే సమయంలో ప్రకృతి అందాలను చూసి మైమరచిన ఒక యాత్రికుడు కాలు జారి కిందవున్న ఒక అగాథంలోకి పడిపోయాడు. అతడి భార్యాబిడ్డలు ఆక్రందనలు చేశారు.
పర్వతరాణి అతణ్ణి రక్షించడానికి చేయి సాచింది గానీ, అంతలోనే అతడు ఆమె రక్షణరేఖను దాటిపోయాడు. తన వద్దకు వచ్చిన యాత్రికుడికి ప్రమాదం వాటిల్లినందుకు పర్వతరాణి నేత్రాలు బాష్పపూరితాలయ్యాయి. సుగంభీరగిరిపై కూర్చుని ఇదంతా చూస్తూన్న పర్వతరాజు, తన మహిమతో రెండు చేతులను మెత్తటి పరుపుగా మార్చి, యాత్రికుణ్ణి పట్టుకుని సురక్షితంగా సుగంధగిరి మీదికి చేర్చాడు.
తాను ఎలా బతికిందీ యాత్రికుడికి తెలియలేదు. అందరూ భక్తితో పర్వతానికి సాగిలపడి మొక్కారు. యాత్రికుణ్ణి ప్రాణాపాయం నుంచి కాపాడిన పర్వతరాజుకు, పర్వతరాణి కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు పర్వతరాజు, "నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇన్నాళ్ళూ, యాత్రికులు నీ వద్దకు మాత్రం ఎందుకు వస్తారు? నా వద్దకు ఎందుకు రారు? అని అసూయపడేవాణ్ణి. అయితే, అసలు సంగతి ఇప్పుడు గ్రహించాను.
నువ్వు నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటావు. భగవంతుణ్ణి ప్రార్థిస్తావు. నీ మంచి మనసు కారణంగా నీ వద్దకు వచ్చే వారందరూ సంతోషం అనుభవించగలుగుతున్నారు. నేను నా వద్దకు వచ్చే వారిని గురించి ఆలోచించను, పట్టించుకోను. అందువల్ల నా పర్వతం మీది ప్రకృతి శోభ ఇన్నాళ్ళూ లోభివాడి సంపదలా నిరుపయోగంగా ఉండిపోయింది," అన్నాడు. ఆ మాట విన్న పర్వతరాణి, "మంచి మనసున్న వారే మంచిని గ్రహించగలుగుతారు.
కాపాడిన నీ సాయం మరువరానిది. ఏదైనా కోరుకో. నీ కోరిక మన్నిస్తాను," అన్నది. అప్పుడు పర్వతరాజు మందహాసం చేస్తూ, "నీకు అభ్యంతరం లేకుంటే బంగారంలాంటి మనసున్న నిన్ను వివాహమాడాలని ఉన్నది," అన్నాడు. పర్వతరాణి సిగ్గుతో తలవంచుకుని, "నీవంటి మనోహరుడు వివాహ మాడతానంటే ఎవరు కాదనగలరు?" అన్నది. ఒక శుభముహూర్తాన దేవతల సమక్షంలో పర్వతరాజు, పర్వతరాణిని వివాహమాడాడు.
వివాహం జరిగిన మరుక్షణమే సుగంధగిరి, సుగంభీరగిరి రెండూ ఒకటిగా కలిసి ఒకే మహాపర్వతంగా ఏర్పడ్డాయి. ఆ రెండు పర్వతాల కలయికతో అంతకు ముందులేని అందమైన పుష్పాలు, కొత్త కొత్త ఫలవృక్షాలు, మహాజలపాతాలు ఏర్పడ్డాయి. రెండు చిన్న పర్వతాలు ఒకటై మహా పర్వతం ఏర్పడిన ఉదంతాన్ని వివరించిన దివ్యపురుషుడు, "పర్వత రాజునూ, రాణినీ ఆశీర్వదించాలని వారి వివాహానికి విచ్చేసిన నేను, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఇక్కడే ఉండిపోయాను.
నాతో వచ్చిన వారందరూ ఎప్పుడో వారివారి లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. నేనూ బయలుదేరుతున్నాను. ఈ సందర్భంగా నీకు ఒక ముఖ్యమైన ప్రకృతి రహస్యం చెప్పాలి. మానవులకు లాగే చెట్టూ చేమలకు, కొండా కోనలకు సైతం ప్రాణంతో పాటు భావోద్వేగాలు ఉంటాయి. వాటిని గౌరవిస్తూ, ప్రకృతికి అనుగుణంగా తమ జీవన విధానాలను ఏర్పరచుకునే మానవులు ఈ భూమి మీద సుఖసంతోషాలతో చిరకాలం వర్థిల్లగలరు. శుభమస్తు," అంటూ అదృశ్యమయ్యాడు.
ఇంద్రసేన మహారాజు ఆ మహాపర్వత గాంభీర్యాన్నీ, అక్కడి మనోహర సుందర ప్రకృతి దృశ్యాలనూ చూస్తూ కొంతసేపు గడిపి, పరమానందంతో రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీ సుగంధ మహాపర్వత పాదతలంలో యేటా వైశాఖ పూర్ణిమనాడు ఘనంగా వేడుకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు.
0 comments:
Post a comment