Monday 28 September 2020

బడికి పంపాలంటే భయం ..!

బడికి పంపాలంటే భయం ..!




కరోనా మహమ్మారి బడి ఈడు పిల్లలున్న తల్లిదండ్రులకు ఓ అంతుచిక్కని సమస్యలా మారింది. స్కూళ్లు తెరవక ఆరు నెలలుగా విద్యార్థులు ఇంట్లోనే గడుపుతున్నారు. హోంవర్కులు లేవు. ట్యూషన్లు లేవు. ఈమధ్య ప్రారంభించిన ఆన్‌లైన్‌ క్లాసులు ఉపశమనమే తప్ప అవి పూర్తి స్థాయి పాఠశాల వాతావరణాన్ని తీసుకురాలేవు. ఇటువంటి స్థితిలో స్కూళ్లు తెరవడానికి ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. అయితే ఈ ప్రయత్నం తల్లిదండ్రులను సందిగ్ధంలో పడేస్తోంది. కరోనా కోరలు చాచిన సమయంలో పిల్లలను స్కూలుకు పంపటం ఎలా అనేది వారి ఆవేదన, ఆందోళన. అనుకోని పరిస్థితుల్లో పిల్లలకు వైరస్‌ సోకితే ఎలా? వారు వాహకాలుగా మారి, కుటుంబంలోని పెద్ద వయసు వారికి సోకితే? ఇలాంటి అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి.

మన దేశంలోనే 80 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సుముఖంగా లేరని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఉన్నత విద్యావంతులు కూడా కరోనా తగ్గేవరకు తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేమని ఖరాఖండిగా చెప్పారు. కరోనా సృష్టించిన అగాథం 7 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది. ఈ నేపథ్యంలో పిల్లలు స్కూళ్లకు రావాలంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి. మరి అటువంటి కార్యనిర్వాహక ప్రక్రియ మొదలయ్యేది ఎప్పుడు? అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రారంభమైన స్కూళ్లల్లో పాటిస్తున్న నియమని బంధనలు ఒక్కసారి చూద్దాం.

ఎదురవుతున్న ప్రశ్నలు :

పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా? దాని గురించి ఏవిధమైన ప్రణాళిక వేయాలి?* తల్లిదండ్రులు, టీచర్లు అనారోగ్యం బారిన పడితే ఎలా? వారి ప్రాంతంలో కాని, ఇతర ప్రదేశాల్లో గాని ఎలా వ్యవహరించాలి? పాఠశాలలో ఉండే వెంటిలేటర్‌ సామర్థ్యం ఎంత? వైరస్‌ బారిన పడకుండా తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచడం ఎలా? ... ఇవీ అనేక దేశాల్లో ప్రస్తుతం తల్లిదండ్రులు, టీచర్లు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. ఈ అంశాలమీదే అమెరికాలోని 'నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడిసన్‌ (ఎన్‌ఎఎస్‌ఇఎమ్‌) జులై 15న ఒక నివేదిక సమర్పించింది.

వ్యక్తి అభ్యసన అనుభవాల వల్లనే అన్ని వయసుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వర్చువల్‌ అభ్యసన తరగతులు దీర్ఘకాలం కొనసాగిస్తే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా, మానసికంగా పిల్లలకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకం, మనోవికాసం వంటి సేవలు నిలిపివేశారు. వాటిని పునరుద్ధరించినా పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపించకపోవచ్చు. అందుకే పున్ణప్రారంభమౌతున్న పాఠశాలలు పిల్లలకు కల్పించే వసతులు, వాటివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి తల్లిదండ్రులకు అందుకు సమాయత్తం చేయాలని నివేదిక పేర్కొంది.

ఏం చేయాలి ...

పాఠశాల సిబ్బంది కచ్చితంగా శానిటైజ్డ్‌ మాస్క్‌లు ధరించాలి. ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరగతి గదులను పునర్వవస్థీకరించాలి. భోజనానికి కూర్చొనే ప్రదేశాలు, మరే ఇతర ప్రదేశాలలోనైనా పిల్లలు గుంపులుగా చేరకుండా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్యను వీలైనంత తక్కువగా ఉంచాలి. ప్రతి రోజూ స్కూలు పరిసరాలను శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ సౌకర్యాలను పర్యవేక్షించేందుకు అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచాలి. ఈ వసతులను అన్ని పాఠశాలల్లో కల్పించేలా రాష్ట్రప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రజా ఆరోగ్యకేంద్రంతో అనుసంధానమై ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు విద్యార్థులకు అందించే వైద్య చికిత్సలో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఆవిధంగా ప్రభుత్వాలు ముందుజాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి.

వివిధ దేశాల్లో ...

యూరోపియన్‌ దేశాల్లో మొట్టమొదటిగా డెన్మార్క్‌ ఏప్రిల్‌లో స్కూళ్లు తెరిచింది. అక్కడ స్కూళ్లు పిల్లలను వీలైనంత తక్కువ బృందాలుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ పద్ధతి అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధిస్తుంది. మే నెలలో స్కూళ్లు ప్రారంభించిన జపాన్‌ మరికొన్ని మార్గదర్శకాలకు నాంది పలికింది. ఒక్కపూట తరగతులు నిర్వహించింది. పిల్లలు భౌతికదూరం పాటించేలా వారు కూర్చొనే సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరి చేసింది. తరగతి గదిలో కూర్చునే ముందుగానే ప్రతి విద్యార్థికి టెంపరేచర్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంది.

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి దూరం జరగడం ఒక మార్గం... వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడం మరొక మార్గం. కాని ఇప్పుడు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితి పూర్తి భిన్నమైంది. పిల్లల ఆరోగ్యం, వారి సంరక్షణ బాధ్యతలు, పిల్లల పెరుగుదలలో అత్యంత శ్రద్ధ వహించే తల్లిదండ్రులు ఒక్కసారిగా మారిన పరిస్థితులతో రాజీ పడలేక పోతున్నారు. అందుకే పిల్ల్లల బాధ్యతను అత్యంత శ్రద్ధగా అచ్చం తల్లిదండ్రుల వలె కాపాడుతామని భరోసా కల్పించాకే స్కూళ్లు తెరవాలి. 

Source : http://darsilivetv.com/post/Fear-of-being-sent-into-slavery



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top